Tuesday, June 13, 2017

నానీ, ఏమీ కహానీ ?

నాని ఎప్పుడూ ఇంతే, తవిక(కవిత)లో ఎంత క్లిష్టమైన పదాలు వాడితే అంత గొప్ప అనుకుంటాడు. మానవమాత్రులకు ఆ భాష అర్ధమవ్వాలంటే... క్లిష్టదుర్గమఅగమ్యగోచరం ! అతను రాసేవి సుమారుగా ఇలాగే ఉంటాయి, అర్ధాలు వెతికితే అనర్ధాలు జరగ్గలవ్, అలా చదివి నవ్వుకోండి అంతే !


నానీ, ఏమీ కహానీ ?
--------------------------
ప్రియా,

నిర్లక్ష్య కక్షలో నికృష్ట పక్షిలా నేను ప్రచరించుచూ ఉంటే,
రహదారి వైచెడి భ్రమణగోళ యంత్రము వలె నన్ను కుదిపావు.
నిశాంతతుషారతూణీర ప్రభంజన కంజనమేదో చెలరేగినది
అంచేత, అమందానందకందుడనై వేకువలో కుక్కుటంలా కూసితిని.
మలిజాము భ్రుంగారికా కల్లోలఘీర్ణవమేదో నా అంతరంగంలో
మరణ మృదంగం మ్రోగించి, నాపై ఊకుమ్మడి దండయాత్ర చేసినదే.
తుదకు, నడికవిత సముద్రంలో నన్నొంటరిని గావించి మళ్ళినావు
డెందారోదనల వేదనలతో ఆరోహణావరోహణ మాలిక పాడుతూ
అంతరింద్రియము దిక్కుతోచక దిక్కులుపిక్కటిల్లేలా రోదించుచున్నది.
ఏమి, వత్తువా, వచ్చి నీ స్వాంత్వనాశూన్యతరంగాలలో నన్ను తేలింతువా?
చెప్పుడీ... ప్రణయమోచని, లలితధ్వంసిని, మరాళతరళవిభేదిని, రమ్మిక.

***************************************

Monday, January 30, 2017

చల్లపెట్టి దండకం

చల్లపెట్టి(ఫ్రిజ్) దండకం
-----------------------
భావరాజు పద్మిని – 30/1/17

ఓ చల్లపెట్టీ !నువే ఇంటమెట్టీ ! సదా ఘోషతో గట్టి సందాడి చేయంగ నేమెచ్చి ఓమూల నిన్బెట్టి నీయందె ముక్కోటి దేవుళ్ళ రూపాల గాంచూచు గొల్చూచు నీమ్రోల నమ్రాత తోడాను వంగూచు ఆనాడు గోపాల కృష్ణూని నోరందు ఏడేడు లోకాల జూచేటి యాశోదలాగాను నీనోట నాకళ్ళు జొప్పించి గాలించుచుందూను నిత్యాము నాముద్దులాపట్టి !

నేరోజు నిద్దూర లేచీన వెంటానె దేవుడ్ని చూడాక పోయీన నీమోము కన్నూల నిండూగ కాంచీన తావూనె నీలోన నుండేటి క్షీరంపు పాకెట్టు తియ్యాక నారోజు ఎట్టూల గడ్చేను చల్లాని నాతల్లి !

నీపొట్టలోనేను శాకాల ,పాకాల మెండూగ కుక్కేసి, ఆపైన పాలూను, పెర్గూను, నీరూను, చిన్నాటి బారూను, పళ్ళూను, జూసూలు ఇంకాను పచ్చళ్ళు, పిండ్లూను, చాక్లెట్లు, ఎన్నెన్నొ తిండ్లన్ని బెట్టేసి యాపైన నిన్నాటి ,మొన్నాటి ,వారాముముందాటి కూరాల, చారూల, సాంబారులాబెట్టి వాటన్నిటిన్దించు వేర్వేరు రోగాల నాయందు పోషించి వర్ధిల్లుచుంటీని గామాత!

ఒక్కొక్క తావూన నీవద్ద నిల్చోని నెందూల కొచ్చీతినోమర్చి నీముద్దు బొజ్జాను గాంచూచునుంటాను గాయమ్మ సమ్మోహనాధీశ్వరీ! శీతలాధీశ్వరీ ! సర్వ భూలోక యంత్రేశ్వరీ ! ఎల్ల జీవూల ఆకాలి దీర్చేటి చల్లాని పెట్టావతారీ ! నమస్తే నమస్తే నమస్తే నమః !
ఫలశ్రుతి : భక్తిగా ఈ దండకం రోజుకు మూడు సార్లు చదివే వారికి శీతలా మాత కృప కలిగి, వచ్చే జన్మలో మంచు కురిసే చోటిలో పుడతారట ! చదవండి(వినండి) మరి !

https://soundcloud.com/padmini-bhavaraju/challa-petti