Saturday, July 9, 2016

పాషాణ ప్రాజెక్ట్

పాషాణ ప్రాజెక్ట్ 
భావరాజు పద్మిని 

5/7/16.
"నెట్ నుంచి ప్రింట్ అవుట్ కావాలి," ఇంటికి ఎదురుగా ఉన్న నెట్ సెంటర్ కు వెళ్లి అడిగాను. "ఆప్ క్యూ మే హై" అన్నాడతను తాపీగా. నాముందో ఐదారుగురు హైదరాబాద్ లో మాంచి ఎండాకాలంలో మంచినీళ్ళ టాంకర్ రాగానే "నేనంటే నేను ముందని" బిందెలు పట్టుకు పోరాడుకునే మల్లయోధుల్లా నిల్చున్నారు. సోమవారం నుంచే ఇక్కడ పిల్లలందరికీ వేసవి సెలవలు ముగిసి, స్కూల్ తెరవనుండడంతో, అంతా "వాటికోసమే" కాబోలు వచ్చారు. అవేంటంటే...
ఒక నీలిరంగు తలపాగా ఒక ఐదేళ్ళ చిన్న పాప ఫోటోలు తెచ్చారు. ఆ పాప ఒంటికన్ను తెరిచి, ఒంటికాలు మీద నిల్చుని, కొంగజపం చేస్తూ, పొట్టంతా లోపలికి లాగేసుకుని, నిల్చుంది. ఇలా ఐదారు భంగిమలు రాక్షసుడి నోట్లోంచి వచ్చే సెగల్లా ప్రింటర్ నోట్లోంచి బైటికొస్తున్నాయి. కడుపునొప్పి ఆగక... "ఇవేంటి, ఎందుకు?" అని అడిగాను.
"ఏం చెప్పమంటారండి, సమ్మర్ ప్రాజెక్ట్, యోగ భంగిమల్లో ఫోటోలు తీసుకుని, పట్రమ్మన్నారు. "a square + b square + 2ab" ఫార్ములా లాగా పిల్లలకి యోగా అంటే రాందేవ్ బాబా అని ముద్ర పడిపోయింది కదా !టీవీ పెట్టి చూసింది, ఆయనిలాగే పొట్ట గింగిరాలు తిప్పుతూ, కనుబొమలు ఎగరేస్తూ, ఒంటి కన్ను టపటప లాడిస్తూ నిల్చున్నారు. ఆయన ఎలా ఉంటే మా పాప అలాగే ఫోటోలు దిగింది," ఇదీ విషయం. అన్నారు.
ఈ లోపున నా ముందున్న వాళ్ళ క్యూలో కొంతమంది 'ఫోను పిలుపుకు' వెళ్ళిపోయారు. నెట్ సెంటర్ వాడు "ఈమెయిలు బతావో" అన్నాడు. "సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి" లాంటి నా ఈమెయిలు, పాస్ వర్డ్ నువ్వొక్కసారి టైపు చేస్తే, నీకు కీ- బోర్డ్ మీద విరక్తి కలుగుతుందిరా కుంకా" అని మనసులో అనుకుని, "భయ్యా, మై టైపు కర్డూ..." అని అడిగాను. నాలోపల అంతరాత్మ/అంతరాత్ముడు(ఆత్మకి జెండర్ లు ఉండవని నా డౌటనుమానం) ఇంత భీబత్సంగా ఆలోచనలు చేస్తుందని పాపం ఆ ప్రాణికి తెలిస్తే ఏమైపోతాడో !
"ఏంటివి రాళ్ళూ రప్పలూనూ...? మీరు భూగర్భశాస్త్రజ్ఞులా?" సందేహంగా అడిగింది అ.పా(అమాయకప్ప్రాణి).
"లేదు..."
"మరి, పురాతత్వ శాఖలో పని చేస్తున్నారా? ఇవి శిలాజాలా?"
"కాదు..."
"మరేంటివి?" ఈ సారి నీలిరంగు తలపాగా అడిగింది. ఇందాక నా కడుపునొప్పి తీర్చిన ఋణం తీర్చుకోవద్దూ... చెప్పేస్తా, ఇక. వంటల కార్యక్రమంలో వ్యాఖ్యానించే పాకశాస్త్ర ప్రవీణ లా గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తా...
                          
"ముందుగా ఓ డజను సుద్దముక్కలు ముక్కలు చెక్కలు చేసి, నీళ్ళల్లో వేసి, ఫ్రీజర్ లో పెట్టి, గడ్డకట్టించాలి, తర్వాత బైటికి తీసేయ్యాలి. ఇలా 3-4 సార్లు చెయ్యాలి. అలాగే ఓ మాంచి గుండ్రాయిని తీసుకుని, నీళ్ళలో వేసి, ఫ్రీజర్ లో పెట్టి తీస్తూ, మధ్య మధ్య దాన్ని రెప్పవాల్చుకుండా చూడాలి. ఆ తర్వాత ఇదే పద్ధతిని ఓ కాళ్ళు రుద్దుకునే రాయితో చెయ్యాలి. ఆ తర్వాత రాళ్ళలో మార్పులు గమనించాలి. అంతే ఘుమఘుమలాడే దిక్కుమాలిన ప్రాజెక్ట్ రెడీ! " అన్నాను.
"అమ్మా, మీది ఆగ్రా నా ?" కాస్త వణుకుతున్నట్టు అడిగింది తలపాగా.
"కాదు భయ్యా, మీ అనుమానంలో న్యాయమున్నా, ఇటువంటి పరిస్థితుల్లోనే గుండె దిటవు చేసుకోవాలి. చెప్తా వినండి. ఇది మా పిల్ల సమ్మర్ ప్రాజెక్ట్. 20 రోజుల నుంచి ఫ్రీజర్ అంతా రాళ్ళే. ఇంకేం పెట్టే చోటు కూడా లేదు. మొన్నో పిల్లాడికి అందులోంచి చాక్లెట్ తీసి ఇద్దామంటే, వాడీ రాళ్ళు చూసి, గుడ్లు తెలేసాడు. ఇది 'ఫిజీషియన్స్ సాంపిల్' మాత్రమే. అసలువి ఇంకా చాలా చేసాము. సమ్మర్ లో తల్లిదండ్రులు పనీపాటా లేకుండా వాట్స్ ఆప్, పేస్ బుక్ చూసుకుంటారని అనుమానం వచ్చిన స్కూల్ యాజమాన్యం, తమ క్రియేటివిటీ అంతా కాగితాల్లో కలిపేసి, విషయానికి విషయానికి సంబంధం లేని ఓ వంద వర్క్ షీట్లు, కొన్ని ప్రాజెక్ట్ లు ఇస్తారన్నమాట. చర్మచక్షువులతో చూస్తే, ఇవేవీ పిల్లలు చెయ్యగలిగినవి కాదు. అంటే మనకే ఇచ్చినట్టుగా మరి. అలా చేసి, చేసి, నీరసించి, నిండా మునిగి, ఇప్పుడే ఇలా తేలాను," అనగానే అక్కడ " హాయ్ మేమూ అంతే, సేం పించ్" అంటూ ఒక్కసారిగా నవ్వులు వెల్లివిరిశాయి. తప్పని బాధ ఉన్నప్పుడు దాన్ని హాస్యంగా తర్జుమా చేసుకుంటే, మనసుకి తేలిగ్గా అనిపించి, కష్టం తేలిపోతుంది.
ఇక అక్కడి నుంచి స్టేషనరీ షాప్ కు వెళ్తే, అక్కడి పరిస్థితి ఎలా ఉందంటే- 
"ఎయిర్ పోర్ట్ లో ఉన్న ఒకేఒక ఛార్జింగ్ డివైస్" వద్ద, ట్యాబులు, ఫోన్లు, ఐపాడ్ లు, లాప్టాప్లు పట్టుకుని, ప్లగ్ కోసం పడిగాపులు పడుతూ, విధిని నిందించుకుంటూ, తమకి అవకాశం దొరకలేదని లోలోపల కుమిలిపోతూ, ఛార్జ్ పెట్టుకున్న వాళ్ళకి పంచమహాపాతకాలు చుట్టుకోవాలని నిందించుకుంటూ, ముళ్ళమీద కూర్చున్నట్టు కూర్చునే ప్రయాణికుల స్థితి లాగే ఉంది. వీళ్ళకి స్కూళ్ళ బాధే ! తొక్కుకుంటూ, తోసుకుంటూ బయటపడి, ఇంటికి చేరేసరికి ఓ రెండు గంటలు రోడ్డు రోలర్ చక్రాల కింద దొర్లిపోయాయి. అప్పుడే పాలు కొనేందుకు వెళ్ళిన నాకు, ఏడాది ఆలస్యంగా వచ్చిన టెలిగ్రాం లాగా ఓ ప్రకటన కనిపించింది. " కాసిన్ని డబ్బులు మా మొహాన పడేస్తే, అర్ధంపర్ధం లేని సమ్మర్ ప్రాజెక్ట్ లు అలవోకగా మీ పిల్లలతో చేయించి ఇస్తాం. వివరాలకు సంప్రదించండి.... ". ఓహో, ఇదొక కొత్త వ్యాపారం అన్నమాట. సమస్య ఉన్నచోట 'ఎదిగే అవకాశం కూడా ఉంటుంది' అంటే ఇదే కాబోలు!

అమ్మా, స్మృతి ఇరానీ. గతేడాదో, అంతకు ముందో, మీరు ఈ ప్రాజెక్ట్ లను నిషేధిస్తారన్నవార్త విని, మా మనసులు, హైదరాబాద్ లో వర్షాల్లో మూసీ నదిలా ఉప్పొంగాయి. వాటిమీద ఇటుల మన్ను జల్ల న్యాయమా? అదేదో త్వరగా విధించేస్తే... మా పేరెంట్స్ అంతా కలిసి... " సామూహిక ప్రాజెక్ట్ నిషేధోత్సవం" జరుపుకుంటాము. ఏమంటారు?

No comments:

Post a Comment