Wednesday, February 18, 2015

కోతిని చూసి నేర్చుకుందామా ?

కోతిని చూసి నేర్చుకుందామా ?
--------------------------------------
భావరాజు పద్మిని - 19/2/15 

ఏవిటో... ఇప్పుడు సినిమాల్లో , బయటా జనాలకి 'ఆటిట్యూడ్' అనేది ఉండడం విధాయకం. ఈ పదానికి తెలుగులో వైఖరి/తీరు అని అర్ధం. 'నా చుట్టూ వైఫై' లా ఇగో చుట్టుముట్టి ఉంటుంది...' ఇంకో తాజా డైలాగ్. దాని వల్ల ఉపయోగం ఏవిటో, నాకేం అర్ధం కాలేదు. ఇంకొకళ్ళకి ఉచితంగా నెట్ సౌకర్యం ఇగో వల్ల దొరకదుగా ! 'నేనెంత ఎదవనో నాకే తెలీదు...' అనడం కూడా ఆ హీరో తీరే... దొరికిన వాళ్ళని దొరికినట్టు లెంపకాయలు కొట్టడం వెయ్యి కోట్ల ఆస్తి ఉన్న హీరో వైఖరి అని చూపించారు ఈ మధ్య మరొక సినిమాలో.... వాళ్ళ హీరో కనుక, వాళ్ళు చెప్పిన తీరుగా ఉండాల్సిందే లెండి. కాని ఎక్కువ మంది యువత హీరోలను అనుకరిస్తారు.... ఈ విధంగా ఆయా వైఖరులు సమాజం మీద ప్రభావం చూపుతాయి. అదే వచ్చిన చిక్కు. ఈ వైఖరి కేవలం హీరోలకు, మనుషులకే ఉంటుందా.... జంతువులకు కూడా పెట్టేస్తే పోలా...

జంతువుల మధ్య కూడా కుల, మత , ప్రాంత భేదాలు సృష్టిస్తే... మనుషులకు వేరే మంత్రిత్వం జంతువులకు వేరే... డివైడ్ అండ్ రూల్.... బోలెడు పదవులు... ఆహా, అన్న ఆలోచన ఒక నాయకుడికి వచ్చిందండి. ఇక విభేదాలు సృష్టించేందుకు శరవేగంగా ఒక సినిమా తీసేందుకు సిద్ధం అయ్యాడు. మనిషి కోతి నుంచీ పుట్టాడు కనుక తన సినిమాకు ఒక శిక్షణ పొందిన కోతిని హీరోగా ఎంచుకున్నాడు. దానికి రాయటం కూడా వచ్చు !

హీరో కోతి ఇగో, ఆటిట్యూడ్, లెక్క చెయ్యనితనం, దూసుకుపోవడం ఇత్యాది పదహారు దుర్లక్షణాలన్నీ ఉన్నవాడు. వేషభాషలు చూసి, మర్యాద ఇచ్చే డబ్బుజబ్బు బాగా చేసినవాడు. హీరో బూటుకాలు చూపిస్తారు ముందు. అది కాలు గిరాగిరా తిప్పాకా, వెలిసి చిరుగులు పడ్డ అతుకుల బొంతలా ఉన్న దాని జీన్స్ చూపుతారు. తర్వాత సూట్, కోటు... టోపీ. కోతి చూయింగ్ గం నములుతూ రఫ్ గా చూస్తూ ఉంటుంది. ఆ హీరో కోతిని చూసి, అక్కడికక్కడే అరడజను ఆడ కోతులు అర్జెంట్ గా ప్రేమించేస్తాయి. 'నా మనసు కోతిరా హీరో...' అని వెంటపడి పాటలు పాడేస్తాయ్. తర్వాత ఆ డబ్బున్న కోతి దగ్గర పనిచేసే, ఓ డజను కోతులు నడుముకు తువ్వాళ్ళు కట్టుకుని, నిలబడతాయ్. డబ్బున్న కోతి, డబ్బులేని కోతిని ఎడాపెడా లెంపకాయలు కొడుతుంది. 'రాజుకోతి' తలచుకుంటే దెబ్బలకు కొదవా అని...' మిగిలిన కోతులన్నీ కొట్టించుకు ఏడుస్తుంటే, అప్పుడు ఈ కోతికి కరుణ కలిగి, ఓ నోట్ల కట్ట విసిరి పారేస్తుంది. ఇదీ కాన్సెప్ట్.



అంతా బానే షూట్ చేస్తున్నారు. ఓహో, ఈ దెబ్బతో కోతుల మధ్య విభేదాలు కల్పించడం ఖాయం అని మురిసిపోతున్నారు. ఇంతలో ఎక్కడినుంచి తెచ్చుకుందో, ఒక నౌకరు కోతి చేతిలో అరటిపండు చూసింది డబ్బున్న కోతి. వెంటనే, చెంగున దాని దగ్గరకు ఎగిరింది. రెండూ అరటిపండు పంచుకు తినబోతూ ఉండగా, డైరెక్టర్ 'కట్' అన్నారు. కోతిని రాయితో కొట్టబోయారు. వెంటనే కోతులన్నీ తిరగబడి, ఆ డైరెక్టర్ మీద దాడి చేసాయి. అన్నింటిని ఒకేసారి అదుపు చెయ్యడం వాళ్ళ టీం కు వీలు కాలేదు. చివరికి  హీరో కోతి, డైరెక్టర్ వీపు మీద పెన్నుతో ఇలా రాసి వెళ్ళిపోయింది...
' నువ్ తేడాలు చూపిస్తే, ఏమారిపోయి, కొట్టుకు చావడానికి మేము ఏమైనా మనుషులం అనుకున్నావా ? ఉన్నది పంచుకు తింటాం... మాలో విభేదాలు కల్పించడం నీ ముత్తాతల తాతల( మన ముత్తాతల తాతలు కోతులు - అన్నారు కదండీ ముళ్ళపూడి వారు) తరం కూడా కాదు !'

No comments:

Post a Comment