కష్టముల కేర్ (కస్టమర్ కేర్ )
--------------------------------
భావరాజు పద్మిని - 6/2/15
ప్రతి కంపెనీ కి ఒక కస్టమర్ కేర్ ఉంటుంది. మీ కష్టాల్లో ఫోన్ చేసి, 'కేర్' మని పసిపిల్లల్లా ఏడవడానికి ఇది బాగా పనికివస్తుంది. అయితే, ఏదో పాపం కష్టాల్లో ఉన్నారు కదా, అని మీరు ఫోన్ చేసి, ఎలాపడితే అలా ఏడిస్తే వీళ్ళు వినరండోయ్ ! మీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా అన్నీ చెప్పి మరీ ఏడవాలి.
అనంతానికి అరడజను ATM కార్డులు లాఘవంగా అంట గట్టారు బ్యాంకు భామలు. అందులో 3 డెబిట్ కార్డులు, 3 క్రెడిట్ కార్డులు. పెద్దగా చదువుకోలేదు అతను, వ్యవసాయం చేస్తుంటాడు. అందుకే, గుర్తు ఉండదని, కార్డు పిన్ నెంబర్ లు కార్డు వెనుకే రాసి పెట్టుకుంటాడు. ఇది అతనికే కాదు, చాలా మందికి ఉన్న చెడ్డ అలవాటు.
అనంతం అరసవెల్లి సూర్యనారాయణ మూర్తిని చూసి వద్దామని, వెళ్ళాడు. అతను ఆర్చుకుంటూ, తీర్చుకుంటూ తిరుగుతూ ఉండగా, బాగా హస్త లాఘవం కల చోర శిఖామణి, అతని పర్స్ కొట్టేసాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి ? హమ్మో, వెంటనే కార్డు బ్లాక్ చెయ్యాలి, అనుకున్నాడు. ఈ లోపలే , మొబైల్ బ్యాంకింగ్ ఉండడంతో, అతని ఎకౌంటు నుంచి 10,000 డ్రా చేసినట్టు మెసేజ్ వచ్చింది. అతను కంగారుగా ఒక షాప్ కు వెళ్లి, 'కష్టముల కేర్ ' నెంబర్ కనుక్కుని, మొదటిసారి, ఫోన్ చేసాడు.
‘స్వాగతం ! మా ‘లేనా ‘ బ్యాంకు కష్టముల కేర్ కు స్వాగతం... తెలుగు కొరకు ఒకటి నొక్కండి, ఇంగ్లీష్ కొరకు 2, హిందీ లో సమాచారం కొరకు 3 నొక్కండి...’ అంది మిషనమ్మ. ఓపిగ్గా ఒకటి నొక్కాకా... మళ్ళి అంకెల ఆట మొదలు... బ్యాంకింగ్ సేవలకు ఒకటి నొక్కండి... మీ ఖాతా వివరాలకు రెండు నొక్కండి...’ ఇలా కాసేపు నొక్కుడు కార్యక్రమం ముగిసాకా... ‘మీ కాల్ మాకు చాలా విలువైనది, మా ప్రతినిధులు త్వరలోనే మీతో మాట్లాడతారు, దయచేసి, లైన్ లో వేచి ఉండండి...’ అంది మిషనమ్మ...
ఈ లోగా మరో కార్డు నుంచి, మరొక పదివేలు తీసినట్టు మెసేజ్ వచ్చింది. అనంతానికి బి.పి పెరిగిపోతోంది. లైన్ లో వేచి ఉంచి, అతనికి బ్యాంకు వాళ్ళు ఇచ్చే కొత్త ఆఫర్ ల జ్ఞానమంతా ప్రసాదిస్తున్నారు. ఇంతలో కాల్ కట్ అయింది. ‘ఛ ! ‘ అనుకుని, అలా 2,3 సార్లు అంకెలాట ఆడి, ఓ అరగంట లైన్ లో నిల్చున్నకా, ఫోన్లో తగిలింది ఒక భామ.
‘నమస్కారమండి, నా పేరు జూలీ, నేను మీకు ఏ విధంగా సహాయ పడగలను ? ‘ అనంతం మాట్లాడబోయే లోగానే, మళ్ళీ ఆమె -
‘మీకో, సూచన ఈ కాల్ ఇంటర్నల్ ట్రైనింగ్ కోసం రికార్డు చెయ్యబడుతోంది. మీ పేరు చెప్పండి,’ అంది.
‘చూడమ్మా, నా పేరు అనంతం, ఊరు అనకాపల్లి.’
‘ఓహ్, చాలా బాగుంది అనంతం గారు, మీ పూర్తి చిరునామా, పుట్టినతేదీ చెప్పండి...’
‘కుశల ప్రశ్నలు తర్వాత వేసుకుందాం కానీ, నా కార్డు పోయింది. వాడెవడో జలగలా నా డబ్బంతా పిండేస్తున్నాడు. ముందు అర్జెంటు గా బ్లాక్ చెయ్యండి...’
‘అలా కుదరదు అనంతం గారు, ముందుగా మీ వివరాలు చెప్పండి...’
‘నాకేం తెల్సు, ఆ అప్పలాచారి గాడు రాసి చచ్చాడు. ఏం రాసాడో... సరే నా చిరునామా ఇదీ, అంటూ చెప్పాడు...’
‘క్షమించండి, మీరిచ్చిన చిరునామాలో వీధి నెంబర్ తప్పు, నేను మీకు వేరే ఏ విధంగా సహాయ పడగలను ?’ , అంది.
‘పోనీ వీధి నెంబర్ 12 అని రాసాడా ఆ ఆచారి కుంక... ‘
‘వావ్, మీరు భలే కనిపెట్టేసారు, ఇంకా మీ పుట్టినతేదీ వివరాలు చెప్పండి...’
ఈ లోపల మరో పదివేలు స్వాహా అయినట్టు మెసేజ్. ‘ ఓరి వీడి అసాధ్యం కూలా !’ అనుకున్నాడు. అప్పలాచారికి సహనం చచ్చిపోతోంది.
‘అమ్మా, నువ్వు వెంటనే కార్డు బ్లాక్ చెయ్యకపోతే, నేను పుట్టిన తేదీ ఏమో కాని, చచ్చిన తేదీ త్వరలోనే వచ్చేలా ఉంది. 70 లో పుట్టాలే !’
‘అలాకాదు అనంతం గారు, మీ పుట్టినతేదీ సరిగ్గా చెప్పండి, అప్పుడే నేను మీకు సహాయ పడగలను...’
‘ఓసి నీ పిండం పిగ్గులకి బెట్ట ! అవతల పీకల మీదకు వస్తుంటే, నిమ్మకు నీరెత్తినట్టు ఉంటావా ?’
‘మీకు ముందే చెప్పాము, మీ కాల్ రికార్డు చెయ్యబడుతోంది... ‘
‘తల్లీ, నీకో దండం, కార్డు నెంబర్ చెబుతాను, బ్లాక్ చెయ్యవమ్మా !’
‘మా రూల్స్ అలా ఒప్పుకోవండి, వివరాలు టాలీ కాకుంటే మేము ఏమీ చెయ్యలేము..., అయినా ఎందుకు సర్ కంగారు పడతారు, ఎలాగూ 3 సార్లు 30,000 తీసేసాడు. మహా ఐతే, ఈ రోజుకి ఇంకో 10,000 తియ్యగలడు. రేపు మీరు దగ్గరలోని బ్యాంకు కు వెళ్లి, మీ కార్డు బ్లాక్ చేయించుకోండి...’
‘ఇంకా 5 కార్డులు ఉన్నాయమ్మో... ఒక్క కార్దుకే నాకు చుక్కలు చూపిస్తున్నారు. కష్టాల్లో బుర్ర లేని యంత్రాల్లా పనిచేసే కష్టముల కేర్ కు వెళ్ళే కంటే, అసలు కార్డులు తీసుకోకుండా ఉండడమే నయం తల్లో ! కొండనాలిక్కు మందేస్తే, ఉన్న నాలిక ఊడిందట ! అలా అయ్యింది నా పని. నీకు ఫోన్ చేసినందుకు నా చెప్పిచ్చుకుని, నేనే కొట్టుకోవాలి మాతో !’
‘అనంతం గారు, మరేమైనా సాయం కావాలా ? నాతో మాట్లాడడం గురించి మీకొక ఫీడ్ బ్యాక్ ఫారం వస్తుంది, పది లోపు మీకు నచ్చిన మార్కులు ఇవ్వండి...’ అంది, ఇంత వింటున్నా అభావంగా జూలీ.
‘ పది లోపు అంకెలు నొక్కడం కాదు, వీలుంటే, మీ పీక నొక్కాలని ఉంది, కాని అవకాశం లేదు కదా ! అలాగే పంపుతా తల్లీ, రోజుకు ఆరు కాల్స్, 12 తిట్లతో వర్దిల్లమ్మా...’
కాల్ కట్ అయిన వెంటనే ఫీడ్ బ్యాక్ ఫారం వచ్చింది... అందులో... గుడ్, బెటర్, బెస్ట్... తప్ప వరస్ట్ అనే ఆప్షన్ లేకపోవడంతో తల షాప్ వాడి బానపొట్ట కేసి, బాదుకున్నాడు అనంతం.
No comments:
Post a Comment