Sunday, November 9, 2014

చితిమంటల్లో చిచ్చుబుడ్డి

 నవ్వేజనా సుఖినోభవంతు -3 

చితిమంటల్లో చిచ్చుబుడ్డి 
(కాప్షన్ - ఒక క్షుద్ర ప్రేమ కధ )
------------------------------------------------------

(ఈ కధ హృదయ విదారకమైన క్షుద్ర కవితలు రాసే వారు అందరికీ భయంతో అంకితం ... భావరాజు పద్మిని )

ఎందుకోమరి... కొందరికి కొన్ని రకాల కవితలు నచ్చుతాయి కదా ! అలాగే రాంగోపాల్ వర్మ లాంటి ఒక అభ్యుదయ దెయ్యాల సినిమా దర్శకుడికి, ఒకతను ఫేస్ బుక్ లో రాసే క్షుద్ర కవితలు భలేగా నచ్చేసాయ్... అదేంటండి ? క్షుద్ర కవితలా ? ఎలా ఉంటాయ్ ? అంటారా... ఒక సాంపిల్ మీ కోసం...

నా గుండెని గునపాలతో తవ్వుతున్నారు 
చిద్రమైన నీ ప్రేమ శకలాల రక్తపుటేరు 
మాంస ఖండాల లోంచి ఉవ్వెత్తున ఎగసి,
లోపల రాసున్న నీ పేరును తడిపేస్తోంది 
నా ప్రాణం పోయినా నీ పేరు చెరగకూడదని 
బ్యాండ్ ఎయిడ్ వాష్ ప్రూఫ్ నీపేరుపై అంటించా.
నేను చచ్చాకైనా వచ్చి చదువుకో చెలీ...

మానవ మాత్రులకి ఇలాంటి క్షు . క (క్షుద్ర కవితలు) చదివితే చిర్రెత్తుకొస్తుంది. కాని 'పుర్రెకో బుద్ధి ' వెతికే ఆ దర్శకుడికి వెంటనే ఈ కవి చేత ఓ సినిమా కధ రాయించాలన్న బుద్ధి పుట్టింది. వెంటనే ఒక వెరైటీ క్షుద్ర ప్రేమ కధ పుట్టింది... కవిగారు దర్శకుడికి కధ చెప్తున్నారు...



అర్ధపగలు... శ్మశానం... కాటికాపరి శవాలు కాలుస్తూ వింటున్న రాక్ మ్యూజిక్ తో శవాలు కూడా భయపడిపోతున్నాయి. ఒక పిల్లి మెల్లిగా ఈల వేసింది( నక్క ఊళ పెట్టడం రొటీన్ ... పిల్లి ఈల వెయ్యడం వెరైటీ ). ఇక్కడ మీరు ఒక పాట పెట్టాలి. ఇదే మన హీరో ఎంట్రన్స్ సాంగ్.
చిచ్చుబుడ్డి కాల్చుకోడానికి స్మశానానికి వస్తాడు మన హీరో, పిల్లి ఈల విని పరవశించి పాట పాడతాడు.వెనుక కాటి కాపరి, శవాన్ని తగలబెట్టడానికి వచ్చిన వాళ్ళు స్టెప్ లు వేస్తారు.

నువ్వు ఈల వేస్తే వల్లకాడు యెగిరి పడతది...
నువ్వు ఈల వేస్తే పాడు గుండె ఉలికి పడతది 
నీ ఈలంటే ఏటి మజాకా... అది పాడిందంటే పాడె దాకా...  పాడే వీడి దాకా...
ధిమికి ధిమికి ధిమ్మాడి... గుబుకు గుబుకు గుమ్మాడి...

'ఓహో, ఏం క్రియేటివిటీ...' అంటూ వింటూ ఉంటాడు దర్శకుడు. ఇంతలో మన హీరొయిన్ టెన్నిస్ ఆడుతూ యెగిరి పడిన బంతిని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. పాట పాడుతున్న హీరో ను, అతని చంకలో ఉన్న పిల్లిని , చూస్తుంది. వెంటనే ప్రేమలో ముక్కు కింద దాకా మునిగిపోతుంది. హీరో హీరొయిన్ ని చూడగానే... చితిమంటల్లో తన చేతిలో ఉన్న చిచ్చుబుడ్డి వెలిగిస్తాడు. అలా మొదలౌతుంది... ప్రేమ టపాకాయ్ ...

కాని హీరో పాట పాడుతుండగా చూసిన ఒక గడుసు దెయ్యం హీరో మీద మనసు పారేసుకుంటుంది. పక్కనే ఉన్న మరొక ఆడ దెయ్యం కూడా అలాగే పారేసుకుంటుంది. వాళ్ళిద్దరూ కలిసి...' వాడు నావాడే... కాదు నావాడే...' అని ఫైటింగ్ చేసుకుంటారు. ఇక్కడ మనం ఎంచక్కా మర్రి ఊడ పట్టుకు లాగి తన్నడం, దెయ్యాలు జుట్టు పీక్కు కొట్టుకోవడం, అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షం అవ్వడం... లాంటి గ్రాఫిక్స్ వాడచ్చు. ఇక్కడ దెయ్యాల ఫైట్ కు వెరైటీ గా మాంచి ఐటెం సాంగ్ వాడదాం...

కెవ్వు కేక... నీ దుంపదెగ కెవ్వు కేక... 
మర్రి ఊడట్టుకుని కోపంతో ఊగిపోతూ నువ్వొచ్చి తన్నావంటే... కెవ్వు కేక 
తెల్లటి జుట్టట్టుకుని పీకేస్తూ గుంజేస్తూ నువు నన్ను కొట్టావంటే ... కెవ్వు కేక  

ఇలా పారడీ పాట బాగుంటుంది.

ఇక దెయ్యాలు, హీరొయిన్ మధ్య... హీరో మనసు నలిగిపోతుంది. అతనికి ముగ్గురూ నచ్చారు... అతని మనసు సహారా ఎడారంత  విశాలం. చిన్నప్పటి నుంచి, ఒక దెయ్యాన్ని పెళ్ళాడాలని అతని కల. అందుకే అతను ఒక ఉపాయం పన్నుతాడు. 'ప్రేమ దెయ్యలారా... ఉభయ తారకంగా ఒక ఉపాయం చెప్తా ! నేను బ్రతికి ఉన్నన్నాళ్ళు ఈ హీరొయిన్ ని పెళ్ళడతా ! చచ్చాకా మీ ఇద్దరినీ పెళ్ళాడి, శోభన్ బాబు లా 'ఆయనకీ ఇద్దరు' అంటూ... మీ ఇద్దరికీ తలలు  దువ్వి, జల్లేసుకు బ్రతికేస్తా... ఏం ?' అంటాడు. వెంటనే ముక్త కంఠంతో 'వాట్ అన్ ఐడియా హీరో జీ' అన్న దెయ్యాలు... 'ప్రియా, నీ కోసం, నీ ప్రేమ కోసం అరవై ఏళ్ళు ఏమి ఖర్మ... ఆరు వందల ఏళ్ళు అయినా వేచి ఉంటాం ... అప్పటి వరకూ పుట్టి చస్తూనే ఉంటాం ' అని వాజమ్మ ప్రమాణాలు చేసి, దగ్గరుండి ఇద్దరి పెళ్లి చేసి, ఆనందంగా హాహాకారాలు చేస్తాయి. 

ఇదన్నమాట కధ ! మీకు కధ నచ్చితే 'దెయ్యం' అని ఇంగ్లీష్ లో టైపు చేసి... 100 కి నచ్చకపోతే 'ఒంట్లో బాలేదు' అని టైపు చేసి 108 కి sms ఇవ్వండి...

No comments:

Post a Comment