Thursday, November 19, 2015

హమ్మబాబోయ్...

హమ్మబాబోయ్...
--------------------
భావరాజు పద్మిని - 19/11/15.

పూబోణుల పై మెరుగులు గాయబ్  
ఆంటీల మేక్ అప్ లు పోయెపోచె
సోగ్గాళ్ళ వేషాలన్నీ ఇట్స్ గాన్...
డాబులు చూపే దుస్తులిక వానిష్

ఎవరైనా ఒకటే అవతారం...
ఉన్న బట్టలన్నీ అటకెక్కి,
ఉన్ని బట్టలు దించి ఉతికేసి,
కదిలే గొర్రెల్లా, గంగిరెద్దుల్లా,
దీని దెబ్బకు తోకముడిచి,
నిండా కప్పుకు దాక్కోవాల్సిందే !


ఐస్ క్రీం లకు కాలం చెల్లింది,
ఏ.సి లకు రెస్టు దొరికింది,
వెన్నులో వణుకు పుట్టింది,
ఫానురెక్కలకు ఆర్నెల్లు విశ్రాంతి,
ప్రతిచోటా చలిమంటల సంక్రాంతి.

జానెడు బట్టలతో ఒళ్ళునింపుకునే
జాణలను సైతం దారికి తెచ్చి,
ముసుగు వీరులని వీరమ్మల్ని చూసి,
ముసిముసిగా నవ్వుతోంది చలిపులి.
హమ్మబాబోయ్... ఇకపై...
తాళజాల గలమా నీ ఉధృతి ?

Friday, November 13, 2015

కవ్వింతల కాపురాలు

కవ్వింతల కాపురాలు 
-----------------------
భావరాజు పద్మిని - 13/11/15

పెళ్ళైన కొత్తల్లో...

"హొయ్... హొయ్, హొయ్... జింగిచకా, హొయ్, లస్కుటపా , ఆహా, హోయ్యరే హొయ్య..."
"ఓహో, ఆ మల్లెపూలు అమ్మే కుర్రాడు నన్ను ఆంటీ అన్నంత మాత్రానికే ఇంత సంబడం. హోయబ్బా... ఏదో ఒకరోజు ఎవరో ఒకరు మిమ్మల్ని అంకుల్ అనకపోతారా, నేనూ డాన్స్ ఆడకపోతానా ?"
కొన్నాళ్ళకి...
"అంకుల్ జీ, మీ కార్ కీస్ హోటల్ లో టేబుల్ మీద మర్చిపోయారు... " అంటూ ఇచ్చింది ఒక చిన్ని పాప.
"మా అమ్మే, మా తల్లే, ఏమన్నావు, మళ్ళీ పిలువు తల్లీ..."
"అంకుల్ అన్నాను..."
"విన్నారా, గుర్తు పెట్టుకోండి." ఇంటికి వెళ్ళాకా...
" ఓహో లగుజిగి లగుజిగి జిగులగి లంబాడోల్లన్నా, నువ్వు సిందులాడ రన్నా..."
"మరీ అంత సంబరం ఎందుకో, నన్ను ఉడికించాలనా ?"
"ఏం, మీరు నన్ను ఉడికించలేదూ... ఇదీ అంతే. "
*******************************************************
కొన్నేళ్ళ తర్వాత...
"చూడు, చిటికెన వేలు లాగా ఉండేదానివి, ఇప్పుడు బొటన వేలు లాగా తయారయ్యావు. ఆ జబ్బలు చూడు, జబ్బల్పూర్ రాణికి కూడా ఇంత దిట్టంగా ఉండవు, ఈ రోజు నుంచి, నీకు 'వీరబాహు' అని నామకరణం చేస్తున్నానోయ్. 
"అదేం పేరు ? ఇన్నాళ్ళు, ఏదో సుబ్బలక్ష్మి, వేంకటలక్ష్మి అని పిలిస్తే, పోన్లే అని పలికాను. మరీ వీరబాహు ఏమిటి ? అయినా ఇద్దరు పిల్లల్ని కన్నాకా, ఐశ్వర్యా రాయ్ లాగా ఉండాలంటే ఎలా కుదురుతుంది ? ఇలా పిలవడానికి నేనొప్పుకోను..."
"ఓహో, నీకు ఉడుగ్గా ఉందీ, అయితే ఇదే పేరు ఖాయం చేస్తున్నా... " 
"పిల్చుకోండి, నా పేరుతో పిలిస్తే తప్ప చస్తే పలకను. ఆ."
ఈ లోగా సీన్ లోకి కొన్నాళ్ళకి ఒక చుట్టాలావిడ వచ్చింది.
"మీ ఆయన పూర్తిపేరు నీకు తెల్సటే అమ్మాయ్..."
"లేదండి"
"హయ్యో... నే చెప్తా రాసుకో...వేంకట వీరభద్ర నాగ దుర్గ రామ సత్యసాయి ... చివర్లో నీకు తెల్సిన పేరు ..."
"ఏవిటీ, నిజమే..."
"అవునే..."
"ఉండండి, నోరు తీపి చేస్తాను. చల్లటి వార్త చెప్పారు..."
శ్రీవారు ఇంటికి రాగానే...
"ఏవోయ్ వీరభద్రం... ఓ సారి పాప ఏడుస్తోంది, ఎత్తుకోండి."
"ఎవరూ వీరభద్రం, నేనేం కాదు..."
"తెలిసిందిలే, తెలిసిందిలే... శ్రీవారు మీ పేరు తెలిసిందిలే..."
"అయినా నేనొప్పుకోను... "
"ఏవిటి ఒప్పుకోను, పేరులో వీరభద్రం పెట్టుకుని, ధర్మపత్ని దగ్గర ఏడేళ్ళు ఆ సంగతి దాచి, పైగా వీరబాహు అని పేరు పెడతారే. హన్నా !"
"అదేం కుదరదు... అలా పిలవద్దు..."
"హైసల్లక్కిడి హై... హొయ్, హొయ్, హొయ్..."
"అమ్మా, మా అమ్మతో చెప్తానాగు నీ పని..."

******************************************
మరో 8 ఏళ్ళ తర్వాత...
"నిద్దర్లో ఆ గురక ఏవిటి నాయనా, నిద్దరట్టక చస్తున్నాను..."
"ఒహొహ్... నువ్వు నిద్దరోతే, ఏనుగులోచ్చి తొక్కినా లేవవు అని లోకానికి తెలుసోయ్... కొయ్యకు, నేను గురక పెట్టడం ఏమిటి ?"
"సరే, ఈ సారి పెట్టినప్పుడు, ఫోన్ లో రికార్డు చేసి వినిపిస్తా..."
ఓ వారం తర్వాత..."ఆ రండి బాబూ, రండి... ప్రణవ నాదం వినిపిస్తా... " అంటూ ఫోన్ రికార్డు ఆన్ చెయ్యగానే...
"తూచ్, ఇది నా గొంతు కాదు, ఎవరో డూప్ ది. నేనొప్పుకోను."
కొన్నాళ్ళకి...
"డాడీ, రాత్రి అమ్మ గురక పెట్టింది, పాతాళ లోకం నుంచి భూతాలు వచ్చి అరుస్తున్నట్టు ఏం సౌండ్ డాడీ... "
"ఆహా, నా బంగారుతల్లి, భలే చెప్పావమ్మా..."
"పిల్లికి ఎలుక సాక్ష్యం లాగా బానే ఉందే యవ్వారం. ఏవిటే, పిట్ట కూతకి వచ్చింది ? మీ నాన్న కూడా పెడతారు గురక..."
"ఏమ్మా, నువ్వు చెప్పు, నేను అమ్మంత పెద్దగా గురక పెడతానా ?"
"లేదు నాన్నా... నీ గురక టీవీ మ్యూట్ లో పెట్టినప్పుడు సౌండ్ లాగా 'కుయ్...' అని చిన్నగా వస్తుంది. అమ్మ గురక ఫుల్ వాల్యూం లో..."
"బొత్తిగా భయం లేకుండా పోతోంది... మిమ్మల్నీ... "
***********************************************
ఏమైనా... ఆలూమగలు కలిసి జీవిస్తూ, కలిసి కవ్వించుకుంటూ సాగే ఈ జీవనయానంలో ఈ మధుర జ్ఞాపకాలు అందరికీ సహజమే కదూ... మీకూ ఇలాంటి అనుభవాలు ఉన్నాయా ?

Wednesday, October 14, 2015

నలకలతో నాన్

నలకలతో నాన్ 
---------------
భావరాజు పద్మిని - 14/10/15 

టీవీ లో వస్తున్న 'సరికొత్త వంట ' కార్యక్రమం 1315 భాగాన్ని, ఎప్పటిలాగే పెన్ను డైరీ పట్టుకుని, రెప్ప వెయ్యకుండా చూస్తోంది వెంగళమ్మ. ఆ రోజు 'నలకలతో నాన్' అనే కొ(చె)త్త వంటకం చూపిస్తున్నారు.

టీవీ లో సగం మొహం జుట్టుతో కప్పుకున్న శాల్తీ వచ్చింది. పేరు జూలీ ట.
"చూడండి, నలకలు ఆరోగ్యానికి చాలా మంచివి. పైగా బియ్యం ఖర్చు, కూరగాయిల ఖర్చు కూడా ఉండదు. ముందుగా ఇల్లు మొత్తం బాగా డేకేస్తూ, కంటికి కనిపించిన నలకలు అన్నీ ఏరుకురావాలి. కంటి చూపు మందగించినవారు చీపురుకట్టతో ఊడ్చి, ఆ కసువును నాన్ కు వాడవచ్చు అనుకోండి..."

ఆశ్చర్యంగా తెరిచిన నోటిని ముయ్యడం కూడా మర్చిపోయి చూస్తోంది వెంగళమ్మ.

ఈ లోపు ఆంకరమ్మ జోక్యం కల్పించుకుని, "అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది, చెప్పండి జూలీ  !" అంది.

"చూడండి, మట్టిలో చాలా శక్తి ఉంటుంది. చిన్నప్పుడు మనం మట్టి తినేవాళ్ళం కదా ! మరి నేటి తరం వారు ఇంక్యుబేటర్ కోళ్ళలా ఏసీలలో పుట్టి, ఏసీలలో పెరుగుతున్నారు. మరి వాళ్లకు బలం ఎలా వస్తుంది ? మట్టికి దూరమై మళ్ళీ 'మడ్ బాత్ లు' అంటూ వెళ్తున్నారు. అంతెందుకు శ్రీకృష్ణుడే మన్ను తిన్నాడు కదా ! అందుకే, అదే ఐడియా ను వాడి, ఇది తయారుచేసాను." అంది జుట్టు ఎగరేస్తూ జూలీ.

ఆ తర్వాత కసువు ఏరడం, చెంచాడు మైదా పిండితో కలిపి నాన్ చెయ్యడం, చెప్పింది చెప్పినట్టు రాసుకుంది వెంగళమ్మ, ఆమె కేవలం రాసి ఊరుకునే రకం కాదు, చూసి ఊరుకోమంటే, నాన్ లు చేసి, కాల్చి కాని, ఊరుకోదు. సాయంత్రానికి నలకలతో నాన్ లు సిద్ధమయ్యాయి. ఆవురావురు మంటూ ఇంటికి వచ్చాడు ఆదికూర్మయ్య. వేడి వేడి రొట్టెలు, నోట్లో పెట్టగానే పంటికింద కసక్కుమని, జ్ఞానదంతం ఊడినట్లు అనిపించింది. అంతే, చంటబ్బాయ్ సినిమాలో శ్రీలక్ష్మి వంట తిని, మతి చెడిన ఎడిటర్ లాగా ఇలా మాట్లాడసాగాడు...



"ఏమేవ్... ఆ మొలతాడుతో స్కిప్పింగ్ ఆడద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను ? తనకు పోటీ వస్తున్నావని, పూలన్దేవి నొచ్చుకోదూ... అయినా బాహుబలి నేను ఎందుకు తీసాను, రుద్రమదేవి సినిమాకు బదులు దీనికి అవార్డు ఇస్తుందనే కదా... మరి ఆ రాజ్ మౌళి అలా అంటాడేవిటి ? కట్టప్ప కట్టుడు పళ్ళు నేను కొట్తేసాను అంటాడేవిటి ?

ఇదిగో, ఎవరక్కడ, వెంటనే ఒక డైనోసార్ ని సైకిల్ తొక్కుకుంటూ రమ్మనండి. హారీ పొట్టర్ హారతి ఇస్తాట్ట. అసలే ఆ చక్కరపొంగలికి దిష్టి తగిలి, చక్కెర వ్యాధితో ఐ.సి.యు లో వెంటిలేటర్ మీదుంది. నేనెళ్ళి చూసొస్తా.

భౌ, భౌ... ఏమేవ్... ఆ కుక్కకి కాసిన్ని పాం బిళ్ళలు పెట్టు, దాని అరుపులకి భయపడి, పిపీలికానికి హార్ట్ అటాక్ వచ్చిందట. వస్తామారి, రేపు కాట్ విన్స్లెట్ నాతో కోతికొమ్మచ్చి ఆడతానంది. నేను వెంటనే వెళ్లి, ఓ బుల్ డోజెర్ అద్దెకు తేవాలి. " అంటూ బైటికి వెళ్లిపోతుంటే... చటుక్కున లాగి, బలవంతంగా కుర్చీకి కట్టేసింది వెంగళమ్మ. ఆ క్షణం నుంచే, 'న కరోమి టీవీ వంట జిందగీ మే...' అన్న కొత్త నోము పట్టింది. అంటే ఏవిటో తెలిసిందిగా, అదన్నమాట !

Thursday, October 8, 2015

ఆశువుగా 'ఏక్ పటాకా' లు

ఆశువుగా 'ఏక్ పటాకా' లు
(అదేలెండి, ఏకవాక్య హాస్య కవితలు - అర్ధం చేసుకోరూ...)
ఎంతమంది దేవుళ్ళకి మొక్కుకుందో మరి నది - గుండ్రాళ్ళకి నున్నగా గుండు కొట్టేసింది.
కొండల్లో దేవతలు వంటలు చేసుకుంటున్నరేమో - మబ్బుల పొగలు వస్తున్నాయి.
మేక్ అప్ చేసుకుంటోంది చెట్టు - నీటి అద్దంలో చూసుకుంటూ.
మహేష్ బాబు లాగే దూకుడెక్కువ - జలపాతానికి.
కొట్టీ కొట్టీ బోర్ కొట్టిందట, మొరాయించింది - బోరింగ్ పంపు.
యెంత దాహమేసిందో, ఆపకుండా పెట్రోల్ తాగేస్తోంది - లారి.
గంపెడు జ్ఞాపకాలు తిన్నట్టు నెమరేస్తూనే ఉంటుంది - గేదె.
మొక్కే కదా అని పీకినా మళ్ళీ మొలుస్తుంది - గడ్డి పరక.
రోజూ హోలీయే - ఊసరవల్లికి.
ఎన్ని రాసినా మింగేసి, ఆవులిస్తూ ఇంకేంటి అంటుంది - పేస్ బుక్.
వీటిలో మీకు నచ్చిన వాటికి వోట్ చెయ్యండి. నచ్చితే బ్యాంకు ఎకౌంటు నెంబర్, నచ్చకపోతే, క్రెడిట్ కార్డు నెంబర్, పిన్, ఇతర వివరాలతో సహా నాకు మెసేజ్ ఇవ్వండి.
ప్రత్యేక ఆఫర్ : కార్డు వాడిన ప్రతి సారి, మీ మొబైల్ కు ఉచితంగా మెసేజ్ వచ్చే సదుపాయం ముందే ఉందిగా ! అదే ఆఫర్ అన్నమాట !


Thursday, August 13, 2015

తూచ్ పజ్యాలు

తూచ్ పజ్యాలు (సరదాగా నవ్వుకోడానికే నండోయ్ )
---------------------------------------------------------

- భావరాజు పద్మిని 

అయ్యలారా ! అమ్మలారా ! ఇవాళే ఒక కొత్త పజ్జ ప్రక్రియ కనిపెట్టేను. రవ్వలు, చువ్వలు, అజ్నానీలు లాగా... ఇదికూడా వెరైటీ అన్నమాట ! 'ఆటవిక అట్ట ప్రవేశంలో' (wild card entry) నా ఈ ప్రక్రియ తెలుగు ఛందస్సు లో దొడ్డి దారిలో చేరాలంటే, మీరంతా ఈ ప్రక్రియ మీకు నచ్చితే... 'భళా !' అని 100 నెంబర్ కి, నచ్చకపోతే 'అంతా అయిపొయింది' అని 108 నెంబర్ కి sms పంపగలరు.
తూచ్ పజ్యం 
-------------
మాచ్ ఆడుతున్న క్రీడాకారుడు
హాచ్ అనుచు తుమ్మి అపశకునమనుచు
తూచ్ అని బయల్పడెన్ అదిగని
కోచ్ లబోదిబోమనగ ఆట గోవిందాయెన్



హా, ఇప్పుడు ఈ పజ్జ ప్రక్రియ గురించి, ముఖ్యంగా ఛాందసులు అయిన పెద్దవాళ్ళకి చెప్పాలి. వేదాంతం పెకారం నిజానికి మనం చూసేది అంతా తూచ్... అంటే మిధ్య. అందుకే ఈ పేరేట్టాను. ఇందులో ప్రతి పాదంలోనూ రెండో అచ్చరం 'చ్' రావాలి. యతి నియమం, అక్షర నియతి లేవు. కొన్ని అన్యభాషా పదాలు కలిసిన ఈ పజ్జ ప్రక్రియను పెనుప్రమాదం(మణిప్రవాళం ) అంటారు. మీరూ ప్రయత్నించండి , వోట్ చెయ్యడం మరువకండి.


Sunday, July 26, 2015

మౌనాన్ని తిందాం రా !

 మౌనాన్ని తిందాం రా !
-------------------------
- భావరాజు పద్మిని 
ఎన్నాళ్ళని ఈ పులిహోరలు, పాకుండలు తింటాం ?
ఎన్నేళ్ళని ఈ పిజ్జాలు, పాప్కార్న్ లు తింటాం ?
ఎన్ని రోజులని ఫేస్బుక్ లో, వాట్స్ ఆప్ లో చాటుతాం?
ఎన్ని డబ్బులని మొబైల్ బిల్లుకు కడతాం, నువ్వే చెప్పు?

అందుకే ప్రియా...
ఇద్దరం కాస్త మౌనాన్ని తిందాం రా !
గుటుక్కున నిశ్శబ్దాన్ని మింగుదాం రా !
పుటుక్కున శూన్యాన్ని తాగుదాం రా !
లటుక్కున దైన్యాన్ని తరుముదాం రా !
ఘబుక్కున దూరాన్ని పిండి ఆరేద్దాం రా !
రిన్ సబ్బుతో ప్రేమనుతికి తెల్లగా మెరిపిద్దాం రా!

కూలింగ్ గ్లాస్సెస్ తో కళ్ళు నెత్తికెక్కి,
డబ్బుతో జబ్బుచేసిన ఈ పాడులోకంలో 
స్వచ్ భారత్ లా స్వచ్చమైనవి ఇవే ప్రియా...
చీపురుతో గుండె గూటిని ఊడుద్దాం రా !
చాటతో ప్రేమ తాట తీసి, ఎత్తేద్దాం రా !



Monday, July 13, 2015

భీభత్స కవిత


అదేవిటోనమ్మా... ఇవాళ కవితలు తన్నుకోచ్చేస్తున్నాయి.... మరొక నవజాత కవిత....
భీభత్స కవిత 
- భావరాజు పద్మిని, సెప్టెంబర్ 6,2013 

అర్ధరాత్రి... అమావాస్య....

కరకింకర స్మశానంలో 
కరకరా జంతికలు తింటూ,
రాంగోపాల్ వర్మ సినిమా చూస్తున్నాడు.

ఉన్నట్టుండి ఉలిక్కిపడ్డాడు 
బిక్కచచ్చిపోయాడు...
పిల్లదేయ్యం వీపు తట్టింది.

అంతే ,
సుడిగాలిగా గాల్లో తేలుతూ 
రాంగోపాల్ వర్మ ఇంటికి వెళ్ళాడు.
వికటాట్టహాసం చేసాడు.
లెంపకాయ్ కొట్టి,


దెయ్యాలు కూడా బెదిరి చచ్చేట్టు 
ఏవిటా దిక్కుమాలిన సినిమాలు...
నీ పిండం పిల్లదేయ్యలకు పెట్టా!
అంటూ బిగ్గరగా ఆర్తనాదం చేసాడు.

ఒక్కసారి కరకింకరను తేరిపారా చూసి,
ఆవులించిన అభినవ భీబత్స దర్శకుడు,
ఎల్లెల్లవో, సినిమాల్లో చాలా చూపించాం 
నీ లాంటి ఆకారాల్ని, అంటూ...
ఆవులించి, మళ్ళీ నిద్రపోయాడు.

టీవీ చూసి వండండి

'ఏవండి, ఇవాళ టీవీ లో ఈ కొత్త వంటకం చూపించారు. కష్టపడి చేసాను ,రుచి చూసి, చెప్పరూ.'

'ఓ ఏదీ ఇటివ్వు. ఆహా, చిన్నప్పుడు తిన్న సబ్బు ముక్కను గుర్తుకు తెచ్చావు, ఇంతకీ ఈ పదార్ధం ఏవిటి తల్లి ?'

'ఉ తీ కా హల్వా ' అండీ. అంటే, ఈ హల్వా లో ఉప్పు, కారానికి పచ్చి మిరపకాయలు, తీపికి బెల్లం,వెయ్యాలన్నమాట. మొదటి అక్షరాలు కలిపి ఆవిడే ఆ పేరు పెట్టిందట. '

'అలాగా, యెంత సృజనో, పిచ్చి తల్లికి. ఇంతకీ ఈ వంటకం వండాకా ఆ వండిన శాల్తీ తిందా?'

'లేదండి, ఆంకరమ్మ తిని యెగిరి గంతేసింది.'

'వెంటనే వెనక్కి తిరిగి ఉమ్మేసి ఉంటుంది. నీ లాంటి గొర్రెలు ఆ ఆంకరమ్మ హావభావాలు చూసి, వెంటనే కొత్త వంటలు వండేసి ,ఇలా మంగళ సూత్రాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇదిగో, ఈ సారికి ఎలాగో నియంత్రించుకున్నాను గాని, ఇంకోసారి ఇలాంటి వంటకాలు చేసావంటే, ఇద్దరం ఎర్రగడ్డలో చేరాలి. నేను పేషెంట్ గా, నువ్వు నాకు ఆయాగా.'


వంట చెయ్యడం ఎలా ?


వంట చెయ్యడం ఎలా ?
=============
- భావరాజు పద్మిని, april 24,2013
చదువు అయ్యాకా, కాంపస్ సెలెక్షన్ లో ఉద్యోగం రావడం, తరువాత వెంటనే ప్రవాసీయుడితో పెళ్లి కుదిరిపోవడంతో, విదేశాలకు వెళ్ళిపోయింది స్వీటీ. స్వీటీ కి స్వీట్లు రావు...చాలా సమయం ట్విట్టర్ లో ట్వీట్లకే సరిపోయింది. ఆ పై పేస్ బుక్ లో, మొబైల్ లో చాట్లకు సరిపోయింది. ఇక స్వీట్లు, హాట్లు చెయ్యడం అసలే రాదు...ఆ మాటకొస్తే అసలు వంటే రాదు...దానితో సాపాటు కోసం పాట్లు మొదలయ్యాయి.

విదేశాల్లో భారతీయ ఆహారం దొరుకుతుంది. కాని ఖరీదు చాలా ఎక్కువ. రోజూ తింటే, డాలర్లు కరిగిపోతాయి...మరెలా? 'గూగుల్ మాతా శరణం ...' అనుకుంది...కేవలం గూగుల్ కే న్యాయం చేస్తే ఎలా? ఒక్కో వంటా ఒక్కొక్క విధంగా చెయ్యాలి ...ఈ స్వీటీకి సాటి లేదని అనిపించాలి. ఏం చేద్దాం...గూగుల్ లో గుత్తి వంకాయ కూర, ట్విట్టర్ లో టమాటో పప్పు, పేస్ బుక్ చాట్లో పులుసు వెతికి, అడిగి, తెలుసుకుని చెయ్యాలి...అనుకుంది.

తక్షణమే ఒక్క బండ వంకాయ రెండు డాలర్లు, నాలుగు గజ టమాటోలు నాలుగు డాలర్లు, ఉల్లిపాయలు, మిర్చి, ములక్కాడలు వెరసి ఇరవై డాలర్లు పెట్టి కూరలు తెచ్చింది. వెంటనే ఎలా వండాలో ప్రశ్నల వర్షం కురిపించింది.


గుత్తి వంకాయకి, ఖారం నూరి, కూరి, నూనెలో వెయ్యాలని చదివింది. ఆ గజవంకాయ చీల్చి, కారం కూరి నూనెలో వేసింది. క్షణాల్లో మూకుడు నిండా ముంతడు నీళ్ళు తేలాయి..'.షిట్...ఈ వంకాయ చిన్నప్పుడు ఎక్కువ నీళ్ళు తాగేసి ఉంటుంది. ', అనుకుంది. గూగుల్ లో చెప్పినట్టు పది నిముషాలకు స్టవ్ ఆఫ్ చేసింది.

ట్విట్టర్ లో ట్వింకిల్ టొమాటోలు, కందిపప్పు కలిపి నీళ్ళు పోసి, కుక్కర్ లో పది నిముషాలు పెట్టమంది. 'ఆ వంకాయ నీళ్ళు తగేసినట్టు, కందిపప్పు,టొమాటోలు కూడా తాగేసి ఉంటాయి.అందుకే, నీళ్ళు అక్కర్లా!,' అనుకుని, కుక్కర్ లో నీళ్ళు పొయ్యకుండా పెట్టి, తర్వాత ఆపేసింది.

ఇక పులుసులో ములక్కాడలు, ఉల్లిపాయలు, ఇలా చెప్పినవన్నీ కలిపి స్టవ్ మీద పెట్టి, రైస్ కుక్కర్ లో బియ్యం పెట్టసాగింది. పని అలవాటు లేకపోవడంతో, యూసర్ మన్యుఅల్ చదువుతూ , చాలా సమయం తీసుకుంది. ఈ లోపు పులుసు ఇగిరి, గిన్నె మాడువాసన వచ్చింది. పోనీలే, పప్పు, కూరా ఉందిగా, ఇవాళ హబ్బి కి సర్ప్రైస్ ...అని, సరిపెట్టుకుంది.

తీరా చూస్తే, నీళ్ళు తగ్గడంతో, పప్పు ఉడకలా, వంకాయ ఉడక్క, కండ్ర పట్టి చేదు వచ్చింది. అలసటతో , నిస్సత్తువతో, బిక్క మొహం వేసిన స్వీటీ ని చూసి, జాలేసిన హబ్బి, ఆమెను వోదారుస్తూ...బాధపడకు, వంట చెయ్యగా, చెయ్యగా వస్తుంది. మనుఅల్స్ చదివితే రాదు...కోటి విద్యలూ కూటి కొరకే అన్నది మర్చిపోయి, కెరీర్ కోసం పరుగులు పెడుతూ, చివరికి నీలా, నాలా దేశాలు పట్టుకు తిరుగుతూ, తిప్పలు పడేది ఎందరో...

నీకో సర్ప్రైస్ ...ఇదిగో మహత్తరమయిన ప్రియా ఆవకాయ, గోంగూర, ఇవాళే స్టోర్ లో కొన్నా...ఇదీ, యోగర్ట్...ఇంతకంటే, మన తెలుగు వాళ్లకు ఏం కావాలి చెప్పు, స్మైల్ స్వీటీ...'అన్నాడు. హమ్మయ్య, అనుకుని నిట్టూర్చి, స్వీట్ గా నవ్వేసింది స్వీటీ...

[ ఒక ఆప్తురాలి కోరికపై ఈ సరదా వ్యాసం...ఆమెకే అంకితం]  

Saturday, June 20, 2015

'ఏక్ ' బాదుడు

'ఏక్ ' బాదుడు

భావరాజు పద్మిని 
(ఒకరు కనిపెట్టిన ఒక ప్రక్రియ విజయవంతం కాగానే అంతా దాన్నే అనుకరిస్తారు. ఒకరు కనిపెట్టిందే పట్టుకు రాస్తుంటే, ఇక కొత్తగా సృష్టించేది ఏముంటుంది చెప్పండి ? అందుకే... ఏక వాక్య కవితలు... దీనిపై సరదాగా... ఒక పారడీ. )

ఆకాశానికి జలుబు చేసింది, వానగా దాని ముక్కు కారింది.

మంచుకు చలేసింది, చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.

మబ్బులకి ఆకలేసిందేమో, చంద్రుడిని కొరుక్కుతిన్నట్టున్నాయి.

ఏషియన్ పెయింట్ డబ్బాలు ఒంపేసారేమో, అంబరం వర్ణరంజితమయ్యింది.

ఉరుముకు కోపం వచ్చినట్లుంది, దిక్కులు పిక్కటిల్లేలా గర్జిస్తోంది.

(హమ్మయ్య, పాంచ్ పటాకా అయిపోయింది, మళ్ళీ తర్వాత రాస్తానే ... రెప్ప వెయ్యకుండా చూస్తూ ఉండండి.)

'వర్ణాన' తీసివేత

'వర్ణాన' తీసివేత
- భావరాజు పద్మిని.

ఊరందరిదీ ఒకదారి, ఉలిపి కట్టెది ఒకదారి... అన్నట్లు ఉంటాడు గోవర్ధనం. ఎప్పుడో అతనికి ఇడ్లీ సబ్బునురుగులా కనిపిస్తుంది... వాలుజడ బఱ్ఱె తోక లా కనిపిస్తుంది, బంతిపువ్వు ఎండలో మెరిసే బోడిగుండులా అనిపిస్తుంది. అరె, మీకింకా అర్ధం కాలేదా ? గోవర్ధనానికి ఒకరు వాడిన వర్ణనలే వాడడం నచ్చదు, అందుకే వెరైటీ గా ట్రై చేస్తుంటాడు. ఒకసారి 'ప్రేమ ప్రేమకోసం ప్రేమను ప్రేమిస్తుంది, ఎందుకో అడక్కు' అనే పేస్ బుక్ గ్రూప్ వాళ్ళు ప్రేమ కవితల పోటీ పెట్టారట ! అందుకోసం మనవాడు ఓ కవిత రాసాడు. ఇంతకీ ప్రైజు వచ్చిందో లేదో, చదివి, మీరే చెప్పాలి.

ప్రియా,
కంకరాళ్ళ లాంటి నీ కళ్ళు చూసి,
నా గుండెల్లో రాయి పడింది.

పిడుగు పడ్డట్టు నీ మాట విని,
నాక పిడిగుద్దులు గుద్దినట్టు ఉంది.

చీపురుకట్ట లాంటి నీ చింపిరిజుట్టు ఎగిరితే,
నాకు ప్రేమ దయ్యం పట్టినట్లు ఉంది.

కప్ప గెంతుల్లాంటి నీ నడక చూసి,
నా మనసును గోతిలో కప్పెట్టినట్టుంది.

కదిలే రోడ్డు రోలరు లాంటి నువ్వు,
నీ ఏనుగు పాదాల కింద నన్ను చిదిమేసావు.

అంచేత, ప్రేమ గొంగళి కప్పుకున్న నన్ను,
గుడ్డులోంచి బైటికి లాగి బటర్ఫ్లై లా ఎగరనివ్వు.


వాటర్ ట్యాంక్ లూ నీరంత ప్రేమని, నాకందివ్వు.
ఖాళీ గా ఉన్న నా గుండె బాల్చీని నింపు .

నీ తల్లో పేనులా, నీ మెళ్ళో చున్నీ పాములా,
నీ గోళ్ళలో మట్టిలా, నీ చెవిచుట్టూ దోమలా,
తిరుగుతూ ప్రేమ ఇసుక తుఫాను సృష్టిస్తా.

జన్మజన్మలకి నీకే లైఫ్ టైం వాలిడిటి రాసిస్తా,
ఈ పోటీలు పెట్టిన వాడి మీద ఒట్టు ! నిజ్జం !


Saturday, June 6, 2015

ఆరు నూరైతే

ఆరు నూరైతే

భావరాజు పద్మిని - 6/6/15

చదవడానికి ఇది నికృష్టంగా ఉంటుందని తెలుసు ! అయినా, చదవడానికే మీకు అంత కష్టంగా ఉంటే, తరతరాలుగా, అవే సినిమాల్లో హీరొయిన్ ను అవే వేషాల్లో చూసి, మాకెంత విసుగు పుట్టాలి ? ఏ సినిమా చూసినా, కాస్త ఫ్యామిలీ సెంటిమెంట్, కాస్త ఫ్యాక్షన్, బోలెడంత డబ్బున్న హీరో, అతనికి 2-3 హీరొయిన్ లు, అవీ కొసరు పాత్రలు. గత కొన్నేళ్లుగా ఇంతేగా ? అప్పుడెప్పుడో మా అమ్మమ్మ చెప్పినట్లు 6 రూపాయిలకు దొరికే బియ్యం బస్తా, నూరయ్యి, ఇప్పుడు వేలు కూడా దాటింది. అందుకే, సినిమా చూసేవారు హీరో పాత్రలో హీరొయిన్ ని ఊహించుకుంటే... ఎలా ఉంటుందో, మీరే చదవండి.

ఓపెనింగ్ షాట్... హీరొయిన్ కాలి చెప్పు చూపుతారు. అక్కడినుంచి ఆమె జడగంటల దాకా ఓ మూడు నిముషాలు కెమెరా ఆవిడ చుట్టూ తిరుగుతుంది. ఆవిడ, జడ ముందుకు లాగి ఎడమ ప్రక్కకు కొడుతుంది - ఎడమ ప్రక్క ఉన్న సుమో ఆకాశాకర్షణ వల్ల గాల్లోకి ఎగిరి పేలిపోతుంది . అలాగే ఈ సారి జడను విసురుగా కుడిప్రక్కకు లాగి కొట్టగానే - ఇంకో సుమో, అదన్నమాట ! డౌట్ లు అడక్కండి, తెలుగు ప్రేక్షకుడి స్థాయి వెర్రిమొహం వేసుకు చూడడం వరకే ! తొడ కొడితే ఎగిరే సుమో, జడ కొడితే ఎందుకు ఎగరదూ అంట ? ఆ తర్వాత హీరొయిన్ తన కాలి బొటన వేలుతో రౌడీల్ని తాకగానే, వాళ్ళు బుర్రలు పగిలి, కలవరంగా పరిగెత్తుతారు. ఆమె చేతి మునివేళ్ళు రౌడి లకు తాకగానే, వాళ్ళు భూమిలోకి కూరుకుపోతారు. అప్పుడు హీరొయిన్ (మీసాలు లేవు కనుక ) కనుబొమ్మ  పైకెత్తి విలాసంగా చూస్తుంది. వెంటనే టైటిల్ సాంగ్. 'చేతికింద కొస్తే చెయ్యి దెబ్బ... కాలికింద కొస్తే కాలి దెబ్బ...' అని.


కాని పాపం ఈవిడకి చాలా డబ్బు ఉంటుంది అన్నమాట. ఏం చేసుకోవాలో తెలీక, పనివాళ్ళని లెంపకాయలు కొట్టి, వెంటనే జాలిపడి, నోట్లు విసిరేస్తుంది. ఒకరోజున ఆవిడ తన హెలికాప్టర్ లో సరదాగా తిరగడానికి వెళ్తే, అదొక పొలంలో ఆగిపోతుంది. ఆ పొలంలో కండలు తిరిగి, గోచీ పోసుకు పని చేస్తున్న సుబ్బడు చాలా బీదవాడు. ఆపదలో ఆమెకు సాయం చెయ్యడంతో జాలిపడి, ప్రేమిస్తుంది(డబ్బివ్వచ్చుగా అని అడక్కండి, అదంతే ... లవ్ ఎట్ ఫార్మ్ సైట్ ). కాని, ఆమె ఇంటికి వెళ్లేసరికి, మరొక ఫ్యాక్షన్ 'ఇష్టుడి' కొడుకు 'ఎలుక్తో ఆమె పెళ్లి కుదిర్చేస్తారు. విసుగెత్తి, నైట్ క్లబ్ కి వెళ్తే, అక్కడ ఆరు కండలు (సిక్స్ ప్యాక్ ) కనిపించేలా ఐటెం సాంగ్ కి డాన్స్ చేస్తుంటాడు వీరమల్లు. హీరొయిన్ హృదయం చాలా విశాలమైనది కావడంతో ఇతడిని కూడా ప్రేమిస్తుంది. చివరికి అతిసుకుమారి అయిన మన హీరొయిన్ ఎవరిని పెళ్లి చేసుకుంది, అని ఆలోచిస్తూ, కాసేపు బద్దలుకొట్టుకున్న మన బుర్రలు స్తంభించిపోతాయి, పాటల కల్లోలంతో.

ఈ లోపల సుబ్బడి ఫ్యామిలీ సెంటిమెంట్, టన్నుల కొద్దీ మమకారాలు - ఎలుక్ ఫ్యాక్షన్ ఫ్యామిలీ కర్కశత్వం, కారే రక్తాలు, టమాటో సాస్ లు  - వీరమల్లు సినిమా కష్టాల ఫ్యామిలీ ఇక్కట్లు - వీటిమధ్య హీరొయిన్ ఎటూ తేల్చుకోలేక పోతుంది. ముగ్గురితో సమానంగా పాటలు పాడుకుంటుంది.  ఓ డజను వాహనాలు తగలేట్టాకా, 500 మంది ఆడ, మగ రౌడి లు రక్తాలు కక్కుకు చచ్చాకా...హీరొయిన్ లో ఉన్న అనేక సద్గుణాలు ప్రేక్షకులకి తెలుస్తాయి.

మధ్యమధ్య నటించిన వాళ్ళు మాత్రమే నవ్వే కొన్ని కామెడీ సీన్ లు వస్తాయి. టికెట్ కొన్నారు కనుక, మనమూ నవ్వక తప్పదు ! బీద హీరో తో  విదేశాల్లో అరువిచ్చుకున్న ఎక్ష్త్రా లకు బిచ్చగాళ్ళ వేషాలు వేసి, చిరుగు లుంగీలు కట్టి, డాన్స్ ఆడిచ్చాకా ... (ఊహలకి లిమిట్స్ ఉండవు... ఇక్కడా రూల్స్ పెట్టకండి ) వీరమల్లు చచ్చిపోతాడు, ఎలుక్ త్యాగం చేసి, చరిత్రలో నిలిచిపోతాడు. చివరికి తొలి ప్రేమ గెలుస్తుంది. హీరొయిన్ సుబ్బడిని పెళ్లి చేసుకుని, వెంటనే తన తోటమాలిని పన్లోంచి తీసేస్తుంది. ఇద్దరూ హాయిగా ఆడుతూ, పాడుతూ తోటపని చేసుకుంటూ ఉండగా... వస్తుంది ఒక చిన్న పాప. తన పరికిణీ అంచు పైకెత్తి కాలు నేల మీద కొట్టగానే, వీళ్ళు అప్పుడెప్పుడో పాతిన మొక్కలు కూకటివేళ్ళతో సహా పెకిలించబడి , నేల వాలిపోతాయి ... అప్పుడే చివరి కార్డు పడుతుంది... 'హిస్టరీ రిపీట్స్' అని ... పిక్చర్ ఔర్ ఏక్ ఐసే హీ బనేగా మేరే దోస్త్... వెయిట్ అండ్ వాచ్... :)

(ఫ్యాక్షన్ లేకుండా సినిమాలు తియ్యలేరా అని నాకో సందేహం. హీరొయిన్ స్థాయి హీరోతో ఒళ్ళు విరిగేలా గెంతులు వెయ్యడం, హీరో తంతుంటే ఓ మూల బిక్కుబిక్కు మంటూ నిల్చుని చూడటం తప్ప, ఎన్నటికీ పెరగదా అన్న అనుమానం... ఒక్క లక్కీ లెగ్ హీరొయిన్, ఒక గ్లామర్ హీరొయిన్, ఒక ఐటెం డాన్సర్ ... లేకుండా ఒక్క హీరొయిన్ తో కధ నడవదా అన్న ఆలోచన... అన్నీ కలగలిపి, నిన్న ఓ సినిమా చూస్తుండగా... 'హీరో హీరొయిన్ అయితే...' అన్న ఐడియా తో కలిగిన అజ్ఞానోదయ పరిణామం ఇది. )


Sunday, April 12, 2015

మీ నవ్వుల కోసమే !!!

 మీ నవ్వుల కోసమే !!!
-------------------------
భావరాజు పద్మిని - 11 /4/15 

"మూడిళ్ళ మంట " కార్యక్రమానికి స్వాగతం... ఈ రోజు మనం కైకలూరు నుంచి వచ్చిన ముగ్గురు ముద్దుగుమ్మల మధ్య వంటల పోటీ లైవ్ షో నిర్వహిస్తున్నాము.. " అనగానే 60 లు చేరువ అవుతున్నా, అరమీటర్ మందాన మేకప్ వేసుకుని, చాలా కష్టపడి తయారై వచ్చిన ముగ్గురు భా(బా)మ(మ్మ) లు మురిసి ముక్కలయ్యారు. ముందుగా వారు చెయ్యబోయే వంటలు, కావలసిన పదార్ధాల లిస్టు.. చెప్పారు. అది వినగానే టీవీ చూస్తున్న వాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మదిరిగింది (పండు గాడు కొట్టకుండానే !!). ఇంతకీ వాళ్ళు ఏం చేసారంటే... పల్లీ ఉయ్యాల ... జీడిపప్పు జిగురు, చీపురుపుల్లతో మైసూర్ పాక్... అవి  తిన్న ఆంకరమ్మ కు పిచ్చెక్కింది. ఈ లోపు వాటిలోని పోషకాల గురించి వివరించేందుకు డైటీషియన్ వచ్చింది.

"ముందుగా పల్లీ ఉయ్యాల ... పల్లీ లో ప్రోటీన్లు , క్రొవ్వులు ఉంటాయి. వాటిని కాకరకాయతో వేయించి, ఉయ్యాలలో కూర్చుని, తినడంవల్ల, చేదు తెలీదు. ఉయ్యాల ఊగడం ఆరోగ్యానికి చాలా మంచిదని, విదేశీయులు ఈ మధ్యే, కనుక్కుని, మనకు చెప్పారు.

అలాగే జీడిపప్పు జిగురు లో, జీడిపప్పు పొడిని, ఉడకబెట్టిన జిగురు లాంటి మైదాలో కలిపి, స్వీట్ చెయ్యడం వల్ల, చిగుర్లకు మంచి పని పెట్టి, వాటిని బలోపేతం చేస్తాయి. దీని పైన గార్నిష్ చేసిన ముల్లంగి ముక్కల్లో అనేక పోషకాలు ఉన్నాయి.

ఇక మైసూర్పాక్ చేసేటప్పుడు చీపురుపుల్లతో కలిపి చెయ్యడం వల్ల, విరిగిన చీపురుపుల్లలకి అంటిన మైసూర్ పాక్ ను లాలి పప్ లాగా చీక్కుంటూ తినచ్చు. ఇక చీపురుపుల్లలో పోషకాలు..." అనుకుంటూ బుర్ర గోక్కుంటూ ఆలోచించసాగింది... ఈ లోపల పిచ్చెక్కిన ఆంకరమ్మ మైక్ లాక్కుని... నే చెప్తా...




" పల్లేరుకాయతో ఉయ్యాలూగడం ఇది తిన్నప్పుడు ఈవిడ మొహంలా ఉంది. కావాలంటే చూడండి, " అంటూ ఆవిడ కొప్పు పట్టుకుని, గుప్పెడు పల్లీలు నోట్లో కుక్కింది. మిగతా ఇద్దరూ బెదిరి, అక్కడే గజగజ ఒణకసాగారు. వాళ్ళకీ ' ఇదిగో దా తిను , జిల్లెడుకాయ జిగురు - గన్నేరుకాయ తెవాల్సిందే, పర్లేదులే ఈ సారి తిను; నువ్ దా, చీపురుపుల్ల మింగు - నీ చీపురుపుల్ల మీద అగ్గిపుల్ల గీసి పారేయ్య' అంటూ వాళ్ళు చేసిన పదార్ధాలు కుక్కిన ఆంకరమ్మ, విరబోసుక్కున జుట్టున్న తల తిప్పుతూ,  పూనకం పూనినట్టు ఇలా అనసాగింది...

"ఓసి మీ మొహాలు మీరేసుకున్న మేకప్ తో సహా మండ ! ఇవేం వంటలే ... వీటి కంటే వేపాకుపసరు తాగడం నయం. అయినా, ఇలాంటి దిక్కుమాలిన ఐడియా లు మీకు ఎలా వస్తాయే ? దురదగుంటాకుతో పాలతాలికలు చేసే తింగరబుచ్చుల్లారా ! జాలిం లోషన్ తో జంతికలు చేసే మొహమూ మీరూనూ. పోట్లకాయతో పూర్ణాలు చేసే పాచి మొహాలూ మీరూనూ !గుమ్మడికాయతో ఆవకాయ పెట్టే పీత బుర్రా మీరూనూ.  కొబ్బరిపీచుతో పీచు మిఠాయి చేసే  కోతి మొహాల్లారా !

ఈ సారి మళ్ళీ కనబడ్డారో, నేనూ కొత్త కొత్త వంటలు కనిపెట్టి మరీ పెడతానే... చీమ కన్నంలో చికెన్, కలుగులో కజ్జికాయ, బొచ్చెలో బొబ్బట్టు, వడిసేలుతో వడియాలు, తొక్కుడుబిళ్ళతో తొక్కుడులడ్డూ... ఏం తింటారా ? ఇలాంటి వంటలు పెడితే... పోతారే... రేపో మాపో పెళ్ళికావలసిన దాన్ని, నాకిలా అర పిచ్చి పట్టించినందుకు ఏ ఎర్రగడ్డకో పోతారే ! ఏ అండమాన్ జైలుకో పోయి, చిప్పకూడు తింటూ చిక్కి చస్తారే ! ఏ ఆఫ్రికా అడవులలోనో నరమాంస భక్షకులకు వంటగత్తేలై పోతారే ! అంటూ కాస్త స్పృహ వచ్చినట్టు, వెనక్కి చూసింది...

వాళ్ళ వంట తిన్న ఆ ముగ్గురూ... పిచ్చి చూపులు చూసుకుంటూ, ఆకాశంతో మాట్లాడుతూ, నవ్వుతున్నారు... అందుకే అన్నారుగా... చేసుకు తిన్నవారికి, చేసుకున్నంత మహాదేవీ !!!

Saturday, February 28, 2015

భారతంలో భద్రత

భారతంలో భద్రత 

భావరాజు పద్మిని – 28/2/14 

ఊర్మిళ కి మంచం వాసన చూస్తే నిద్దరోస్తుంది... నిద్దర్లో నడకొస్తుంది...
అలా నడుస్తూ, నడుస్తూ ఎక్కడికీ వెళ్ళిపోతుందో తెలీక కట్టుదిట్టమైన కాపలా కాస్తుంటారు, ఇంట్లో వాళ్ళు. ఎప్పుడైనా నిద్దర్లో లేచి నడుస్తోంది అన్న అనుమానం వస్తే, అంతా కలిసి థ్రెడ్ మిల్ ఎక్కించేస్తారు... ఇక ఆవిడ ఓపిక అయిపోయే దాకా నడిచీ, నడిచీ... అదన్నమాట !
ఒకసారి ఊర్మిళ కొడుకూ, కూతురూ సెలవలకు అత్తయ్య ఊరికి వెళ్ళారు. ఆమెను భద్రంగా చూసుకోమని, తండ్రి అవతారానికి అప్పజెప్పి ! అవతారం ఆ రోజు త్వరగా వస్తానని, హోటల్ లో భోజనం చేసి, సెకండ్ షో సినిమాకు వెళ్దాము, ముస్తాబై సిద్ధంగా ఉండమనీ భార్యకు చెప్పాడు. అయితే, అనుకోకుండా వచ్చిన ఒక మంత్రి గారి పని వలన అతని బాస్ , అతన్ని ఆ రాత్రికి ఆఫీస్ లోనే ఉండిపోయి, ఉదయాన్నే మంత్రిగారికి ఆ ఫైల్ ఇచ్చి, ఇంటికి వెళ్ళమన్నాడు. ఈ సంగతి ఆలస్యంగా ఫోన్ చేసి చెప్పినందుకు, ఊర్మిళ మండి పడింది. ఎన్నాళ్ళ తర్వాతో కట్టుకున్న తెల్లచీర, మల్లెపూల మేకప్ వృధా అయ్యిందన్న కోపంతో, జడవిప్పి, పూలు తీసి పారేసి, మంచం వద్దకు వెళ్లి, గట్టిగా వాసన చూసింది. అంతే... ఆమె నిద్రలోకి జారుకుంది. లేచి, రోడ్డు మీద నడవడం మొదలుపెట్టింది... నడుస్తూ ఏదో కలగంటూ, ఏదో మాట్లాడుతోంది.  అప్పుడు సమయం రాత్రి 11 కావస్తోంది.
పిరికి పున్నయ్య అటుగా నడిచి వస్తున్నాడు. అసలే అతనిది పీల గుండె. కల్లో ఆలస్యంగా వచ్చిన మొగుడిని, ఎడాపెడా వాయించేందుకు గుమ్మంలో సిద్ధంగా ఉన్న ఊర్మిళ “వచ్చావా ! ఆగరా !” అని అరిచింది బిగ్గరగా ! పున్నయ్య హడిలిపోయాడు. తెల్లచీర, విరబోసుకున్న జుట్టు, గొంతులో కోపం... డౌట్ లేదు, ఏ దెయ్యమో అయ్యుంటుంది... అనుకుని, ఇప్పుడు దెయ్యాన్ని ప్రసన్నం చేసుకోవడమే తన తక్షణ కర్తవ్యం అని భావించాడు. ముందుగా... ‘ దెయ్యం గారు, దెయ్యం గారు...’ అంటూ ఊర్మిళ చుట్టూ తిరిగాడు. ఇప్పుడు దెయ్యాన్ని స్తుతించాలి. కాని, ఎలా దెయ్యం స్తోత్రాలు తనకు రావే ! చిన్నప్పుడు చదివిన ఆవు వ్యాసం గుర్తుకు వచ్చింది.
“దెయ్యము. దెయ్యములు చాలా మంచివి. క్రూర జీవులు. దెయ్యమునకు రెండు కాళ్ళు ఉండును. అవి వెనుకకు తిరిగి ఉండును. “ అంటూ ఆమె కాళ్ళ కేసి, చూడసాగాడు. ఆసరికే కల్లో కోపంగా ఉన్న ఊర్మిళ పున్నయ్యను లాగిపెట్టి, తన్నింది. యెగిరి అవతల పడ్డాడు. మళ్ళీ నడక కొనసాగించింది ...


ఎవరినో హత్యచేసి, పారిపోతున్న ఒక దొంగ, కత్తితో సహా అటు పరిగెత్తుకు వచ్చాడు. అప్పటికి ఊర్మిళ కల్లో భర్త కాలర్ పట్టుకు గుంజుతోంది. వెంటనే దొరికిన దొంగ కాలర్ పట్టుకుని, ‘చెప్పరా, నిజం చెప్పు, ఇంతసేపూ ఎక్కడున్నావ్ ?’ అంది.
‘హమ్మో, ఇదేదో కదలి వచ్చిన కాష్మోరా లా ఉంది. అయినా, ఇప్పుడే కదా చంపాను, ఇంత త్వరగా దెయ్యమై వెంట పడుతుందా?’ అని ఆలోచనలో పడ్డ దొంగ, పోలీసు ఈల వినబడడంతో, పట్టు విడిపించుకుని,  ఆ కత్తిని ఆవిడ చేతిలో పెట్టి, పారిపోయాడు.
రాత్రి నాటకం ఆలస్యం అవడంతో, తీరిగ్గా వెళ్తున్న నాటకాల బాచ్ లోని ఇద్దరు, వెంట కుక్కలు తరమడంతో, అటుగా పరిగెత్తుకు వచ్చారు. అప్పటికి ఊర్మిళ కల్లో, సీన్ మారి ఖజానా వెతుకుతోంది. తనతో పాటు పోటీకి వచ్చిన వేరొకర్ని, నిలువరించి కత్తితో బెదిరిస్తోంది...
‘ఆగక్కడ !’ గట్టిగా అరిచింది ఊర్మిళ. వారిద్దరూ, తమలో తాము ఇలా మాట్లాడుకోసాగారు....
‘ఒరేయ్... వెనక కుక్కలు... ముందు కొరివి దెయ్యం, దానికి తోడు చేతిలో కత్తి ! కుక్కకైనా కనికరం ఉంటుందేమో కాని, కొరివి దెయ్యానికి కోపం వస్తే, కొరుక్కు తినేస్తుంది ! ఇది చెప్పినట్టు చేద్దాం,’ అనుకుని, భక్తిగా దణ్ణం పెడుతూ అక్కడే నిల్చున్నారు. కల్లో పోటీకి వచ్చిన వారి దగ్గరనుంచి, నిధిని లాక్కుంటోంది ఆమె...
‘ఇది నాది, నాకు ఇవ్వండి...’ దబాయించింది ఊర్మిళ ! ‘ ఒరేయ్... ఏదో ఇమ్మంటోంది రా ! బహుసా, మనం పెట్టుకున్న అట్ట నగల్నే కావచ్చు. బ్రతికుంటే బర్గర్ తినచ్చు. ఇచ్చేద్దాం, కుక్కల బాధ కూడా తప్పుతుంది. ‘ అనుకుని, కిరీటంతో సహా నగలన్నీ ఆమెకు ఇచ్చి పారిపోయారు.
ఆమెకు అది దొరకగానే, భోషాణం తెరిచి, ఆత్రంగా నగలు మెళ్ళో వేసుకుంటోంది... అలా కలలు కంటూ , నాటకాల వాళ్ళ నగలు అన్నీ ఆమె అలంకరించేసుకుంది.
మళ్ళీ లేచి నడవసాగింది. అది ఒక పెద్ద పదవిలో ఉన్న మంత్రిగారి ఇల్లు. గేటు వద్ద ఉన్నవాడు గుర్రు పెట్టి, నిద్దరోతున్నాడు. ద్వారం వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ స్కాన్ మెషీన్, భారతంలోని అన్ని ప్రధాన కేంద్రాలలో లాగే... “పని చెయ్యట్లేదు” !ఒక అడుగు ముందుకు వెళ్ళాకా ఉన్న నల్ల పిల్లుల భద్రతా దళం అతను... గన్ పట్టుకు, గర్ల్ ఫ్రెండ్ తో సెల్లు లో సొల్లు కొడుతున్నాడు. ఊర్మిళ అతని ప్రక్కనుంచి, మంత్రిగారి వీధి గుమ్మం దగ్గరికి వెళ్ళింది. అక్కడున్న సుందోపసుందులు... పూర్తి ఆభరణాలతో అర్ధరాత్రి వస్తున్న ఊర్మిళ ను చూసి...
‘ ఒరేయ్ అమ్మోరు తల్లిరా ! రాత్రి పూట ఇలా మఫ్టి లో వస్తూ ఉంటుంది, ఆ పెద్ద బొట్టు, మోహంలో కళ చూడు...ఆపావో, మింగేస్తుంది. ఎవడికైనా ప్రాణాలు తీపిరా ! తలుపు తీసి, లోపలికి పంపేద్దాం, తెల్లరట్టకి మాయం అయిపోతుంది,’ అనుకుని, ఆమెను లోపలికి వదిలేసారు. ఊర్మిళ తిన్నగా మంత్రిగారి పూజ గదిలోకి వెళ్లి, నిద్దరోయింది...
ఊర్మిళ తెల్లారి లేచి కళ్ళు నులుముకుని చూసేసరికి, ఆమె ఎదురుగా అనేకమంది మూగి, పొంగళ్ళు పెట్టి, హారతులు ఇస్తున్నారు. కొందరు పూలు, పసుపు, కుంకుమ చల్లి, పూజ చేస్తున్నారు. బెంబేలెత్తి పోయి ఆమె లేచి నిలబడింది. ఆమెకు ఏం జరుగుతోందో, ఎక్కడుందో అంతు బట్టట్లేదు. తనకు నిద్దర్లో నడిచే అలవాటు ఉందని ఎలా చెప్తుంది ? ఆమెకు ఏడుపు వస్తోంది...
ఇంతలో ఫైల్ పట్టుకుని, అక్కడకు వచ్చిన ఆమె భర్త అవతారం, ‘నువ్వెంటే, ఇక్కడున్నావ్ ?’ అన్నాడు. అంతే ! ఒక్క ఉదుటన ముందుకు దూకి, భర్తను వాటేసుకుంది ఊర్మిళ. ఆమెను ఓదార్చి, ఆమెకున్న అలవాటు గురించి, అందరికీ చెప్పాడు అవతారం. అంతా తేరుకున్నాకా, మంత్రిగారికి గొప్ప అనుమానం వచ్చింది...
“ఇంత మంది భద్రతా దళాల్ని దాటుకుని, ఈమె లోనికి ఎలా వచ్చింది ?”
“అదేగా మరి.. భారతంలో భద్రత !” అని అవతారం అనడంతో... అంతా నవ్వేసారు.



Wednesday, February 18, 2015

కోతిని చూసి నేర్చుకుందామా ?

కోతిని చూసి నేర్చుకుందామా ?
--------------------------------------
భావరాజు పద్మిని - 19/2/15 

ఏవిటో... ఇప్పుడు సినిమాల్లో , బయటా జనాలకి 'ఆటిట్యూడ్' అనేది ఉండడం విధాయకం. ఈ పదానికి తెలుగులో వైఖరి/తీరు అని అర్ధం. 'నా చుట్టూ వైఫై' లా ఇగో చుట్టుముట్టి ఉంటుంది...' ఇంకో తాజా డైలాగ్. దాని వల్ల ఉపయోగం ఏవిటో, నాకేం అర్ధం కాలేదు. ఇంకొకళ్ళకి ఉచితంగా నెట్ సౌకర్యం ఇగో వల్ల దొరకదుగా ! 'నేనెంత ఎదవనో నాకే తెలీదు...' అనడం కూడా ఆ హీరో తీరే... దొరికిన వాళ్ళని దొరికినట్టు లెంపకాయలు కొట్టడం వెయ్యి కోట్ల ఆస్తి ఉన్న హీరో వైఖరి అని చూపించారు ఈ మధ్య మరొక సినిమాలో.... వాళ్ళ హీరో కనుక, వాళ్ళు చెప్పిన తీరుగా ఉండాల్సిందే లెండి. కాని ఎక్కువ మంది యువత హీరోలను అనుకరిస్తారు.... ఈ విధంగా ఆయా వైఖరులు సమాజం మీద ప్రభావం చూపుతాయి. అదే వచ్చిన చిక్కు. ఈ వైఖరి కేవలం హీరోలకు, మనుషులకే ఉంటుందా.... జంతువులకు కూడా పెట్టేస్తే పోలా...

జంతువుల మధ్య కూడా కుల, మత , ప్రాంత భేదాలు సృష్టిస్తే... మనుషులకు వేరే మంత్రిత్వం జంతువులకు వేరే... డివైడ్ అండ్ రూల్.... బోలెడు పదవులు... ఆహా, అన్న ఆలోచన ఒక నాయకుడికి వచ్చిందండి. ఇక విభేదాలు సృష్టించేందుకు శరవేగంగా ఒక సినిమా తీసేందుకు సిద్ధం అయ్యాడు. మనిషి కోతి నుంచీ పుట్టాడు కనుక తన సినిమాకు ఒక శిక్షణ పొందిన కోతిని హీరోగా ఎంచుకున్నాడు. దానికి రాయటం కూడా వచ్చు !

హీరో కోతి ఇగో, ఆటిట్యూడ్, లెక్క చెయ్యనితనం, దూసుకుపోవడం ఇత్యాది పదహారు దుర్లక్షణాలన్నీ ఉన్నవాడు. వేషభాషలు చూసి, మర్యాద ఇచ్చే డబ్బుజబ్బు బాగా చేసినవాడు. హీరో బూటుకాలు చూపిస్తారు ముందు. అది కాలు గిరాగిరా తిప్పాకా, వెలిసి చిరుగులు పడ్డ అతుకుల బొంతలా ఉన్న దాని జీన్స్ చూపుతారు. తర్వాత సూట్, కోటు... టోపీ. కోతి చూయింగ్ గం నములుతూ రఫ్ గా చూస్తూ ఉంటుంది. ఆ హీరో కోతిని చూసి, అక్కడికక్కడే అరడజను ఆడ కోతులు అర్జెంట్ గా ప్రేమించేస్తాయి. 'నా మనసు కోతిరా హీరో...' అని వెంటపడి పాటలు పాడేస్తాయ్. తర్వాత ఆ డబ్బున్న కోతి దగ్గర పనిచేసే, ఓ డజను కోతులు నడుముకు తువ్వాళ్ళు కట్టుకుని, నిలబడతాయ్. డబ్బున్న కోతి, డబ్బులేని కోతిని ఎడాపెడా లెంపకాయలు కొడుతుంది. 'రాజుకోతి' తలచుకుంటే దెబ్బలకు కొదవా అని...' మిగిలిన కోతులన్నీ కొట్టించుకు ఏడుస్తుంటే, అప్పుడు ఈ కోతికి కరుణ కలిగి, ఓ నోట్ల కట్ట విసిరి పారేస్తుంది. ఇదీ కాన్సెప్ట్.



అంతా బానే షూట్ చేస్తున్నారు. ఓహో, ఈ దెబ్బతో కోతుల మధ్య విభేదాలు కల్పించడం ఖాయం అని మురిసిపోతున్నారు. ఇంతలో ఎక్కడినుంచి తెచ్చుకుందో, ఒక నౌకరు కోతి చేతిలో అరటిపండు చూసింది డబ్బున్న కోతి. వెంటనే, చెంగున దాని దగ్గరకు ఎగిరింది. రెండూ అరటిపండు పంచుకు తినబోతూ ఉండగా, డైరెక్టర్ 'కట్' అన్నారు. కోతిని రాయితో కొట్టబోయారు. వెంటనే కోతులన్నీ తిరగబడి, ఆ డైరెక్టర్ మీద దాడి చేసాయి. అన్నింటిని ఒకేసారి అదుపు చెయ్యడం వాళ్ళ టీం కు వీలు కాలేదు. చివరికి  హీరో కోతి, డైరెక్టర్ వీపు మీద పెన్నుతో ఇలా రాసి వెళ్ళిపోయింది...
' నువ్ తేడాలు చూపిస్తే, ఏమారిపోయి, కొట్టుకు చావడానికి మేము ఏమైనా మనుషులం అనుకున్నావా ? ఉన్నది పంచుకు తింటాం... మాలో విభేదాలు కల్పించడం నీ ముత్తాతల తాతల( మన ముత్తాతల తాతలు కోతులు - అన్నారు కదండీ ముళ్ళపూడి వారు) తరం కూడా కాదు !'

Thursday, February 12, 2015

న్యూ ఇయర్ పండుగ

హితులారా! రాత్రి ఒక స్వప్నమును కాంచితిని... అకాలమున నిద్రించిన ఇట్టి కలలే వచ్చును. 

స్వప్నమున వ్యాసరచన పోటీ నిర్వహించుచున్నారు. అందు కేవలము నాతొ కలిపి, కేవలం ఐదుగురు మాత్రమే పాల్గొనుచున్నారు. అంశం యేమన 'న్యూ ఇయర్' పండుగను గురించి వ్రాయుట.సాధారణముగా పండుగ అనిన వ్యాసము వ్రాయుట ఎట్లని యోచించితిని. పండుగ రోజు ఉదయాన్నే మేల్కొని, తలంటు స్నానము చేసి, కొత్త బట్టలు కట్టుదురు... మరి న్యూ ఇయర్ అట్లు కాదే... ఏమి చేయవలె... ఆ, చుట్టూ నలుగురు కలరు కదా... కాపీ కొట్టిన పోవునేమో!

నెమ్మదిగా ముందు చూచితిని. అప్రాచ్యుడు! తెలుగు వ్యాసము ఆంగ్లమున వ్రాయుచున్నాడు. ఇట్టి వారి వలన నా వంటి పరాన్న భుక్కులు బాధింపబడుచున్నారు. సరి, ఎడమ ప్రక్క చూచితిని. అతగాడు తన అభిమాన హీరో న్యూ ఇయర్ యెట్లు చేసుకొనునో వ్రాయుచున్నాడు. అతనికి 'హీరో ఇసం ' అనిన మక్కువ. కుడి ప్రక్కకు చూచితిని... అతను న్యూ ఇయర్ సంబరాలు పదకండు మంది, మూడు కర్రలు పెట్టుకు, బంతితో పరుగులు పెడుతూ చేసుకొందురు అని వ్రాయుచున్నాడు... అతనికి 'క్రికెట్ ఇసం' కలదు కాబోలు. వెనుక ఉన్న అమ్మణ్ణి ని చూచితిని... ఆమె ఇట్లు వ్రాయుచున్నది...' మాతా కాళి క సందేశ్... ఈ వాక్యములు చదివిన వారు తక్షణమే వెయ్యి కాపీ లు వ్రాసి పంచకపోయిన, అనేక కష్టముల పాలై పుటుక్కున చచ్చెదరు...' ఇక చదువుటకు నేను భీతి చెందితిని?

మరి ఏమి చేయుట? 'ఆ, వెలిగినది దీపం... నేత్రములు విశాలములు అయినవి...' , చిన్నప్పుడు ఆవు వ్యాసమును మాత్రమే చదివిన విద్యార్ధికి మేడ వ్యాసమును ఇచ్చిన ఏమి చేసెను? 'అదిగదిగో మేడ... మేడ పక్కన గోడ... గోడ పక్కన దూడ... దూడ మమ్మీ ని చూడ... ఆహా, అదిగో, ఆవు. అవుకు నాలుగు కాళ్ళు ఉండును...' అని వ్రాసెను కదా... అట్లే సేయుదును. ఇక న్యూ ఇయర్ వ్యాసము మొదలుపెట్టి, చక్కగా వ్రాసిన, నాలుగు స్తంభాలు పునాదులు లేనివి కనుక, గెలుపు నాదేనను ధైర్యము కలిగినది.

'న్యూ ఇయర్ పండుగ ముందు రోజున పిన్నలు, పెద్దలు, చక్కగా తలంటు స్నానము చేసి, కొత్త పొట్టి బట్టలు కట్టుదురు. కురులు విరబోసుకుందురు. మెళ్ళో కోయ పూసలు వేసుకుందురు. కోసుకు మింగుటకు కేకును, త్రాగుటకు తగిన పానీయములను తెచ్చుకుందురు. ఇక వింత వాద్యముల భీభత్స కలయికతో కూడిన పాటలను పెట్టుకుని, కాస్త కిక్కును, ఊపును అరువు తెచ్చుకుని, పూనకము వచ్చినట్లు ఊగుతూ, ఆవేశము చల్లారు వరకు చిందాడుదురు. అది చూచిన మిగతా వారు, నిప్పులు తొక్కే కోతులను పక్క తాళము వేయు వారివలె చప్పట్లు కొట్టి ప్రోత్సహించెదరు. పానీయముల మత్తు నెత్తికెక్కిన కుర్ర కారు బైక్ లు ఎక్కి, కారుకూతలు కూస్తూ, వేగముగా పయనించి, కాళ్ళు, కీళ్ళు విరగ్గోట్టుకుందురు. ఇందు వలన ఆసుపత్రులకు లాభం.  కుల, మత, లింగ భేదాలు లేకుండా చేసుకోను ఈ పండుగ మిక్కిలి ప్రసిద్ధమైనది. ఇందువలన స్త్రీపురుష సమానత్వమును, హద్దుల గీతలు దాటి హై  జoపు చేసి, హడావిడి చేయు అవకాశము కలుగును. కావున ఈ పండుగ చేసుకుని, క్యాలెండరు దేవుని కృపకు పాత్రులు కాగలరు...'

ఓహో, ఇక గెలుపు నాదే అనుకుని, హాయిగా శయనించితిని ..మిత్రులారా! బహుమతి నాదే కదా... 

గొబ్బెమ్మ హంట్

' లిసేన్,దోస్ హూ ఆర్ ఇన్ డాన్స్ గెట్ వన్ గొబ్బెమ్మ టుమారో,' అని టీచర్ చెప్పింది అమ్మా. ఇంతకీ గొబ్బెమ్మ అంటే, ఏమిటంటావ్ ?

'ఆవు పేడతో చేస్తారమ్మా, పోయిన ఏడాది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు...'

'ఓ, ఆ గ్రీన్ బాల్స్, ఇంతకీ పేడ అంటే ఆవు ఇదా...?' రెండు వేళ్ళు చూపెట్టింది...

'అవునమ్మా, ఆవు నుంచీ వచ్చే ప్రతీదీ పవిత్రమైనదే! బెంగుళూరు లో మన కిందింటి ఆంటీ రోజూ లేవగానే, వాళ్ళ పిల్లల ముక్కు మూసి, గోమూత్రం పోసేది, గుర్తుందా?'

'అయితే కొంపతీసి, ఈ గొబ్బెమ్మలు తినాలా ఏమిటి ?'

నవ్వొచ్చింది నాకు, 'అక్కర్లేదు. పూజకే!' అన్నాను. అది వెంటనే ఫోన్లు చేసి, దాని నేస్తాలతో 'డో యు నో వాట్ ఇస్ గొబ్బెమ్మ...' అంటూ ముచ్చట్లు పెట్టింది. ఇప్పటికి ఇప్పుడు గొబ్బెమ్మలు ఎలా తేవాలా అని నేను ఆలోచించాను. వెంటనే నా ఊహలలోంచి రామారావు గారు బైటికి దూకి,

'ఏమంటివి, ఏమంటివి ? గొబ్బెమ్మలు కావలయునా ? ఈ మహానగరమున ఆవులు ఎచట దొరకవలె ? దొరికినవి పో, వాటి కడకు యెట్లు పోవలె ? పోతివి పో, అవి అదే సమయమున పేడ ఏల వెయ్యవలె ? వేసినవి పో, నీ వలె పేడకై చూచెడి వారి క్యూ అచట ఉండక ఎందుకు ఉండవలె ? ఉంటిరి పో ,పేడ నీకే ఏల ఇయ్యవలె , అది నీవు యెట్లు తేవలె ...' ఇలా పో, పో అంటూ ప్రశ్నల శరాలు సంధించసాగారు. 

'అమ్మా, గొబ్బెమ్మకు పో, ఇంకా పోలేదా?' అంటూ మేల్కొలిపింది నా చిన్న కూతురు. ఎదురింటావిడ ఈ మధ్య గొబ్బిళ్ళు పెట్టి, ఎవరూ తొక్కకుండా పీట వేసింది. హమ్మయ్య, ఆవిడనే అడుగుదాం, అనుకుని వెళ్ళాను. మాకు దగ్గరలోనే ఆవు ఉందిట. వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పంపింది.




మనోవేగంతో నడిచే ఆ పిల్ల పక్కన నడిచినట్టు పరిగెట్టి, అక్కడకు వెళ్ళాను. నా బుర్రలో ఏదో గోశాల, పాకలు ఉన్నాయి. సదరు చోట ఎవరూ లేరు. ఇంతలో గెంతుకుంటూ వచ్చాడు ఐదేళ్ళ పిల్లాడు. 'పేడ గావాల్నా, రాండి,' అంటూ జేబులోంచి తాళం తీసి, తలుపు తెరిచాడు. నల్లావు, ఇవాళే ఈనిందట, పక్కన బుజ్జి దూడ. పెద్ద కాంపౌండ్. వెనుక చూద్దును కదా, ఒక్క క్షణం నాకు సౌండ్ లేదు. ఒక డజను సమాధులు. ' ఇదిగో, ఆవును తెచ్చి, ఇక్కడ కట్టారు ...' అన్నాను. ' ఆళ్ళు సచ్చి, చాలా కాలం ఐందిలే, అయినా, ఆవు పేడ లేదు, తీసి పెడతా, మళ్ళీ రా!' అన్నాడు. ఈసురో మని వెళ్తుంటే, పక్కనే తెల్లావు ఉందిట ఆంటీ... అంది నాతొ వచ్చిన పిల్ల. నేను దగ్గరికి వెళ్లి కాస్త పరిశోధించి, అది ఆవు కాదు ఎద్దు, అన్నాను. 'ఎద్దు పేడ పనికి రాదా ఆంటీ ?' అమాయకంగా అడిగింది ఆ పిల్ల. లేదమ్మా, అన్నాను నవ్వుకుంటూ. ఈ లోపల అటుగా వెళ్తున్న ఒకావిడ నన్ను ఎగా దిగా చూసి, 'అది ఎద్దు ఆవు, సరిగ్గా చూడు, ' అంది. నాకు సిగ్గేసిపోయింది. 'అలాగేనండి, ఈ సారి సిగ్గులేకుండా చూస్తాను,' అని చెప్పి, దగ్గరలో ఉన్న పిల్లల్ని, 'పేడ దానం దేహి ...' అన్నాను. వాళ్ళు పెద్ద పెట్టె లోంచి, కాస్త పేడ పొదుపుగా తీసి ఇచ్చారు.

అలా ఇంటికి వచ్చి, గొబ్బెమ్మలు చేసి, పసుపూ కుంకుమతో అలంకరించి, ఒక అట్ట పెట్టెలో కేకు ప్యాక్ చేసినట్టు అమర్చి పెట్టాను. ఇక్కడికి ఒక అంకం ముగిసింది. ఇక రేపు ఉదయం నా ఏడేళ్ళ కూతురికీ మాచింగ్ లు వెతికి, సవరంతో జడకుప్పెలు వేసి, పరికిణీ, అలంకారాలు చేసి పంపేసరికి ఉంటుందీ... స్వర్గానికి కేవలం ఒక మెట్టు క్రింది వరకూ వెళ్లి వచ్చేస్తాను. అయినా, ముద్దుగా ముస్తాబైన పిల్లని కళ్ళారా చూసుకుంటే, తల్లి పడ్డ కష్టం అంతా యెగిరిపోతుంది. కదూ... 

సాంబారు కవిత

 సాంబారు కవిత 
భావరాజు పద్మిని - 1/10/14 

వినుడు,
సాంబారు వలన పెక్కు సైడ్ ఎఫ్ఫెక్టులు కలవని 
నుడివిరి విజ్ఞులు పలు తెరగుల పరిశోధించి చూచి   
తెలియని మీకు చెప్పి తక్షణమే కనువిప్పు కల్గించెద 
వినుము భావరాణి మాట మేటి అనుభవాల ఊట 

అతిగా అభిమానించుట 
అతిగా ఆవేశపడుట 
అతిగా ఆవిర్లు కక్కుట 
అతిగా కాయము పెరుగుట 

మక్కువ ఎక్కువైన గుళ్ళు కట్టుట 
ఎక్కువ తక్కువైన కట్టినవి విరగ్గోట్టుట 
ఎక్కని శబ్దాలతో పాటలు కలిపి పాడుట 
తిక్కగ లుంగీ నోట కరచి నాట్యమాడుట 

అతిగా మాట్లాడుట ,అతిగా పోట్లాడుట 
అతిగా తిండి తినుట ,అతిగా తిరుగుట 
అతిగా హావభావాలు ప్రకటించి ఇకిలించుట 
అతి సర్వత్రా వర్జయేత్....
అహో, ఈ పెరుగుట విరుగుట కొరకు కాదే 

అయిననేమి ?
వంటికి మేలైన స్టాండర్డ్ కలర్ 
దేహానికి మాంచి సాలిడ్ పవర్ 
కావలెనన్న తినండి సాంబార్ 
బారుకెళ్లకనే పొందండి హాంగ్ ఓవర్ 

ఫలశృతి : ఈ సాంబారు కవితను రోజుకు మూడు పూటలా చదువుకున్న, మీరు ప్రతీ జన్మ సాంబారు రాష్ట్రం లోనే పొందెదరు. బక్కెట్లు బక్కెట్లు గా సాంబారు త్రాగెదరు. శుభం.