Sunday, November 9, 2014

ది ఆప్ (ఏప్ ) ఎఫెక్ట్

ది ఆప్ (ఏప్ ) ఎఫెక్ట్ 
----------------------
ఒక పెద్దాయన కార్ నడుపుతూ ఉండగా, ఉన్నట్టుండి మొబైల్ చదువుతూ ఉన్న ఓ కుర్రాడు అడ్డం పడ్డాడు... అన్ని బ్రేకులు నొక్కి కాస్తలో కార్ ఆపాడు పెద్దాయన. ఇంకాస్తుంటే ఆ కుర్రాడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే ! అయితే ఆ కుర్రాడు మాత్రం ఓ సారి కార్ వంకా, పెద్దాయన వంకా చూసి, మళ్ళి మొబైల్ లో చూస్తూ పిచ్చి నవ్వులు నవ్వుకోసాగాడు...
పెద్దాయనకు ఒళ్ళు మండిపోయింది... కార్ దిగి,

"ఒరేయ్ మలపత్రాష్టుడా ! కళ్ళు మొబైల్(నెత్తిన) లో పెట్టుకు నడుస్తున్నావా ? ఇంట్లో చెప్పొచ్చావా ?" అని అడిగాడు కోపంగా !
"ఓహ్! హై అంకుల్... నా దగ్గర వాట్స్ ఆప్ ఉంది... నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా స్టేటస్ పెడతా ! వన్ మినిట్..." అంటూ మళ్ళీ ఆడుకోసాగాడు...

"తిధి వార నక్షత్రాలు చూసుకు రోడ్డు మీదకు దిగబడ్డావా తింగర సన్నాసి ! ఇవాళ నీ జాతకం కాదు, నా జాతకం బాగుంది..." అన్నాడు...
"ఆ ఆ , నా దగ్గర హిందూ క్యాలెండరు ఆప్ ఉంది అంకుల్... తెలుగు జాతకం ఆప్ కూడా ఉంది..." ఓ సారి నవ్వి, మళ్ళీ ఆడసాగాడు.

"అఘోరించావులే ! చేతిలో ఆ తిరుగుబోతు ను ఉంచుకుని, అసలు నువ్ ఎక్కడ తిరుగుతున్నవో నీకు తెలుసా ?"
"నా దగ్గర నావిగేటర్ ఆప్ ఉంది అంకుల్..."

"ఆహా ! ఏదో అక్షయపాత్ర ఉన్నట్టు చెప్తున్నావ్... చదువుకునే వయసులో ఇలా అడ్డవైన ఆటలు ఆడితే, బుర్ర పనిచెయ్యడం మానేస్తుందని నీకు తెలుసా ?"
"మేరె పాస్... IQ టెస్ట్ ప్రిపరేషన్ ఆప్ హై అంకుల్...."



"ఇలా మెషీన్ ల మాయతో యువత బ్రతుకుతుంటే ,దేశం ఏమైపోవాలి ? అసలు దేశంలో ఏం జరుగుతోందో నీకు తెలుసా ?"
"ఐ హావ్ తెలుగు న్యూస్ పేపర్ ఆప్ అంకుల్..."

ఇక పెద్దాయన సహనం చచ్చింది..."ఒరేయ్ ! అక్కుపక్షీ ! చావు తప్పి కన్ను లొట్ట పోయినా లొట్టిపిట్ట లా ఆ ఫోన్ లో ఆడితే నీకు ఏమొస్తుంది ? ఇంత జరిగినా చీమ కుట్టినట్టుగా అయినా లేదే నీకు... ఆ మొబైల్ లో ఏమి ఆడుతున్నావ్...చెప్తావా లేదా ! "
"యా... క్లాష్ ఆఫ్ క్లాన్స్ అని... ఇందులో ఆడుతూ ఉంటే ముందు ట్రోఫీ లు వస్తాయి. 700 ట్రోఫీలు దాటితే సిల్వర్ మెడల్ వస్తుంది... ఈ ఒక్క ఆట అయితే, నాకు సిల్వర్ మెడల్ వస్తుంది అంకుల్... అలా వస్తే నాకు కంచుకోట లాంటి ఒక గ్రామం ఇస్తారు... శత్రువులు నన్ను గెలవడం కష్టం అవుతుంది..."

"అలాగా ! గెలిస్తే ఆ మెడల్ నీకు వస్తుంది... అదే నువ్విలా అడ్డదిడ్డంగా రోడ్డు మీద నడిచి చస్తే... అదే మెడల్ నీ పాడె మీద వెయ్యాల్సి ఉంటుంది... ఒరేయ్... ఈ ఊహా లోకాలలోని ఊహా భవంతులు కట్టుకుంటూ బ్రతికితే... చచ్చూరుకుంటావ్..."
"........." ఏం మాట్లాడకుండా తీవ్రంగా ఆడేస్తున్నాడు కుర్రాడు..."

పెద్దాయన కోపం తారాస్థాయికి చేరుకుంది. వెంటనే అతని మొబైల్ లాక్కుని... 
"ఒరేయ్... అమ్మానాన్నల బదులు ఏ ఆప్ లేదు కదా ! కడుపు ఆకలి ఆప్ లతో నిండదు కదా ! ఇవన్నీ ఆలోచించకుండా... ఆడి, ఆడి... ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇకనైనా మేల్కోండి..."అన్నారు.
వెంటనే చిన్నపిల్లాడి చేతిలో ఐస్ క్రీం లాక్కున్నట్టు పెద్దగా ఏడుపు మొదలెట్టాడు కుర్రాడు... "ఇంకొక్క లెవెల్ ఆడితే సిల్వర్ మెడల్ వచ్చేది... ఆ గున్ని గాడు, బన్ని గాడు... గోల్డ్ మెడల్ దాకా వెళ్లిపోయారని గొప్పలు కొడతారు... నేనూ సిల్వర్ వచ్చిందని చెప్దామంటే... మీరు అడ్డుపడ్డారు. ఈ పాపం ఊరికే పోదు ! మీ ముందు తరాలన్నీ మొబైల్ లేకుండా పోతాయ్ ! మీ వంశం ఆండ్రాయిడ్ లేని ఫోన్ లా వెలవెల బోతుంది... ఇదే నా శాపం !"

" ఓరి నీ పిండం పిల్లులకి పెట్ట ! బోడెమ్మ లా శాపాలు పెడతావ్ రా ! నేను గట్టిగా బ్రేక్ వెయ్యకుండా ఉంటే ఈ పాటికి నీ ఫోటో టీవీ లో వచ్చేది. నీలాంటి వాళ్ళు ఆప్ లు వచ్చాకా తిరోగమనం చెంది ఏప్(కోతి) ల లాగా తయారౌతున్నారు... మీరు చచ్చి బానే ఉంటారు. గుద్దిన మాలాంటి వాళ్ళు వి.ఐ.పి  తో కలిసి జైలు జీవితం వెలగబెట్టాలి. ఇదిగో... నీ మొబైల్ ఆ మురుక్కాలవలో వేస్తున్నా ! మళ్ళి మొబైల్ కొనుక్కునే దాకా... సుఖీభవ !  ఇంతకీ నేనెవరో నీకు తెలీదుగా... చూసేందుకు ట్రూ కాలర్  ఆప్ కూడా లేదాయె ! ఈ ఏరియా ఎస్.ఐ ని... ఇక నీకు దిక్కున్న చోట చెప్పుకో... బై..." అంటూ కీలెరిగి వాత పెట్టి వెళ్ళిపోయాడు పెద్దాయన. 

No comments:

Post a Comment