మీ నవ్వుల కోసమే !!!
-------------------------
భావరాజు పద్మిని - 11 /4/15
"మూడిళ్ళ మంట " కార్యక్రమానికి స్వాగతం... ఈ రోజు మనం కైకలూరు నుంచి వచ్చిన ముగ్గురు ముద్దుగుమ్మల మధ్య వంటల పోటీ లైవ్ షో నిర్వహిస్తున్నాము.. " అనగానే 60 లు చేరువ అవుతున్నా, అరమీటర్ మందాన మేకప్ వేసుకుని, చాలా కష్టపడి తయారై వచ్చిన ముగ్గురు భా(బా)మ(మ్మ) లు మురిసి ముక్కలయ్యారు. ముందుగా వారు చెయ్యబోయే వంటలు, కావలసిన పదార్ధాల లిస్టు.. చెప్పారు. అది వినగానే టీవీ చూస్తున్న వాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మదిరిగింది (పండు గాడు కొట్టకుండానే !!). ఇంతకీ వాళ్ళు ఏం చేసారంటే... పల్లీ ఉయ్యాల ... జీడిపప్పు జిగురు, చీపురుపుల్లతో మైసూర్ పాక్... అవి తిన్న ఆంకరమ్మ కు పిచ్చెక్కింది. ఈ లోపు వాటిలోని పోషకాల గురించి వివరించేందుకు డైటీషియన్ వచ్చింది.
"ముందుగా పల్లీ ఉయ్యాల ... పల్లీ లో ప్రోటీన్లు , క్రొవ్వులు ఉంటాయి. వాటిని కాకరకాయతో వేయించి, ఉయ్యాలలో కూర్చుని, తినడంవల్ల, చేదు తెలీదు. ఉయ్యాల ఊగడం ఆరోగ్యానికి చాలా మంచిదని, విదేశీయులు ఈ మధ్యే, కనుక్కుని, మనకు చెప్పారు.
అలాగే జీడిపప్పు జిగురు లో, జీడిపప్పు పొడిని, ఉడకబెట్టిన జిగురు లాంటి మైదాలో కలిపి, స్వీట్ చెయ్యడం వల్ల, చిగుర్లకు మంచి పని పెట్టి, వాటిని బలోపేతం చేస్తాయి. దీని పైన గార్నిష్ చేసిన ముల్లంగి ముక్కల్లో అనేక పోషకాలు ఉన్నాయి.
ఇక మైసూర్పాక్ చేసేటప్పుడు చీపురుపుల్లతో కలిపి చెయ్యడం వల్ల, విరిగిన చీపురుపుల్లలకి అంటిన మైసూర్ పాక్ ను లాలి పప్ లాగా చీక్కుంటూ తినచ్చు. ఇక చీపురుపుల్లలో పోషకాలు..." అనుకుంటూ బుర్ర గోక్కుంటూ ఆలోచించసాగింది... ఈ లోపల పిచ్చెక్కిన ఆంకరమ్మ మైక్ లాక్కుని... నే చెప్తా...
" పల్లేరుకాయతో ఉయ్యాలూగడం ఇది తిన్నప్పుడు ఈవిడ మొహంలా ఉంది. కావాలంటే చూడండి, " అంటూ ఆవిడ కొప్పు పట్టుకుని, గుప్పెడు పల్లీలు నోట్లో కుక్కింది. మిగతా ఇద్దరూ బెదిరి, అక్కడే గజగజ ఒణకసాగారు. వాళ్ళకీ ' ఇదిగో దా తిను , జిల్లెడుకాయ జిగురు - గన్నేరుకాయ తెవాల్సిందే, పర్లేదులే ఈ సారి తిను; నువ్ దా, చీపురుపుల్ల మింగు - నీ చీపురుపుల్ల మీద అగ్గిపుల్ల గీసి పారేయ్య' అంటూ వాళ్ళు చేసిన పదార్ధాలు కుక్కిన ఆంకరమ్మ, విరబోసుక్కున జుట్టున్న తల తిప్పుతూ, పూనకం పూనినట్టు ఇలా అనసాగింది...
"ఓసి మీ మొహాలు మీరేసుకున్న మేకప్ తో సహా మండ ! ఇవేం వంటలే ... వీటి కంటే వేపాకుపసరు తాగడం నయం. అయినా, ఇలాంటి దిక్కుమాలిన ఐడియా లు మీకు ఎలా వస్తాయే ? దురదగుంటాకుతో పాలతాలికలు చేసే తింగరబుచ్చుల్లారా ! జాలిం లోషన్ తో జంతికలు చేసే మొహమూ మీరూనూ. పోట్లకాయతో పూర్ణాలు చేసే పాచి మొహాలూ మీరూనూ !గుమ్మడికాయతో ఆవకాయ పెట్టే పీత బుర్రా మీరూనూ. కొబ్బరిపీచుతో పీచు మిఠాయి చేసే కోతి మొహాల్లారా !
ఈ సారి మళ్ళీ కనబడ్డారో, నేనూ కొత్త కొత్త వంటలు కనిపెట్టి మరీ పెడతానే... చీమ కన్నంలో చికెన్, కలుగులో కజ్జికాయ, బొచ్చెలో బొబ్బట్టు, వడిసేలుతో వడియాలు, తొక్కుడుబిళ్ళతో తొక్కుడులడ్డూ... ఏం తింటారా ? ఇలాంటి వంటలు పెడితే... పోతారే... రేపో మాపో పెళ్ళికావలసిన దాన్ని, నాకిలా అర పిచ్చి పట్టించినందుకు ఏ ఎర్రగడ్డకో పోతారే ! ఏ అండమాన్ జైలుకో పోయి, చిప్పకూడు తింటూ చిక్కి చస్తారే ! ఏ ఆఫ్రికా అడవులలోనో నరమాంస భక్షకులకు వంటగత్తేలై పోతారే ! అంటూ కాస్త స్పృహ వచ్చినట్టు, వెనక్కి చూసింది...
వాళ్ళ వంట తిన్న ఆ ముగ్గురూ... పిచ్చి చూపులు చూసుకుంటూ, ఆకాశంతో మాట్లాడుతూ, నవ్వుతున్నారు... అందుకే అన్నారుగా... చేసుకు తిన్నవారికి, చేసుకున్నంత మహాదేవీ !!!
No comments:
Post a Comment