// ఆడవాళ్ళకు మాత్రమే ! //
'ఆహా ! ఏమైనా నీకు తిరుగులేదురా ! కవితలతో ఆడవాళ్ళను మెప్పించడంలో నీకు నువ్వే సాటి!' తన భుజం తానే తట్టుకుని మురిసిపోయాడు.
యెంత ముద్దుగా మాట్లాడుతుంది టింకి... తనకు ఫేస్ బుక్ ద్వారా పరిచయం. ఆర్తి అగర్వాల్ ఫోటో పెట్టుకుని ఉంటుంది. తను కూడా అలాగే ఉంటుందేమో చూడాలి. అసలు ఈ ఫేస్ బుక్ పెట్టిన వాడి చుట్టూ పొర్లుదండాలు పెట్టాలి. 'మహాప్రభో! అడ్డమైన కబుర్లతో అమ్మాయిల్ని పడెయ్యడానికి ఏమి మార్గం చూపారు...' అంటూ పొగిడేయ్యాలి.
బైక్ ఎక్కి గాల్లో తేలుతూ వెళ్తున్నాడు జోగినాధం. ఒక్కసారి గతం గుర్తుకు వచ్చింది.
తనకు పెళ్లైంది, పెళ్ళాం పిల్లలు వేరే ఊర్లో ఉంటారు. తను ఉద్యోగం పేరుతో ఇక్కడ. కాలక్షేపం కాక, ఫేస్ బుక్ లో స్టేటస్ 'సింగల్' అని పెట్టుకు కబుర్లు మొదలెట్టాడు. చిన్నప్పుడు రాసిన చచ్చు కవితలు ఏరి, పోస్ట్ చేసాడు. యేవో కొన్ని లైక్ లు, కామెంట్ లు మూట గట్టుకున్నాడు. అలా రాస్తుండగానే తగిలాడు గోపి. చెప్పద్దూ, నిజంగా వాడిది గోడ మీది పిల్లి వాటమే !
'అన్నయ్యా ! ఎలాగూ యేవో కవితలు రాస్తున్నావ్. ఆ రాసేవి భగ్న ప్రేమ కవితలు, విరహ ప్రేమ కవితలు రాసావనుకో, నీ జీవితం నిత్య కళ్యాణం అవుతుంది. పాపం జాలిగుండె కల ఆడాళ్ళు, భగ్న ప్రేమ కవితలు, విరహ గీతాలు, నిరాశా వాదాలు చదివి, వీళ్ళకి ఎవరూ లేరనుకుని, సానుభూతితో చాటింగ్ మొదలెడతారు. ఇకతియ్యటి కబుర్లతో వాళ్ళను మెప్పించావే అనుకో, నీకు తిరుగుండదు. ఒకళ్ళతో మాట్లాడుతున్నట్టు, మరొకళ్ళకి తెలీదు. అలా హనీ, పింకీ, డాలీ, రీటా, అందరితో స్నేహం చేస్తూ పండగ చేసుకో!'
'రీటా సంగతి సరే గాని తమ్ముడూ, విషయం లీక్ అయితే బాటా చెప్పుతో కొడతారేమో !'
'అలాంటప్పుడు, నా అకౌంట్ హాక్ అయ్యిందనో, మరేదో చెప్పచ్చు. ఆడాళ్ళని నమ్మించడం, నీ ఫోటోలు, చాట్ నా వద్ద ఉన్నాయని బెదిరించడం చాలా సులువు. అయినా నేను ఏడాది బట్టి దొరకంది, కొత్తగా వచ్చిన నువ్వు దొరుకుతావా ? ధైర్యే సాహసే కాలక్షేపం!'
అలా మొదలైన జోగినాధం 'ఏకాకి ' గీతం గొర్రెల్లాంటి ఆడాళ్ళ పుణ్యమా అని యుగళ గీతంగా సాగుతోంది. అప్పుడు పరిచయం అయ్యింది టింకి . యెంత చక్కటి గొంతు, యెంత తియ్యటి కబుర్లు... అయినా, ఏం లాభం ? చాట్ లో ఎప్పుడూ ముసుగే తియ్యదు. అగర్వాల్ కదా, ఆ మాత్రం సిగ్గు ఉంటుందిలే! ఇవాళ తనని చూడబోతున్నాను... ఆ ఊహతోనే వెయ్యి కాండిల్ లైట్ లా వెలిగింది అతని మొహం.
టింకి ఇంటి తలుపు తీసే ఉంది. తను లోపలకు వెళ్ళగానే తలుపు మూసుకుంది. కొంటె పిల్ల, యెంత గడుసో! ఇంతలో లోపలి నుంచి, మరో నాలుగైదు ముసుగులు వచ్చాయి. వీళ్ళలో టింకి ఎవరో, అనుకుంటూ ఉండగా, అందరూ ఊకుమ్మడిగా ముసుగు తీసారు.
అంతే !
చలిజ్వరం వచ్చిన వాడిలా గడగడా వణికిపోయాడు జోగినాధం.
తేడా మొహాలు ఉన్న మాడాలు ఐదుగురు ఉన్నారు. రౌడీల్లా ఉన్నారు. ఒక్కసారి అతని దగ్గరకు వచ్చి మీదపడి, రకరకాల భంగిమల్లో ఫోటోలు తీసేసారు. జోగినాధం యెంత గింజుకున్నా లాభం లేకపోయింది. అంతలో ఒకామె ముందుకొచ్చి...
'చూడొరే ! ఇన్నాళ్ళు టింకి పేరుతో మాట్లాడింది నేనే! నువ్వు 'ప్రేమ' పేరుతో నమ్మించి వంచించిన ఆడాళ్ళంతా ఒకటై మమ్మల్ని నియమించారు. నీ ఆట ఇక కొనసాగిస్తే, ఈ ఫోటోలు నీ సామాజిక నెట్వర్క్ లు అన్నిట్లోకి ఎక్కుతాయి.
నీ మానసిక వికారాలకి 'ప్రేమ' అన్న పవిత్రమైన పేరు పెట్టి, ఆ పేరును, దానికున్న విలువను అపవిత్రం చెయ్యకు. ప్రేమకు నోచుకోని మా వంటి వారికి తెలుస్తుంది, ప్రేమ విలువ ఏమిటో! అసహాయంగా ఉండే ఆడాళ్ళని వంచించడం గొప్పనుకోకు !చక్కగా పెళ్ళాం పిల్లల్ని తెచ్చుకుని, చేసుకో కాలక్షేపం ! వాళ్ళ మొహాలు చూసి, నిన్ను వదిలేస్తున్నాం, పో!' అంది.
జోగినాధానికి జ్ఞానోదయం అయ్యింది. మరి ఫేస్ బుక్ లో పెళ్ళికాలేదని, పెళ్ళైనా భార్య లేదని, రెండవ పెళ్ళికి సిద్ధమని, ఇటువంటి వేషాలు వేస్తున్న , కడుపునిండినా కాంక్ష నిండని జల్సా రాయళ్ళుమరెందరికో కూడా అర్ధమైతే, ఆ మహాజాలరుల కవితలకు ఉబ్బి తబ్బిబ్బై హద్దులు మరచిపోతున్న ఆడాళ్ళకు కూడా అర్ధమైతే ,అదే ఈ రచనకు సార్ధకత !
ఉండండి... అక్కడ ఎవరో చెయ్యెత్తారు. సందేహం అనుకుంటా !
'మరి పైన ఆడవాళ్ళకు మాత్రమే!' అని ఎందుకు పెట్టారు.
'అలా రాస్తే, అంతా తప్పక చదువుతారు కనుక! తెలిసిందామ్మా ! మరిక భద్రం అమ్మాయిలూ ! ఇటువంటి కవితలు చూసీ చూడనట్టు పోతారు కదూ !'
No comments:
Post a Comment