భారతంలో భద్రత
భావరాజు పద్మిని – 28/2/14
ఊర్మిళ కి మంచం వాసన చూస్తే నిద్దరోస్తుంది... నిద్దర్లో నడకొస్తుంది...
అలా నడుస్తూ, నడుస్తూ ఎక్కడికీ వెళ్ళిపోతుందో తెలీక కట్టుదిట్టమైన కాపలా కాస్తుంటారు, ఇంట్లో వాళ్ళు. ఎప్పుడైనా నిద్దర్లో లేచి నడుస్తోంది అన్న అనుమానం వస్తే, అంతా కలిసి థ్రెడ్ మిల్ ఎక్కించేస్తారు... ఇక ఆవిడ ఓపిక అయిపోయే దాకా నడిచీ, నడిచీ... అదన్నమాట !
ఒకసారి ఊర్మిళ కొడుకూ, కూతురూ సెలవలకు అత్తయ్య ఊరికి వెళ్ళారు. ఆమెను భద్రంగా చూసుకోమని, తండ్రి అవతారానికి అప్పజెప్పి ! అవతారం ఆ రోజు త్వరగా వస్తానని, హోటల్ లో భోజనం చేసి, సెకండ్ షో సినిమాకు వెళ్దాము, ముస్తాబై సిద్ధంగా ఉండమనీ భార్యకు చెప్పాడు. అయితే, అనుకోకుండా వచ్చిన ఒక మంత్రి గారి పని వలన అతని బాస్ , అతన్ని ఆ రాత్రికి ఆఫీస్ లోనే ఉండిపోయి, ఉదయాన్నే మంత్రిగారికి ఆ ఫైల్ ఇచ్చి, ఇంటికి వెళ్ళమన్నాడు. ఈ సంగతి ఆలస్యంగా ఫోన్ చేసి చెప్పినందుకు, ఊర్మిళ మండి పడింది. ఎన్నాళ్ళ తర్వాతో కట్టుకున్న తెల్లచీర, మల్లెపూల మేకప్ వృధా అయ్యిందన్న కోపంతో, జడవిప్పి, పూలు తీసి పారేసి, మంచం వద్దకు వెళ్లి, గట్టిగా వాసన చూసింది. అంతే... ఆమె నిద్రలోకి జారుకుంది. లేచి, రోడ్డు మీద నడవడం మొదలుపెట్టింది... నడుస్తూ ఏదో కలగంటూ, ఏదో మాట్లాడుతోంది. అప్పుడు సమయం రాత్రి 11 కావస్తోంది.
పిరికి పున్నయ్య అటుగా నడిచి వస్తున్నాడు. అసలే అతనిది పీల గుండె. కల్లో ఆలస్యంగా వచ్చిన మొగుడిని, ఎడాపెడా వాయించేందుకు గుమ్మంలో సిద్ధంగా ఉన్న ఊర్మిళ “వచ్చావా ! ఆగరా !” అని అరిచింది బిగ్గరగా ! పున్నయ్య హడిలిపోయాడు. తెల్లచీర, విరబోసుకున్న జుట్టు, గొంతులో కోపం... డౌట్ లేదు, ఏ దెయ్యమో అయ్యుంటుంది... అనుకుని, ఇప్పుడు దెయ్యాన్ని ప్రసన్నం చేసుకోవడమే తన తక్షణ కర్తవ్యం అని భావించాడు. ముందుగా... ‘ దెయ్యం గారు, దెయ్యం గారు...’ అంటూ ఊర్మిళ చుట్టూ తిరిగాడు. ఇప్పుడు దెయ్యాన్ని స్తుతించాలి. కాని, ఎలా దెయ్యం స్తోత్రాలు తనకు రావే ! చిన్నప్పుడు చదివిన ఆవు వ్యాసం గుర్తుకు వచ్చింది.
“దెయ్యము. దెయ్యములు చాలా మంచివి. క్రూర జీవులు. దెయ్యమునకు రెండు కాళ్ళు ఉండును. అవి వెనుకకు తిరిగి ఉండును. “ అంటూ ఆమె కాళ్ళ కేసి, చూడసాగాడు. ఆసరికే కల్లో కోపంగా ఉన్న ఊర్మిళ పున్నయ్యను లాగిపెట్టి, తన్నింది. యెగిరి అవతల పడ్డాడు. మళ్ళీ నడక కొనసాగించింది ...
ఎవరినో హత్యచేసి, పారిపోతున్న ఒక దొంగ, కత్తితో సహా అటు పరిగెత్తుకు వచ్చాడు. అప్పటికి ఊర్మిళ కల్లో భర్త కాలర్ పట్టుకు గుంజుతోంది. వెంటనే దొరికిన దొంగ కాలర్ పట్టుకుని, ‘చెప్పరా, నిజం చెప్పు, ఇంతసేపూ ఎక్కడున్నావ్ ?’ అంది.
‘హమ్మో, ఇదేదో కదలి వచ్చిన కాష్మోరా లా ఉంది. అయినా, ఇప్పుడే కదా చంపాను, ఇంత త్వరగా దెయ్యమై వెంట పడుతుందా?’ అని ఆలోచనలో పడ్డ దొంగ, పోలీసు ఈల వినబడడంతో, పట్టు విడిపించుకుని, ఆ కత్తిని ఆవిడ చేతిలో పెట్టి, పారిపోయాడు.
రాత్రి నాటకం ఆలస్యం అవడంతో, తీరిగ్గా వెళ్తున్న నాటకాల బాచ్ లోని ఇద్దరు, వెంట కుక్కలు తరమడంతో, అటుగా పరిగెత్తుకు వచ్చారు. అప్పటికి ఊర్మిళ కల్లో, సీన్ మారి ఖజానా వెతుకుతోంది. తనతో పాటు పోటీకి వచ్చిన వేరొకర్ని, నిలువరించి కత్తితో బెదిరిస్తోంది...
‘ఆగక్కడ !’ గట్టిగా అరిచింది ఊర్మిళ. వారిద్దరూ, తమలో తాము ఇలా మాట్లాడుకోసాగారు....
‘ఒరేయ్... వెనక కుక్కలు... ముందు కొరివి దెయ్యం, దానికి తోడు చేతిలో కత్తి ! కుక్కకైనా కనికరం ఉంటుందేమో కాని, కొరివి దెయ్యానికి కోపం వస్తే, కొరుక్కు తినేస్తుంది ! ఇది చెప్పినట్టు చేద్దాం,’ అనుకుని, భక్తిగా దణ్ణం పెడుతూ అక్కడే నిల్చున్నారు. కల్లో పోటీకి వచ్చిన వారి దగ్గరనుంచి, నిధిని లాక్కుంటోంది ఆమె...
‘ఇది నాది, నాకు ఇవ్వండి...’ దబాయించింది ఊర్మిళ ! ‘ ఒరేయ్... ఏదో ఇమ్మంటోంది రా ! బహుసా, మనం పెట్టుకున్న అట్ట నగల్నే కావచ్చు. బ్రతికుంటే బర్గర్ తినచ్చు. ఇచ్చేద్దాం, కుక్కల బాధ కూడా తప్పుతుంది. ‘ అనుకుని, కిరీటంతో సహా నగలన్నీ ఆమెకు ఇచ్చి పారిపోయారు.
ఆమెకు అది దొరకగానే, భోషాణం తెరిచి, ఆత్రంగా నగలు మెళ్ళో వేసుకుంటోంది... అలా కలలు కంటూ , నాటకాల వాళ్ళ నగలు అన్నీ ఆమె అలంకరించేసుకుంది.
మళ్ళీ లేచి నడవసాగింది. అది ఒక పెద్ద పదవిలో ఉన్న మంత్రిగారి ఇల్లు. గేటు వద్ద ఉన్నవాడు గుర్రు పెట్టి, నిద్దరోతున్నాడు. ద్వారం వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ స్కాన్ మెషీన్, భారతంలోని అన్ని ప్రధాన కేంద్రాలలో లాగే... “పని చెయ్యట్లేదు” !ఒక అడుగు ముందుకు వెళ్ళాకా ఉన్న నల్ల పిల్లుల భద్రతా దళం అతను... గన్ పట్టుకు, గర్ల్ ఫ్రెండ్ తో సెల్లు లో సొల్లు కొడుతున్నాడు. ఊర్మిళ అతని ప్రక్కనుంచి, మంత్రిగారి వీధి గుమ్మం దగ్గరికి వెళ్ళింది. అక్కడున్న సుందోపసుందులు... పూర్తి ఆభరణాలతో అర్ధరాత్రి వస్తున్న ఊర్మిళ ను చూసి...
‘ ఒరేయ్ అమ్మోరు తల్లిరా ! రాత్రి పూట ఇలా మఫ్టి లో వస్తూ ఉంటుంది, ఆ పెద్ద బొట్టు, మోహంలో కళ చూడు...ఆపావో, మింగేస్తుంది. ఎవడికైనా ప్రాణాలు తీపిరా ! తలుపు తీసి, లోపలికి పంపేద్దాం, తెల్లరట్టకి మాయం అయిపోతుంది,’ అనుకుని, ఆమెను లోపలికి వదిలేసారు. ఊర్మిళ తిన్నగా మంత్రిగారి పూజ గదిలోకి వెళ్లి, నిద్దరోయింది...
ఊర్మిళ తెల్లారి లేచి కళ్ళు నులుముకుని చూసేసరికి, ఆమె ఎదురుగా అనేకమంది మూగి, పొంగళ్ళు పెట్టి, హారతులు ఇస్తున్నారు. కొందరు పూలు, పసుపు, కుంకుమ చల్లి, పూజ చేస్తున్నారు. బెంబేలెత్తి పోయి ఆమె లేచి నిలబడింది. ఆమెకు ఏం జరుగుతోందో, ఎక్కడుందో అంతు బట్టట్లేదు. తనకు నిద్దర్లో నడిచే అలవాటు ఉందని ఎలా చెప్తుంది ? ఆమెకు ఏడుపు వస్తోంది...
ఇంతలో ఫైల్ పట్టుకుని, అక్కడకు వచ్చిన ఆమె భర్త అవతారం, ‘నువ్వెంటే, ఇక్కడున్నావ్ ?’ అన్నాడు. అంతే ! ఒక్క ఉదుటన ముందుకు దూకి, భర్తను వాటేసుకుంది ఊర్మిళ. ఆమెను ఓదార్చి, ఆమెకున్న అలవాటు గురించి, అందరికీ చెప్పాడు అవతారం. అంతా తేరుకున్నాకా, మంత్రిగారికి గొప్ప అనుమానం వచ్చింది...
“ఇంత మంది భద్రతా దళాల్ని దాటుకుని, ఈమె లోనికి ఎలా వచ్చింది ?”
“అదేగా మరి.. భారతంలో భద్రత !” అని అవతారం అనడంతో... అంతా నవ్వేసారు.