'వర్ణాన' తీసివేత
- భావరాజు పద్మిని.
ఊరందరిదీ ఒకదారి, ఉలిపి కట్టెది ఒకదారి... అన్నట్లు ఉంటాడు గోవర్ధనం. ఎప్పుడో అతనికి ఇడ్లీ సబ్బునురుగులా కనిపిస్తుంది... వాలుజడ బఱ్ఱె తోక లా కనిపిస్తుంది, బంతిపువ్వు ఎండలో మెరిసే బోడిగుండులా అనిపిస్తుంది. అరె, మీకింకా అర్ధం కాలేదా ? గోవర్ధనానికి ఒకరు వాడిన వర్ణనలే వాడడం నచ్చదు, అందుకే వెరైటీ గా ట్రై చేస్తుంటాడు. ఒకసారి 'ప్రేమ ప్రేమకోసం ప్రేమను ప్రేమిస్తుంది, ఎందుకో అడక్కు' అనే పేస్ బుక్ గ్రూప్ వాళ్ళు ప్రేమ కవితల పోటీ పెట్టారట ! అందుకోసం మనవాడు ఓ కవిత రాసాడు. ఇంతకీ ప్రైజు వచ్చిందో లేదో, చదివి, మీరే చెప్పాలి.
ప్రియా,
కంకరాళ్ళ లాంటి నీ కళ్ళు చూసి,
నా గుండెల్లో రాయి పడింది.
పిడుగు పడ్డట్టు నీ మాట విని,
నాక పిడిగుద్దులు గుద్దినట్టు ఉంది.
చీపురుకట్ట లాంటి నీ చింపిరిజుట్టు ఎగిరితే,
నాకు ప్రేమ దయ్యం పట్టినట్లు ఉంది.
కప్ప గెంతుల్లాంటి నీ నడక చూసి,
నా మనసును గోతిలో కప్పెట్టినట్టుంది.
కదిలే రోడ్డు రోలరు లాంటి నువ్వు,
నీ ఏనుగు పాదాల కింద నన్ను చిదిమేసావు.
అంచేత, ప్రేమ గొంగళి కప్పుకున్న నన్ను,
గుడ్డులోంచి బైటికి లాగి బటర్ఫ్లై లా ఎగరనివ్వు.
వాటర్ ట్యాంక్ లూ నీరంత ప్రేమని, నాకందివ్వు.
ఖాళీ గా ఉన్న నా గుండె బాల్చీని నింపు .
నీ తల్లో పేనులా, నీ మెళ్ళో చున్నీ పాములా,
నీ గోళ్ళలో మట్టిలా, నీ చెవిచుట్టూ దోమలా,
తిరుగుతూ ప్రేమ ఇసుక తుఫాను సృష్టిస్తా.
జన్మజన్మలకి నీకే లైఫ్ టైం వాలిడిటి రాసిస్తా,
ఈ పోటీలు పెట్టిన వాడి మీద ఒట్టు ! నిజ్జం !
Ha ha haa idi inkaa super
ReplyDelete