Thursday, November 19, 2015

హమ్మబాబోయ్...

హమ్మబాబోయ్...
--------------------
భావరాజు పద్మిని - 19/11/15.

పూబోణుల పై మెరుగులు గాయబ్  
ఆంటీల మేక్ అప్ లు పోయెపోచె
సోగ్గాళ్ళ వేషాలన్నీ ఇట్స్ గాన్...
డాబులు చూపే దుస్తులిక వానిష్

ఎవరైనా ఒకటే అవతారం...
ఉన్న బట్టలన్నీ అటకెక్కి,
ఉన్ని బట్టలు దించి ఉతికేసి,
కదిలే గొర్రెల్లా, గంగిరెద్దుల్లా,
దీని దెబ్బకు తోకముడిచి,
నిండా కప్పుకు దాక్కోవాల్సిందే !


ఐస్ క్రీం లకు కాలం చెల్లింది,
ఏ.సి లకు రెస్టు దొరికింది,
వెన్నులో వణుకు పుట్టింది,
ఫానురెక్కలకు ఆర్నెల్లు విశ్రాంతి,
ప్రతిచోటా చలిమంటల సంక్రాంతి.

జానెడు బట్టలతో ఒళ్ళునింపుకునే
జాణలను సైతం దారికి తెచ్చి,
ముసుగు వీరులని వీరమ్మల్ని చూసి,
ముసిముసిగా నవ్వుతోంది చలిపులి.
హమ్మబాబోయ్... ఇకపై...
తాళజాల గలమా నీ ఉధృతి ?

Friday, November 13, 2015

కవ్వింతల కాపురాలు

కవ్వింతల కాపురాలు 
-----------------------
భావరాజు పద్మిని - 13/11/15

పెళ్ళైన కొత్తల్లో...

"హొయ్... హొయ్, హొయ్... జింగిచకా, హొయ్, లస్కుటపా , ఆహా, హోయ్యరే హొయ్య..."
"ఓహో, ఆ మల్లెపూలు అమ్మే కుర్రాడు నన్ను ఆంటీ అన్నంత మాత్రానికే ఇంత సంబడం. హోయబ్బా... ఏదో ఒకరోజు ఎవరో ఒకరు మిమ్మల్ని అంకుల్ అనకపోతారా, నేనూ డాన్స్ ఆడకపోతానా ?"
కొన్నాళ్ళకి...
"అంకుల్ జీ, మీ కార్ కీస్ హోటల్ లో టేబుల్ మీద మర్చిపోయారు... " అంటూ ఇచ్చింది ఒక చిన్ని పాప.
"మా అమ్మే, మా తల్లే, ఏమన్నావు, మళ్ళీ పిలువు తల్లీ..."
"అంకుల్ అన్నాను..."
"విన్నారా, గుర్తు పెట్టుకోండి." ఇంటికి వెళ్ళాకా...
" ఓహో లగుజిగి లగుజిగి జిగులగి లంబాడోల్లన్నా, నువ్వు సిందులాడ రన్నా..."
"మరీ అంత సంబరం ఎందుకో, నన్ను ఉడికించాలనా ?"
"ఏం, మీరు నన్ను ఉడికించలేదూ... ఇదీ అంతే. "
*******************************************************
కొన్నేళ్ళ తర్వాత...
"చూడు, చిటికెన వేలు లాగా ఉండేదానివి, ఇప్పుడు బొటన వేలు లాగా తయారయ్యావు. ఆ జబ్బలు చూడు, జబ్బల్పూర్ రాణికి కూడా ఇంత దిట్టంగా ఉండవు, ఈ రోజు నుంచి, నీకు 'వీరబాహు' అని నామకరణం చేస్తున్నానోయ్. 
"అదేం పేరు ? ఇన్నాళ్ళు, ఏదో సుబ్బలక్ష్మి, వేంకటలక్ష్మి అని పిలిస్తే, పోన్లే అని పలికాను. మరీ వీరబాహు ఏమిటి ? అయినా ఇద్దరు పిల్లల్ని కన్నాకా, ఐశ్వర్యా రాయ్ లాగా ఉండాలంటే ఎలా కుదురుతుంది ? ఇలా పిలవడానికి నేనొప్పుకోను..."
"ఓహో, నీకు ఉడుగ్గా ఉందీ, అయితే ఇదే పేరు ఖాయం చేస్తున్నా... " 
"పిల్చుకోండి, నా పేరుతో పిలిస్తే తప్ప చస్తే పలకను. ఆ."
ఈ లోగా సీన్ లోకి కొన్నాళ్ళకి ఒక చుట్టాలావిడ వచ్చింది.
"మీ ఆయన పూర్తిపేరు నీకు తెల్సటే అమ్మాయ్..."
"లేదండి"
"హయ్యో... నే చెప్తా రాసుకో...వేంకట వీరభద్ర నాగ దుర్గ రామ సత్యసాయి ... చివర్లో నీకు తెల్సిన పేరు ..."
"ఏవిటీ, నిజమే..."
"అవునే..."
"ఉండండి, నోరు తీపి చేస్తాను. చల్లటి వార్త చెప్పారు..."
శ్రీవారు ఇంటికి రాగానే...
"ఏవోయ్ వీరభద్రం... ఓ సారి పాప ఏడుస్తోంది, ఎత్తుకోండి."
"ఎవరూ వీరభద్రం, నేనేం కాదు..."
"తెలిసిందిలే, తెలిసిందిలే... శ్రీవారు మీ పేరు తెలిసిందిలే..."
"అయినా నేనొప్పుకోను... "
"ఏవిటి ఒప్పుకోను, పేరులో వీరభద్రం పెట్టుకుని, ధర్మపత్ని దగ్గర ఏడేళ్ళు ఆ సంగతి దాచి, పైగా వీరబాహు అని పేరు పెడతారే. హన్నా !"
"అదేం కుదరదు... అలా పిలవద్దు..."
"హైసల్లక్కిడి హై... హొయ్, హొయ్, హొయ్..."
"అమ్మా, మా అమ్మతో చెప్తానాగు నీ పని..."

******************************************
మరో 8 ఏళ్ళ తర్వాత...
"నిద్దర్లో ఆ గురక ఏవిటి నాయనా, నిద్దరట్టక చస్తున్నాను..."
"ఒహొహ్... నువ్వు నిద్దరోతే, ఏనుగులోచ్చి తొక్కినా లేవవు అని లోకానికి తెలుసోయ్... కొయ్యకు, నేను గురక పెట్టడం ఏమిటి ?"
"సరే, ఈ సారి పెట్టినప్పుడు, ఫోన్ లో రికార్డు చేసి వినిపిస్తా..."
ఓ వారం తర్వాత..."ఆ రండి బాబూ, రండి... ప్రణవ నాదం వినిపిస్తా... " అంటూ ఫోన్ రికార్డు ఆన్ చెయ్యగానే...
"తూచ్, ఇది నా గొంతు కాదు, ఎవరో డూప్ ది. నేనొప్పుకోను."
కొన్నాళ్ళకి...
"డాడీ, రాత్రి అమ్మ గురక పెట్టింది, పాతాళ లోకం నుంచి భూతాలు వచ్చి అరుస్తున్నట్టు ఏం సౌండ్ డాడీ... "
"ఆహా, నా బంగారుతల్లి, భలే చెప్పావమ్మా..."
"పిల్లికి ఎలుక సాక్ష్యం లాగా బానే ఉందే యవ్వారం. ఏవిటే, పిట్ట కూతకి వచ్చింది ? మీ నాన్న కూడా పెడతారు గురక..."
"ఏమ్మా, నువ్వు చెప్పు, నేను అమ్మంత పెద్దగా గురక పెడతానా ?"
"లేదు నాన్నా... నీ గురక టీవీ మ్యూట్ లో పెట్టినప్పుడు సౌండ్ లాగా 'కుయ్...' అని చిన్నగా వస్తుంది. అమ్మ గురక ఫుల్ వాల్యూం లో..."
"బొత్తిగా భయం లేకుండా పోతోంది... మిమ్మల్నీ... "
***********************************************
ఏమైనా... ఆలూమగలు కలిసి జీవిస్తూ, కలిసి కవ్వించుకుంటూ సాగే ఈ జీవనయానంలో ఈ మధుర జ్ఞాపకాలు అందరికీ సహజమే కదూ... మీకూ ఇలాంటి అనుభవాలు ఉన్నాయా ?