Thursday, February 12, 2015

ఎగిరే చిత్రం

(వైజాగ్  బీచ్ రోడ్ లో చూసిన ఒక సరదా సన్నివేశం , కాస్త అల్లరితో కలిపి మీ కోసం - భావరాజు పద్మిని 15/1/14 )

ప్రయోగము : ఎగిరే చిత్రం 

ఉద్దేశము/లక్ష్యము : కడలి అలల మీద ఎగిరుతున్నట్టుగా ఫోటో తీయించుకోవడం. ఇందుకు ప్రేరణ సాగరసంగమం సినిమాలో కమలహాసన్ 'కొబ్బరి చెట్టు మీద ఎగురుతున్నట్టుగా ' భంగిమ పెట్టి ఫోటో తీయించుకునే సన్నివేశం.

కావలసిన పదార్ధాలు : కొంత మంది మనుషులు, అందులో ఫోటోలు తీసే ప్రజ్ఞాశాలి ఒకరు , ఒక కెమెరా, ఎగిరేందుకు సరిపడా ఆవేశం.

విధానము : నలుగురు మిత్రులు వరుసలో నిల్చోవాలి. ఒకరు ఇసుక మీద ఒడ్డున పడుకుని ఫోటో ఆంగిల్ సరి చేసుకోవాలి. ఇప్పుడు ఇతను 'రెడీ' అనగానే, మిగిలిన నలుగురు, చెంగున ఎగరాలి. ఆ ఎగరడం, ఫోటో తియ్యడం ఒకే సారి సంభవించాలి...

సంభవామి యుగే యుగే ...  ఆదిలోనే హంసపాదం ... ఎగరే హుషారులో ఒకడు కింద పడ్డాడు.

పునః ప్రారంభం... ఈ సారి ఎగిరే వీళ్ళను చూసి అల కు హుషారు ఎక్కువై ఫోటో తీసే అతని మోకాళ్ళ వరకూ వచ్చేసింది... నలుగురూ ఎగిరిన ఎగురుడు వల్ల నీళ్ళు వచ్చి ఇతని మొహాన పడ్డాయి... 

కాస్త వెనక్కి వెళ్లారు, ఈ సారి ప్లాన్ మార్చారు... నలుగురు ఎగిరే బదులు, ఇద్దరు ఇద్దరుగా ఎగరాలని నిర్ణయించారు... అటు నుంచీ ఒకరు, ఇటు నుంచీ ఒకరు, పాత సినిమా హీరో హీరోయిన్ లాగా పరిగెట్టుకు వచ్చి సరిగ్గా మధ్యలో ఎగరాలి. పాపం బానే ఎగురుతూ వచ్చారు, ఒకరికి ఒకరు గుద్దుకుని బొక్క బోర్లా పడ్డారు.



లాభం లేదు... అయినా ప్రయత్నం ఆగదు... ఈ సారి ఇద్దరు కూర్చున్నట్టు, ఇద్దరు ఎగురుతున్నట్టు తీయించుకోవాలి... ఇద్దరినీ కూర్చోబెట్టి, వెనుక ఎగిరేందుకు రంగం సిద్ధం చేసారు. అలా పరిగెట్టుకు రావడంలో కాళ్ళు కూర్చున్న వాళ్లకు తగిలి, ఫోటో తీసే అతని మీద పడిపోయాడు ఒకడు. ఉరిమి ఉరిమి మంగలం మీద పడ్డం అంటే, ఇదేనేమో. 

ఫలితం : అంతా, హాయిగా నవ్వేసుకుని, ఇక ఫోటోల ప్రయత్నం విరమించారు. నేస్తాల మీద చేతులు వేసుకుని సాగర తీరం వెంట వెళ్ళిపోయారు.

నీతి : ఎగిరే భంగిమలో(గ్రాఫిక్స్ లేకుండా) మంచి ఫోటో తీయించుకోవాలి కాలం, ఖర్మం కూడా కలిసిరావాలి. ఈ సారి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి మరి. 

No comments:

Post a Comment