Thursday, February 12, 2015

గొబ్బెమ్మ హంట్

' లిసేన్,దోస్ హూ ఆర్ ఇన్ డాన్స్ గెట్ వన్ గొబ్బెమ్మ టుమారో,' అని టీచర్ చెప్పింది అమ్మా. ఇంతకీ గొబ్బెమ్మ అంటే, ఏమిటంటావ్ ?

'ఆవు పేడతో చేస్తారమ్మా, పోయిన ఏడాది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు...'

'ఓ, ఆ గ్రీన్ బాల్స్, ఇంతకీ పేడ అంటే ఆవు ఇదా...?' రెండు వేళ్ళు చూపెట్టింది...

'అవునమ్మా, ఆవు నుంచీ వచ్చే ప్రతీదీ పవిత్రమైనదే! బెంగుళూరు లో మన కిందింటి ఆంటీ రోజూ లేవగానే, వాళ్ళ పిల్లల ముక్కు మూసి, గోమూత్రం పోసేది, గుర్తుందా?'

'అయితే కొంపతీసి, ఈ గొబ్బెమ్మలు తినాలా ఏమిటి ?'

నవ్వొచ్చింది నాకు, 'అక్కర్లేదు. పూజకే!' అన్నాను. అది వెంటనే ఫోన్లు చేసి, దాని నేస్తాలతో 'డో యు నో వాట్ ఇస్ గొబ్బెమ్మ...' అంటూ ముచ్చట్లు పెట్టింది. ఇప్పటికి ఇప్పుడు గొబ్బెమ్మలు ఎలా తేవాలా అని నేను ఆలోచించాను. వెంటనే నా ఊహలలోంచి రామారావు గారు బైటికి దూకి,

'ఏమంటివి, ఏమంటివి ? గొబ్బెమ్మలు కావలయునా ? ఈ మహానగరమున ఆవులు ఎచట దొరకవలె ? దొరికినవి పో, వాటి కడకు యెట్లు పోవలె ? పోతివి పో, అవి అదే సమయమున పేడ ఏల వెయ్యవలె ? వేసినవి పో, నీ వలె పేడకై చూచెడి వారి క్యూ అచట ఉండక ఎందుకు ఉండవలె ? ఉంటిరి పో ,పేడ నీకే ఏల ఇయ్యవలె , అది నీవు యెట్లు తేవలె ...' ఇలా పో, పో అంటూ ప్రశ్నల శరాలు సంధించసాగారు. 

'అమ్మా, గొబ్బెమ్మకు పో, ఇంకా పోలేదా?' అంటూ మేల్కొలిపింది నా చిన్న కూతురు. ఎదురింటావిడ ఈ మధ్య గొబ్బిళ్ళు పెట్టి, ఎవరూ తొక్కకుండా పీట వేసింది. హమ్మయ్య, ఆవిడనే అడుగుదాం, అనుకుని వెళ్ళాను. మాకు దగ్గరలోనే ఆవు ఉందిట. వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పంపింది.




మనోవేగంతో నడిచే ఆ పిల్ల పక్కన నడిచినట్టు పరిగెట్టి, అక్కడకు వెళ్ళాను. నా బుర్రలో ఏదో గోశాల, పాకలు ఉన్నాయి. సదరు చోట ఎవరూ లేరు. ఇంతలో గెంతుకుంటూ వచ్చాడు ఐదేళ్ళ పిల్లాడు. 'పేడ గావాల్నా, రాండి,' అంటూ జేబులోంచి తాళం తీసి, తలుపు తెరిచాడు. నల్లావు, ఇవాళే ఈనిందట, పక్కన బుజ్జి దూడ. పెద్ద కాంపౌండ్. వెనుక చూద్దును కదా, ఒక్క క్షణం నాకు సౌండ్ లేదు. ఒక డజను సమాధులు. ' ఇదిగో, ఆవును తెచ్చి, ఇక్కడ కట్టారు ...' అన్నాను. ' ఆళ్ళు సచ్చి, చాలా కాలం ఐందిలే, అయినా, ఆవు పేడ లేదు, తీసి పెడతా, మళ్ళీ రా!' అన్నాడు. ఈసురో మని వెళ్తుంటే, పక్కనే తెల్లావు ఉందిట ఆంటీ... అంది నాతొ వచ్చిన పిల్ల. నేను దగ్గరికి వెళ్లి కాస్త పరిశోధించి, అది ఆవు కాదు ఎద్దు, అన్నాను. 'ఎద్దు పేడ పనికి రాదా ఆంటీ ?' అమాయకంగా అడిగింది ఆ పిల్ల. లేదమ్మా, అన్నాను నవ్వుకుంటూ. ఈ లోపల అటుగా వెళ్తున్న ఒకావిడ నన్ను ఎగా దిగా చూసి, 'అది ఎద్దు ఆవు, సరిగ్గా చూడు, ' అంది. నాకు సిగ్గేసిపోయింది. 'అలాగేనండి, ఈ సారి సిగ్గులేకుండా చూస్తాను,' అని చెప్పి, దగ్గరలో ఉన్న పిల్లల్ని, 'పేడ దానం దేహి ...' అన్నాను. వాళ్ళు పెద్ద పెట్టె లోంచి, కాస్త పేడ పొదుపుగా తీసి ఇచ్చారు.

అలా ఇంటికి వచ్చి, గొబ్బెమ్మలు చేసి, పసుపూ కుంకుమతో అలంకరించి, ఒక అట్ట పెట్టెలో కేకు ప్యాక్ చేసినట్టు అమర్చి పెట్టాను. ఇక్కడికి ఒక అంకం ముగిసింది. ఇక రేపు ఉదయం నా ఏడేళ్ళ కూతురికీ మాచింగ్ లు వెతికి, సవరంతో జడకుప్పెలు వేసి, పరికిణీ, అలంకారాలు చేసి పంపేసరికి ఉంటుందీ... స్వర్గానికి కేవలం ఒక మెట్టు క్రింది వరకూ వెళ్లి వచ్చేస్తాను. అయినా, ముద్దుగా ముస్తాబైన పిల్లని కళ్ళారా చూసుకుంటే, తల్లి పడ్డ కష్టం అంతా యెగిరిపోతుంది. కదూ... 

No comments:

Post a Comment