Wednesday, November 12, 2014

సె(హె)వెన్ సీటర్

నవ్వేజనా సుఖినోభవంతు -6

సె(హె)వెన్ సీటర్ 
--------------------
భావరాజు పద్మిని - 12/11/14 

డుగు డుగు డబ్బా బండి...
ఒక్కసారైనా ఎక్కి చూడండి...

పేరుకేమో ఇది సెవెన్ సీటర్ 
జనాల్ని లెక్కెడితే లెవెన్ సీటర్ 

స్వర్గాసుఖాలన్నీ అమరినట్టుండే 
ఈ రేకుబండి నిజానికి హెవెన్ సీటర్ 

సూది బెజ్జంలో ఏనుగు దూర్చినట్టు 
లాఘవంగా కుక్కేస్తారు మనల్ని ఒట్టు  

కుర్చీ కోసం కొట్టుకునే పాట్లు 
త్వరగా వెళ్ళాలనే ఇందరి అగచాట్లు 

తానుదూర సందు లేకపోయినా 
బాగ్ తో సహా తోసుకొస్తారు కొందరు 

కాళ్ళూ వేళ్ళు పచ్చడి చేసి,
పక్కవాళ్ళ ఒళ్లో చేరతారు కొందరు 

ఒంటి కాలిపైనే కూర్చుని, 
గమ్యానికై  కొంగ జపం చేస్తారు కొందరు 

సందట్లో సడేమియా అంటూ,
పడుచుపిల్లను నొక్కేస్తారు కొందరు 

ఖాళీ లేక ఉక్కతో తిక్కలేస్తుంటే 
తీరిగ్గా ఆరాలు అడిగుతారు కొందరు 



అసలిది బండా... కాదు కాదు, సుమండీ 
సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ వాహనమండి.

కదిలే భూకంపం లాగా లోనున్నవారి 
అండపిండ బ్రహ్మాండాలు కుదిపే జర్క్ 
,
ఖర్మకాలి స్పీడ్ బ్రేకేర్ వచ్చిందో
దేహంలో ఏదో ఒక పార్ట్ అవుతుంది క్రాక్ 

జోరుగా నడుపుతూ మెలికెలు తిప్పి,
ప్రమాదం ఒళ్లోకి వెళ్లి వేస్తాడొక బ్రేక్ 

చావుతప్పి కన్ను లొట్టబోయేలా  చేసే,
ఈ వాహనం యముడి దున్నపోతుకి రీమేక్ 

ప్రాణాలతో చెలగాటమే ఇప్పుడు కిక్కు 
మరి హెవెన్ సీటర్ ఎక్కి చూసుకోండి మీ లక్కు!

Tuesday, November 11, 2014

ఉప్మా (ఉపమా) నాలు

నవ్వేజనా సుఖినోభవంతు -5 
-----------------------------------
ఉప్మా (ఉపమా) నాలు 

కాంత కనుగుడ్లు  
కుంకుడుకాయ్ గింజలేగా 

నాతి నాసిక 
నారింజకాయ్ కాడేగా 

పడతి పెదవులు 
పంపరపనాస తొక్కలేగా 

ముదిత కరములు 
ములక్కాయ కాడలేగా 

జవ్వని జడ 
పొడవాటి బర్రె తోకేగా 



మొత్తంగా ఆమె ఒక 
కదిలే సిమెంట్ దిమ్మేగా 

లలన మెచ్చగ ఇదిగో తెచ్చితిని 
దురదగుంట పువ్వును...

ఆకుతగలక అందుకొని 
సిగను తురిమి ఆమె నవ్వును...

అతివ అందం చూసిన 
మనసు కుప్పి గంతులేసేగా ! 

ఏవిటో ప్రతి కవితలో
ప్రాస కోసం ప్రయాసేగా !
ఇంక చాల్లెండి ! ఆపేస్తా !

(బాబోయ్... ఉపమా కాళిదాసః అనడం మానేసి... ఉప్మా పద్మిని... అంటారేమో అని నాకు సిగ్గేస్తోంది బాబూ !)

 

Monday, November 10, 2014

భా(దో)మా కలాపం

నవ్వేజనా సుఖినోభవంతు - 4 

భా(దో)మా కలాపం 
--------------------------
(భావరాజు పద్మిని - 10/11/14 )

యెంత ప్రేమ నీకు నేనంటే...
పగలు రాత్రి నా చుట్టూ గింగిరాలు తిరుగుతావ్ !

నా దృష్టిని ఆకర్షించాలని ,
నేను ఎక్కడికి వెళితే అక్కడికి వస్తావ్ !

కాస్త పరాగ్గా ఉన్నానంటే,
చప్పున నెమ్మదిగా నా మీద వాలిపోతావ్ !

అలా నిద్రపోదామని 
కన్ను ముయ్యగానే చెవుల్లో గుసగుసలాడతావ్ !



కాని, ఒసేయ్ దోమా !
నీ రక్తప్రేమా కలాపం తట్టుకోలేక,
నేను చేసే దోమాకలాపం యేమని చెప్పను ?

కంపుగోట్టే క్రీం రాసుకుని,
నువ్వు నా దగ్గరకే రాకూడదని ప్రయత్నిస్తాను.

కచువా వెలిగించి ప్రతిరోజూ 
నీకు ధూపం వేసి తరిమేయ్యలని చూస్తాను.

నీకోసం 'అల్ అవుట్ ' పెట్టి,
దానితో ఇంట్లో అందరి ఆరోగ్యాలు అవుట్ చేస్తాను.

అయినా... నీకు దోమ కుట్టినట్టు కూడా ఉండదు.
ఇలా నిద్ర పోగానే, అలా జుయ్యి మంటూ గోలపెడతావ్ !

నాకు ఒళ్ళు మండుతుంది.
వెంటనే బాట్ బ్రహ్మాస్త్రం తీస్తాను.

మంచం కింద దూరతాను,
బెడ్ పై నుంచి హై జంప్ చేస్తాను.

సీలింగ్ దాకా యెగిరి గంతేస్తాను,
వాళ్ళనీ వీళ్ళనీ పొరపాట్నచావగొడతాను,

పైన చూస్తూ పరుగెత్తి బోర్లా పడతాను,
నాకు నేనే ఒకటిరెండు వాతలు పెట్టుకుంటాను.

ఒకటే పరుగులు పెట్టిస్తావ్, 
చిటికెలో మాయమయ్యి వెక్కిరిస్తావ్ ...
దొరికిన దోమల్ని చంపి, 
హమ్మయ్య అని కన్నుముయ్యగానే ...

మళ్ళీ చెవుల్లో గుయ్య్  మంటావ్...
మళ్ళీ దోమాకలాపం మొదలు.... 
డాన్స్ రాని వాళ్ళను సైతం డాన్సు ఆడించే...
నీ గడుసుదనం ఎంతని చెప్పను ?
ఆడండి బాట్ తో దోమాకలాపం ,
అయినా, చెయ్యండి దోమలకు రక్తదానం.

( రాత్రి నేను నిద్దరోదామంటే నా చెవిలో గుయ్యి మంటూ రొద పెట్టి, అందకుండా పోయిన దోమకి ఈ కవిత అంకితం...)




Sunday, November 9, 2014

'కల' కలం

'కల' కలం 

నాకు పొద్దుటి నుంచి చాలా కోపంగా ఉంది. వెంటనే కలల మీద ఒక నియంత్రణా చట్టం వచ్చే దాకా... స్నానాగ్రహం (సత్యాగ్రహం లాగా ) చెయ్యాలని ఉంది. అసలు ఏం జరిగిందంటే...

రాత్రి హాయిగా నిద్ర పోయానా... అడగాపెట్టకుండా ఓ కలొచ్చింది... మేమంతా ఒక చోటు నుంచి వెళ్తున్నాం... రోడ్డుమీద నడుస్తున్నాం... ఇంతలో ఉన్నట్లుండి వరద నీరు... అలా నీటిలో నడిచి వెళ్తుంటే... పీక లోతు దాకా నీరు వచ్చేసింది... ఇంతలో... మా ముందు నడుస్తున్న వారంతా శరీరం +ఆత్మ గా విడిపోయారు. అలా మారిపోయిన వాళ్ళని కొందరు లాగి తీసుకుపోతున్నారు. నేను ఆశ్చర్యంగా చూడసాగాను. నేనలా విడిపోలేదు...

ఇంతలో ఓ మాయల మరాఠి మాంత్రికుడు దభుక్కున వచ్చేసి... ' ఓయ్... ఇదంతా నా మాయాజాలం ! నా మాయ నీ మీద పని చెయ్యలేదంటే... నీ దగ్గర ఏదో ఉంది. స్కానింగ్ ప్లీజ్... అన్నాడు.'

వాళ్ళంతా చూద్దురు కదా, నా మెళ్ళో మా గురువుగారు ఇచ్చిన లాకెట్ కనిపించింది. ఓహో, ఇదేనా, అడ్డుపడేది, ఈవిడని మన భవంతికి ఈడ్చుకు రండి, ఆ మెళ్ళో ఉన్న లాకెట్ తెంపేసి, అంతు తేలుద్దాం... అన్నాడు.



మాంత్రికుడి కార్ఖానా కు వెళ్లి చూద్దును కదా... అక్కడ కొట్టేసిన సెల్ ఫోన్ లో సిం కార్డు మార్చినట్టు, ఒకళ్ళ బాడీ కి ఒకళ్ళ ఆత్మను వాళ్ళ కోరికల్ని బట్టి తగిలిస్తున్నారు. దొరికిన ఆత్మల atm కార్డు తీసుకుని, ఆస్థుల వివరాలు తెల్సుకుని, వాళ్ళ కోరికను బట్టీ, మాంత్రికుడు వాళ్ళను వేరొకరి దేహంలోకి పంపుతాడన్నమాట ! మరో ప్రక్క శరీరాల వేలం పాట !

"ఆ రండి బాబూ రండి... కోటీశ్వరుడి బాడీ... కేవలం కోటి రూపాయిలే... కొనండి, దర్జాగా బ్రతకండి...
మరోప్రక్క...
ఆ రండి బాబూ, ఆలసించిన ఆశాభంగం... ఆంజేలినా జోలె దేహం... త్వరగా కొనండి...
ఇంకో చోట...
ఆరోగ్యమే మహాభాగ్యం బాబూ... మీ రోగాలున్న దేహం వదలండి, కొత్త నాణ్యమైన బాడీ కొనుక్కోండి..."

నాకు తిక్క రేగింది. చట్టాలు మాంత్రికుల చుట్టాల లాగా ఉన్నాయే ! ఇంత డబ్బు తింటాడా ? అనుకుంటూ ఉండగా...

మాంత్రికుడు కటింగ్ ప్లేయర్ పట్టుకు వచ్చాడు. నా లాకెట్ తెంపబోగా... నేను మా గురువుగారిని తల్చుకున్నాను. వెంటనే ఆయన ఆకాశ మార్గంలో వచ్చి, నన్ను, అక్కడ ఉన్న వారిని రక్షించారు...

ఇదండీ కల... ఏమైనా అర్ధం పర్ధం ఉందా ? పోనీ పగలు ఆలోచనలు రాత్రి కలల్లో వస్తాయి అనుకుందామంటే... నిన్న పొరపాట్న మా అమ్మాయి స్కూల్ వాళ్ళు నిర్వహించిన "కుప్పి గంతులు  , పిల్లి మొగ్గలు, జిమ్నాస్టిక్స్ , తిక్క హావభావాలు" మేళవించిన డాన్స్ పోటీలు ఓ 4 గంటలు చూసొచ్చాను. అంతకు మించి ఏ విపరీతాలు చూడలేదు. అసలు మన అనుమతి లేకుండా మన మీద ఈ కలల పెత్తనాలు ఏంటి ?

అందుకే కలల మీద "కలహింస మహాచట్టం " తీసుకు రావాలని డిమాండ్ చేస్తా ఉన్నా ! మీరేమంటారు ? మీకూ ఇలాంటి వింత కలలు వచ్చాయా ? 

ది ఆప్ (ఏప్ ) ఎఫెక్ట్

ది ఆప్ (ఏప్ ) ఎఫెక్ట్ 
----------------------
ఒక పెద్దాయన కార్ నడుపుతూ ఉండగా, ఉన్నట్టుండి మొబైల్ చదువుతూ ఉన్న ఓ కుర్రాడు అడ్డం పడ్డాడు... అన్ని బ్రేకులు నొక్కి కాస్తలో కార్ ఆపాడు పెద్దాయన. ఇంకాస్తుంటే ఆ కుర్రాడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే ! అయితే ఆ కుర్రాడు మాత్రం ఓ సారి కార్ వంకా, పెద్దాయన వంకా చూసి, మళ్ళి మొబైల్ లో చూస్తూ పిచ్చి నవ్వులు నవ్వుకోసాగాడు...
పెద్దాయనకు ఒళ్ళు మండిపోయింది... కార్ దిగి,

"ఒరేయ్ మలపత్రాష్టుడా ! కళ్ళు మొబైల్(నెత్తిన) లో పెట్టుకు నడుస్తున్నావా ? ఇంట్లో చెప్పొచ్చావా ?" అని అడిగాడు కోపంగా !
"ఓహ్! హై అంకుల్... నా దగ్గర వాట్స్ ఆప్ ఉంది... నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా స్టేటస్ పెడతా ! వన్ మినిట్..." అంటూ మళ్ళీ ఆడుకోసాగాడు...

"తిధి వార నక్షత్రాలు చూసుకు రోడ్డు మీదకు దిగబడ్డావా తింగర సన్నాసి ! ఇవాళ నీ జాతకం కాదు, నా జాతకం బాగుంది..." అన్నాడు...
"ఆ ఆ , నా దగ్గర హిందూ క్యాలెండరు ఆప్ ఉంది అంకుల్... తెలుగు జాతకం ఆప్ కూడా ఉంది..." ఓ సారి నవ్వి, మళ్ళీ ఆడసాగాడు.

"అఘోరించావులే ! చేతిలో ఆ తిరుగుబోతు ను ఉంచుకుని, అసలు నువ్ ఎక్కడ తిరుగుతున్నవో నీకు తెలుసా ?"
"నా దగ్గర నావిగేటర్ ఆప్ ఉంది అంకుల్..."

"ఆహా ! ఏదో అక్షయపాత్ర ఉన్నట్టు చెప్తున్నావ్... చదువుకునే వయసులో ఇలా అడ్డవైన ఆటలు ఆడితే, బుర్ర పనిచెయ్యడం మానేస్తుందని నీకు తెలుసా ?"
"మేరె పాస్... IQ టెస్ట్ ప్రిపరేషన్ ఆప్ హై అంకుల్...."



"ఇలా మెషీన్ ల మాయతో యువత బ్రతుకుతుంటే ,దేశం ఏమైపోవాలి ? అసలు దేశంలో ఏం జరుగుతోందో నీకు తెలుసా ?"
"ఐ హావ్ తెలుగు న్యూస్ పేపర్ ఆప్ అంకుల్..."

ఇక పెద్దాయన సహనం చచ్చింది..."ఒరేయ్ ! అక్కుపక్షీ ! చావు తప్పి కన్ను లొట్ట పోయినా లొట్టిపిట్ట లా ఆ ఫోన్ లో ఆడితే నీకు ఏమొస్తుంది ? ఇంత జరిగినా చీమ కుట్టినట్టుగా అయినా లేదే నీకు... ఆ మొబైల్ లో ఏమి ఆడుతున్నావ్...చెప్తావా లేదా ! "
"యా... క్లాష్ ఆఫ్ క్లాన్స్ అని... ఇందులో ఆడుతూ ఉంటే ముందు ట్రోఫీ లు వస్తాయి. 700 ట్రోఫీలు దాటితే సిల్వర్ మెడల్ వస్తుంది... ఈ ఒక్క ఆట అయితే, నాకు సిల్వర్ మెడల్ వస్తుంది అంకుల్... అలా వస్తే నాకు కంచుకోట లాంటి ఒక గ్రామం ఇస్తారు... శత్రువులు నన్ను గెలవడం కష్టం అవుతుంది..."

"అలాగా ! గెలిస్తే ఆ మెడల్ నీకు వస్తుంది... అదే నువ్విలా అడ్డదిడ్డంగా రోడ్డు మీద నడిచి చస్తే... అదే మెడల్ నీ పాడె మీద వెయ్యాల్సి ఉంటుంది... ఒరేయ్... ఈ ఊహా లోకాలలోని ఊహా భవంతులు కట్టుకుంటూ బ్రతికితే... చచ్చూరుకుంటావ్..."
"........." ఏం మాట్లాడకుండా తీవ్రంగా ఆడేస్తున్నాడు కుర్రాడు..."

పెద్దాయన కోపం తారాస్థాయికి చేరుకుంది. వెంటనే అతని మొబైల్ లాక్కుని... 
"ఒరేయ్... అమ్మానాన్నల బదులు ఏ ఆప్ లేదు కదా ! కడుపు ఆకలి ఆప్ లతో నిండదు కదా ! ఇవన్నీ ఆలోచించకుండా... ఆడి, ఆడి... ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇకనైనా మేల్కోండి..."అన్నారు.
వెంటనే చిన్నపిల్లాడి చేతిలో ఐస్ క్రీం లాక్కున్నట్టు పెద్దగా ఏడుపు మొదలెట్టాడు కుర్రాడు... "ఇంకొక్క లెవెల్ ఆడితే సిల్వర్ మెడల్ వచ్చేది... ఆ గున్ని గాడు, బన్ని గాడు... గోల్డ్ మెడల్ దాకా వెళ్లిపోయారని గొప్పలు కొడతారు... నేనూ సిల్వర్ వచ్చిందని చెప్దామంటే... మీరు అడ్డుపడ్డారు. ఈ పాపం ఊరికే పోదు ! మీ ముందు తరాలన్నీ మొబైల్ లేకుండా పోతాయ్ ! మీ వంశం ఆండ్రాయిడ్ లేని ఫోన్ లా వెలవెల బోతుంది... ఇదే నా శాపం !"

" ఓరి నీ పిండం పిల్లులకి పెట్ట ! బోడెమ్మ లా శాపాలు పెడతావ్ రా ! నేను గట్టిగా బ్రేక్ వెయ్యకుండా ఉంటే ఈ పాటికి నీ ఫోటో టీవీ లో వచ్చేది. నీలాంటి వాళ్ళు ఆప్ లు వచ్చాకా తిరోగమనం చెంది ఏప్(కోతి) ల లాగా తయారౌతున్నారు... మీరు చచ్చి బానే ఉంటారు. గుద్దిన మాలాంటి వాళ్ళు వి.ఐ.పి  తో కలిసి జైలు జీవితం వెలగబెట్టాలి. ఇదిగో... నీ మొబైల్ ఆ మురుక్కాలవలో వేస్తున్నా ! మళ్ళి మొబైల్ కొనుక్కునే దాకా... సుఖీభవ !  ఇంతకీ నేనెవరో నీకు తెలీదుగా... చూసేందుకు ట్రూ కాలర్  ఆప్ కూడా లేదాయె ! ఈ ఏరియా ఎస్.ఐ ని... ఇక నీకు దిక్కున్న చోట చెప్పుకో... బై..." అంటూ కీలెరిగి వాత పెట్టి వెళ్ళిపోయాడు పెద్దాయన. 

నిద్దర్లో జ్ఞానోదయం

నిద్దర్లో జ్ఞానోదయం 
-----------------------

"అమ్మా ఊర్మిళా దేవి, నిద్ర లే !"
"ఎవరది, నా పేరు ఊర్మిళ కాదు, పద్మిని... అయినా నిద్ర పోతున్నవాళ్ళు దేవుడితో సమానం. నిద్ర లేపితే పాపం వస్తుంది..."
"అది మనుషులు లేపితే కదా ! ఇదిగో నేను నీ అంతరాత్మని వచ్చాను... లేచి చూడు..."
"వేళాపాళా లేకుండా ఇప్పుడు ఎందుకొచ్చావ్ ? అసలే నిన్న నాగులచవితి ఉపవాసం చేసి, నీరసంగా ఇప్పుడే పడుకున్నా..."
"నిన్న ఉదయం నుంచి నీ కాకిగోల అంతా చూస్తున్నా... నీకు కాస్త జ్ఞానం ప్రసాదించడం తప్పనిసరి అనిపించింది... లే చెప్తా..."
"మొదలెట్టు..."
________________________________

1 ) 
"చిన్నప్పుడు జనరంజని కార్యక్రమం విన్నావా ?"
"ఓ, మధుర గీతలు తక్కువ ... విషాద గీతాలు ఎక్కువ. జీవితంలో దెబ్బతిన్న వాళ్ళు... పాడు జీవితమోయి... కనుపాప కరువైన... లాంటి పాటలు అడిగేవారు."
"అందులో చదివే పేర్లు ఎలా ఉంటాయి ?"
"శ్రీకాకుళం జిల్లా కొత్తపెంట గ్రామం నుంచి ... అప్పలమ్మ, సుబ్బాయమ్మ, వెంకమ్మ, నరసమ్మ, సీత, గీత, రాత, పీత... మరియు విస్సన్నపేట నుంచి రాముడు, భీముడు, కాముడు, సోముడు, అప్పడు... ఇంకా ఇతర మిత్రులు కోరుతున్నారు... " అని చదివేవారు."
"అంటే... పీత కూడా నిజంగా ఉంటుందంటావా ? లేక ద్విత్వాక్షరాల్లా వీళ్ళంతా ఒక్క చోట చేరి, ఉత్తరాలు రాస్తారంటావా ?"
"లేదు, పీత ఉండదు. నాకు ఇదంతా ఉత్తరాలు రాసేవాళ్ళ 'ప్రాస కోసం ప్రయాస', అనిపిస్తుంది "
"కదా ! అలాగే ఉండు. ఇప్పుడు మరో ప్రశ్న..."

_______________________________________________________



2) 
"నీకు ఆకాశరామన్న తెలుసా ?"
"ఓ, తెలియకేం... ఇదివరకు మారుపేరుతో ఆకాశరామన్న, పాతాళ సీతమ్మ, శ్రేయోభిలాషి  అని ఉత్తరాలు వచ్చేవి. ఏవైనా వ్యవహారాలు చెడగోట్టాలంటే, తడికె చాటున నక్కి, ఉచిత సలహాలు ఇవ్వాలంటే, ధైర్యం లేని వాళ్ళు ఇలా చేసేవారు. అంతే కాదు, మరి కొన్నాళ్ళకి బ్లాంక్ కాల్స్, రాంగ్ కాల్స్ కూడా వచ్చేవి. నోట్లో కిళ్ళీ వేసుకుని, తమ గొంతు ఇతరులు గుర్తు పట్టకుండా మాట్లాడేవాళ్ళు ! తర్వాత సెల్ ఫోన్లు వచ్చాకా ఆ పప్పులు ఉడకలేదనుకో!"
"భేష్, నీకు చాలా విజ్ఞానం ఉంది. అంటే... ఏ చింతా లేకుండా పని జరిపించుకోడానికి ఇదొక పధ్ధతి అన్నమాట ! ఇప్పుడు మూడో ప్రశ్న !"

_______________________________________________________

3) 
"ఘోస్ట్ రైటర్ " అన్న పేరు విన్నావా ?
"వినకేం, చేతులు కళ్ళు తిరిగిపోయిన రచయతలు, రాసి, రాసి, చచ్చాకా కూడా అలవాటు కొద్దీ పుస్తకాలు రాసేస్తారేమో అనుకుని భయపడేదాన్ని. తర్వాతే తెలిసింది... పాపం డబ్బు లేని గొప్ప రచయతల్ని, డబ్బిచ్చుకు కొట్టి, రాయించుకునే రచనల్ని అలా అంటారని. ఇదంతా సోమ్మొకడిదీ... దానితో కొనుక్కునే సోకు కూడా అతడిదే..." అన్నట్లు ఉంటుంది.
"ఇక చివరాఖరి ప్రశ్న ! ఫేస్ బుక్ లో ఫేక్ ఐడి సృష్టించుకోవడం కష్టమా ?"
"అబ్బే,బండర్లడ్డు తిన్నంత సులువు. కాసిన్ని ఈమెయిలు లు సృష్టించి, కాసిన్ని ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించడమే ! "
"అగ్గదీ సంగతి ! తెలుసు కదా ! మరెందుకు లైక్ లకు, కామెంట్ లకు ఏడుస్తావ్. పత్రిక కంటెంట్, బొమ్మలు, ఆడ్స్ సంపాదించడం కష్టం. ఈ పని చాలా వీజీ ! ఎవరో వస్తారని, కామెంట్స్ పెడతారని ఎదురుచూసే బదులు... ఇంత కష్టపడ్డాకా, ఆ కాస్త కూడా నువ్వే కానివచ్చుగా ! "
"నేను ఇలా ఎప్పుడూ చెయ్యలేదు."
"ఓసి ఆండాళ్ళు ! ఇది అన్ని పత్రికలూ చేసేదే ! ఇంటరాక్టివ్ గా ఉండాలని పజిల్స్, సింగల్ పేజీ కధలు, అభిప్రాయాలు, లేఖలు, బొమ్మకు కధలు...అలాంటివి పెట్టి అంతా బొప్పి కట్టించుకుని, చివరికి వాళ్ళకి వాళ్ళే వనజ, జలజ, శైలజ పేర్లతో రాసేసుకుని, అచ్చేసుకు వదిలేసారు.... వదిలేస్తున్నారు. ఇది కూడా తప్పదోయ్..."
"అలాగా... నాకు బాగా అర్ధమైంది . నాకే కాదు, ఈ పోస్ట్ చదువుతున్న ఇతర పత్రికల వాళ్లకి కూడా అర్ధమయ్యింది. థాంక్స్ అంతరాత్మ కృష్ణ పరమాత్మ ! నీకోసం ఒక పద్యం చెబుతా !

అడిగిన కామెంటియ్యని పదుగురు
మనుజులను వేడి వగచుట కంటెన్ 
సడి సేయక పది ఫేక్ బుక్కుల 
సృష్టించి కొనసాగించగ పాడియె సుమతీ !

(ఈ పోస్ట్ సరదాగా నవ్వుకోవడానికే. నిన్నటి నుంచి నిరవధికంగా పత్రికకు ప్రోత్సాహం అందిస్తున్న మిత్రులకు కృతజ్ఞతాభివందనాలు )


 

చితిమంటల్లో చిచ్చుబుడ్డి

 నవ్వేజనా సుఖినోభవంతు -3 

చితిమంటల్లో చిచ్చుబుడ్డి 
(కాప్షన్ - ఒక క్షుద్ర ప్రేమ కధ )
------------------------------------------------------

(ఈ కధ హృదయ విదారకమైన క్షుద్ర కవితలు రాసే వారు అందరికీ భయంతో అంకితం ... భావరాజు పద్మిని )

ఎందుకోమరి... కొందరికి కొన్ని రకాల కవితలు నచ్చుతాయి కదా ! అలాగే రాంగోపాల్ వర్మ లాంటి ఒక అభ్యుదయ దెయ్యాల సినిమా దర్శకుడికి, ఒకతను ఫేస్ బుక్ లో రాసే క్షుద్ర కవితలు భలేగా నచ్చేసాయ్... అదేంటండి ? క్షుద్ర కవితలా ? ఎలా ఉంటాయ్ ? అంటారా... ఒక సాంపిల్ మీ కోసం...

నా గుండెని గునపాలతో తవ్వుతున్నారు 
చిద్రమైన నీ ప్రేమ శకలాల రక్తపుటేరు 
మాంస ఖండాల లోంచి ఉవ్వెత్తున ఎగసి,
లోపల రాసున్న నీ పేరును తడిపేస్తోంది 
నా ప్రాణం పోయినా నీ పేరు చెరగకూడదని 
బ్యాండ్ ఎయిడ్ వాష్ ప్రూఫ్ నీపేరుపై అంటించా.
నేను చచ్చాకైనా వచ్చి చదువుకో చెలీ...

మానవ మాత్రులకి ఇలాంటి క్షు . క (క్షుద్ర కవితలు) చదివితే చిర్రెత్తుకొస్తుంది. కాని 'పుర్రెకో బుద్ధి ' వెతికే ఆ దర్శకుడికి వెంటనే ఈ కవి చేత ఓ సినిమా కధ రాయించాలన్న బుద్ధి పుట్టింది. వెంటనే ఒక వెరైటీ క్షుద్ర ప్రేమ కధ పుట్టింది... కవిగారు దర్శకుడికి కధ చెప్తున్నారు...



అర్ధపగలు... శ్మశానం... కాటికాపరి శవాలు కాలుస్తూ వింటున్న రాక్ మ్యూజిక్ తో శవాలు కూడా భయపడిపోతున్నాయి. ఒక పిల్లి మెల్లిగా ఈల వేసింది( నక్క ఊళ పెట్టడం రొటీన్ ... పిల్లి ఈల వెయ్యడం వెరైటీ ). ఇక్కడ మీరు ఒక పాట పెట్టాలి. ఇదే మన హీరో ఎంట్రన్స్ సాంగ్.
చిచ్చుబుడ్డి కాల్చుకోడానికి స్మశానానికి వస్తాడు మన హీరో, పిల్లి ఈల విని పరవశించి పాట పాడతాడు.వెనుక కాటి కాపరి, శవాన్ని తగలబెట్టడానికి వచ్చిన వాళ్ళు స్టెప్ లు వేస్తారు.

నువ్వు ఈల వేస్తే వల్లకాడు యెగిరి పడతది...
నువ్వు ఈల వేస్తే పాడు గుండె ఉలికి పడతది 
నీ ఈలంటే ఏటి మజాకా... అది పాడిందంటే పాడె దాకా...  పాడే వీడి దాకా...
ధిమికి ధిమికి ధిమ్మాడి... గుబుకు గుబుకు గుమ్మాడి...

'ఓహో, ఏం క్రియేటివిటీ...' అంటూ వింటూ ఉంటాడు దర్శకుడు. ఇంతలో మన హీరొయిన్ టెన్నిస్ ఆడుతూ యెగిరి పడిన బంతిని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. పాట పాడుతున్న హీరో ను, అతని చంకలో ఉన్న పిల్లిని , చూస్తుంది. వెంటనే ప్రేమలో ముక్కు కింద దాకా మునిగిపోతుంది. హీరో హీరొయిన్ ని చూడగానే... చితిమంటల్లో తన చేతిలో ఉన్న చిచ్చుబుడ్డి వెలిగిస్తాడు. అలా మొదలౌతుంది... ప్రేమ టపాకాయ్ ...

కాని హీరో పాట పాడుతుండగా చూసిన ఒక గడుసు దెయ్యం హీరో మీద మనసు పారేసుకుంటుంది. పక్కనే ఉన్న మరొక ఆడ దెయ్యం కూడా అలాగే పారేసుకుంటుంది. వాళ్ళిద్దరూ కలిసి...' వాడు నావాడే... కాదు నావాడే...' అని ఫైటింగ్ చేసుకుంటారు. ఇక్కడ మనం ఎంచక్కా మర్రి ఊడ పట్టుకు లాగి తన్నడం, దెయ్యాలు జుట్టు పీక్కు కొట్టుకోవడం, అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షం అవ్వడం... లాంటి గ్రాఫిక్స్ వాడచ్చు. ఇక్కడ దెయ్యాల ఫైట్ కు వెరైటీ గా మాంచి ఐటెం సాంగ్ వాడదాం...

కెవ్వు కేక... నీ దుంపదెగ కెవ్వు కేక... 
మర్రి ఊడట్టుకుని కోపంతో ఊగిపోతూ నువ్వొచ్చి తన్నావంటే... కెవ్వు కేక 
తెల్లటి జుట్టట్టుకుని పీకేస్తూ గుంజేస్తూ నువు నన్ను కొట్టావంటే ... కెవ్వు కేక  

ఇలా పారడీ పాట బాగుంటుంది.

ఇక దెయ్యాలు, హీరొయిన్ మధ్య... హీరో మనసు నలిగిపోతుంది. అతనికి ముగ్గురూ నచ్చారు... అతని మనసు సహారా ఎడారంత  విశాలం. చిన్నప్పటి నుంచి, ఒక దెయ్యాన్ని పెళ్ళాడాలని అతని కల. అందుకే అతను ఒక ఉపాయం పన్నుతాడు. 'ప్రేమ దెయ్యలారా... ఉభయ తారకంగా ఒక ఉపాయం చెప్తా ! నేను బ్రతికి ఉన్నన్నాళ్ళు ఈ హీరొయిన్ ని పెళ్ళడతా ! చచ్చాకా మీ ఇద్దరినీ పెళ్ళాడి, శోభన్ బాబు లా 'ఆయనకీ ఇద్దరు' అంటూ... మీ ఇద్దరికీ తలలు  దువ్వి, జల్లేసుకు బ్రతికేస్తా... ఏం ?' అంటాడు. వెంటనే ముక్త కంఠంతో 'వాట్ అన్ ఐడియా హీరో జీ' అన్న దెయ్యాలు... 'ప్రియా, నీ కోసం, నీ ప్రేమ కోసం అరవై ఏళ్ళు ఏమి ఖర్మ... ఆరు వందల ఏళ్ళు అయినా వేచి ఉంటాం ... అప్పటి వరకూ పుట్టి చస్తూనే ఉంటాం ' అని వాజమ్మ ప్రమాణాలు చేసి, దగ్గరుండి ఇద్దరి పెళ్లి చేసి, ఆనందంగా హాహాకారాలు చేస్తాయి. 

ఇదన్నమాట కధ ! మీకు కధ నచ్చితే 'దెయ్యం' అని ఇంగ్లీష్ లో టైపు చేసి... 100 కి నచ్చకపోతే 'ఒంట్లో బాలేదు' అని టైపు చేసి 108 కి sms ఇవ్వండి...

(అ)జ్ఞానీలు

నవ్వేజనా సుఖినోభవంతు -2 

(అ)జ్ఞానీలు 
--------------

దిగేదాకా లోతు తెలీదు కదా !
అందుకే నువ్వు నీళ్ళ ముందు నిల్చో, తోసేస్తా!

నీ డైరీ లో ఒక పేజీ చింపి నాకివ్వవూ ?
నా మనసు ఊబిలో కాగితపు పడవ చేసి వేస్తా !

తెగేదాకా లాగాద్దూ అన్నారుగా !
అందుకే బావిలోకి  తాడు, బకెట్ వదిలేసా !

చేతులు కాలాకా ఆకులు పట్టుకోవాలిగా !
అందుకే మా ఇంట్లో ప్లాస్టిక్ క్రోటన్ పెంచుతున్నా !

లంక మేత గోదారి ఈత జంతువులకేనా ?
నేను అనుభూతులు మేసి,మది ఏటిలో నెమరేస్తున్నా! 

పాపి చిరాయువు అన్నారుగా !
అందుకేనేమో నేతలు గడ్డి మేతలు మేసేది !



అసలు కంటే వడ్డీ ముద్దేగా !
అందుకేనేమో చిల్లర లేకపొతే చాక్లెట్ ఇస్తారు!

పరుల సొమ్ము పాముతో సమానం అన్నారుగా !
అందుకే నేను కూడా ఒక ముంగిసను పట్టికేల్తా !

చెరపకురా చెడేవు అన్నారుగా !
అందుకే నేను ఎప్పుడూ బ్లాక్ బోర్డు చెరపను!

పిల్లి పోరూ పిల్లి పోరూ పిట్ట తీరుస్తుందిగా!
అందుకే పిట్టల దొరంటే జంతువుల జడ్జీ ! 

రాసేవాడికి చదివేవాడు లోకువేగా !
అందుకే రాసి కుంకుడుకాయ పులుసులా రుద్దేయ్ !

(ఈ తవికలో అర్ధాలు వెతక్కండి... ఏమీ ఉండవు. జ్ఞానీలు గా చాలా మంది రాసే కవితలు ఇలాగే ఉంటాయ్. వహ్వా అనడం మర్చిపోకండి...)

ప్రేమ పిడక - కవిత


నవ్వేజనా సుఖినోభవంతు !(హాస్య కవితల మాలిక)
--------------------------------------------------------------
ప్రేమ పిడక - కవిత (అని మీరు చచ్చినట్టు ఒప్పుకోవాల్సిందే !)

ప్రియా...

వలపు దారుల్లో నా తలపులన్నీ 
గుండ్రాయితో చితక్కొట్టి ముగ్గేసా 

కాని, దాని మీద ఒక దయలేని 
గౌడి గేదె పేడేసి పోయిందే !

ఆ పేడనే గొబ్బెమ్మ ముద్దగా చేసి, 
దానిపై నా మనసు బంతి పువ్వెట్టా 

ఒక మేక ఆ పువ్వుని తినేసి,
గొబ్బెమ్మ తొక్కి వెళ్ళిపోయే 



అయినా తొక్కిన గొబ్బెమ్మను 
దీనంగా తీసి,తడిక్కేసి పిడగ్గా కొట్టా 

ఆ పిడకెవరో చప్పున ఎత్తుకెళ్ళి 
కుంపట్లో వేసి చలి కాచుకున్నారు.

ఇంకేముంది ?బూడిదే మిగిలింది...
దాన్నే ఒంటికి రాసుకుని, నీప్రేమకై 
పరుగిడి వడివడిగా ఒస్తున్నా...
నా ప్రేమ సుగంధం... 
నీ ముక్కుపుటాల్ని తాకుతోంది కదూ !

(రకరకాల కవితలు రాసి జనాలు అవార్డులు కొట్టేస్తున్నారు. కడుపుబ్బా నవ్వించే కవితలు నేనూ రాస్తే పోలా ! అందుకే ... మొదలెట్టేసా... ఈ కవితకు లైక్ కొట్టని వారికీ, కామెంట్ పెట్టని వారికీ ఈ రోజంతా... పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే సన్నివేశాలు ఎదురౌతాయి ! ఇదే నా శాపం ! - ఓ అభినవ శ్రీలక్ష్మి )