హితులారా! రాత్రి ఒక స్వప్నమును కాంచితిని... అకాలమున నిద్రించిన ఇట్టి కలలే వచ్చును.
స్వప్నమున వ్యాసరచన పోటీ నిర్వహించుచున్నారు. అందు కేవలము నాతొ కలిపి, కేవలం ఐదుగురు మాత్రమే పాల్గొనుచున్నారు. అంశం యేమన 'న్యూ ఇయర్' పండుగను గురించి వ్రాయుట.సాధారణముగా పండుగ అనిన వ్యాసము వ్రాయుట ఎట్లని యోచించితిని. పండుగ రోజు ఉదయాన్నే మేల్కొని, తలంటు స్నానము చేసి, కొత్త బట్టలు కట్టుదురు... మరి న్యూ ఇయర్ అట్లు కాదే... ఏమి చేయవలె... ఆ, చుట్టూ నలుగురు కలరు కదా... కాపీ కొట్టిన పోవునేమో!
నెమ్మదిగా ముందు చూచితిని. అప్రాచ్యుడు! తెలుగు వ్యాసము ఆంగ్లమున వ్రాయుచున్నాడు. ఇట్టి వారి వలన నా వంటి పరాన్న భుక్కులు బాధింపబడుచున్నారు. సరి, ఎడమ ప్రక్క చూచితిని. అతగాడు తన అభిమాన హీరో న్యూ ఇయర్ యెట్లు చేసుకొనునో వ్రాయుచున్నాడు. అతనికి 'హీరో ఇసం ' అనిన మక్కువ. కుడి ప్రక్కకు చూచితిని... అతను న్యూ ఇయర్ సంబరాలు పదకండు మంది, మూడు కర్రలు పెట్టుకు, బంతితో పరుగులు పెడుతూ చేసుకొందురు అని వ్రాయుచున్నాడు... అతనికి 'క్రికెట్ ఇసం' కలదు కాబోలు. వెనుక ఉన్న అమ్మణ్ణి ని చూచితిని... ఆమె ఇట్లు వ్రాయుచున్నది...' మాతా కాళి క సందేశ్... ఈ వాక్యములు చదివిన వారు తక్షణమే వెయ్యి కాపీ లు వ్రాసి పంచకపోయిన, అనేక కష్టముల పాలై పుటుక్కున చచ్చెదరు...' ఇక చదువుటకు నేను భీతి చెందితిని?
మరి ఏమి చేయుట? 'ఆ, వెలిగినది దీపం... నేత్రములు విశాలములు అయినవి...' , చిన్నప్పుడు ఆవు వ్యాసమును మాత్రమే చదివిన విద్యార్ధికి మేడ వ్యాసమును ఇచ్చిన ఏమి చేసెను? 'అదిగదిగో మేడ... మేడ పక్కన గోడ... గోడ పక్కన దూడ... దూడ మమ్మీ ని చూడ... ఆహా, అదిగో, ఆవు. అవుకు నాలుగు కాళ్ళు ఉండును...' అని వ్రాసెను కదా... అట్లే సేయుదును. ఇక న్యూ ఇయర్ వ్యాసము మొదలుపెట్టి, చక్కగా వ్రాసిన, నాలుగు స్తంభాలు పునాదులు లేనివి కనుక, గెలుపు నాదేనను ధైర్యము కలిగినది.
'న్యూ ఇయర్ పండుగ ముందు రోజున పిన్నలు, పెద్దలు, చక్కగా తలంటు స్నానము చేసి, కొత్త పొట్టి బట్టలు కట్టుదురు. కురులు విరబోసుకుందురు. మెళ్ళో కోయ పూసలు వేసుకుందురు. కోసుకు మింగుటకు కేకును, త్రాగుటకు తగిన పానీయములను తెచ్చుకుందురు. ఇక వింత వాద్యముల భీభత్స కలయికతో కూడిన పాటలను పెట్టుకుని, కాస్త కిక్కును, ఊపును అరువు తెచ్చుకుని, పూనకము వచ్చినట్లు ఊగుతూ, ఆవేశము చల్లారు వరకు చిందాడుదురు. అది చూచిన మిగతా వారు, నిప్పులు తొక్కే కోతులను పక్క తాళము వేయు వారివలె చప్పట్లు కొట్టి ప్రోత్సహించెదరు. పానీయముల మత్తు నెత్తికెక్కిన కుర్ర కారు బైక్ లు ఎక్కి, కారుకూతలు కూస్తూ, వేగముగా పయనించి, కాళ్ళు, కీళ్ళు విరగ్గోట్టుకుందురు. ఇందు వలన ఆసుపత్రులకు లాభం. కుల, మత, లింగ భేదాలు లేకుండా చేసుకోను ఈ పండుగ మిక్కిలి ప్రసిద్ధమైనది. ఇందువలన స్త్రీపురుష సమానత్వమును, హద్దుల గీతలు దాటి హై జoపు చేసి, హడావిడి చేయు అవకాశము కలుగును. కావున ఈ పండుగ చేసుకుని, క్యాలెండరు దేవుని కృపకు పాత్రులు కాగలరు...'
ఓహో, ఇక గెలుపు నాదే అనుకుని, హాయిగా శయనించితిని ..మిత్రులారా! బహుమతి నాదే కదా...
No comments:
Post a Comment