Saturday, July 9, 2016

సకుటుంబ సా"మేత"ము

సకుటుంబ సా"మేత"ము
-------------------------------
భావరాజు పద్మిని
28/4/16


(కంగారడకండి, సమ్మర్లో కూల్ గా ఉండేందుకు ఇదో కొత్త కవితా ప్రక్రియ. 
ఇప్పుడే జస్ట్ కనిపెట్టాను. సామెతలతో పంచ్ లు కలిపి కొట్టి, అందరినీ కలిపి 'మేసేందుకు' ఈ ప్రక్రియకనిపెట్టినందుకు, నాపేరు ఏదో ఒక పుస్తకంలో ఎక్కించెయ్యడం ఖాయమని, నేనే తీర్మానించేసుకున్నాను, మీరూ ప్రయత్నించండి మరి...)


ఆకాశం మూలిగే నక్కలా ఉంది 
దాన్నెత్తిన తాటిపండులా పడింది...
తోకచుక్క !!!

కూసేగాడిదొచ్చి మేసేగాడిదను 
చెడగొట్టిందట మెయ్యకుండా ...
స్కాంలలో ఇరికించి!!!

నిజం నిలకడ మీద తేలుతుంది
నెత్తిన కూలకుండా నిలబడితే...
ఓవర్ బ్రిడ్జి!!!

ఎలుక తోలు తెచ్చి రిన్ సబ్బుతో
ఏడాది ఉతకడం ఎందుకు...
మరక మంచిదేనోయ్!!!

కాలుపట్టుకు లాగితే...
చూరుపట్టుకు వేలాడిందిట...
లంటార్న్!!!




ఉపన్యాసం కంటే ఉపోద్"ఘాతం" ఎక్కువ
డబ్బులు వెదజల్లే రచయత రాసిన
పుస్తకావిష్కరణలో!!!

ఊరికే ఉంటే ఊరా పేరా ?
మీడియాకి ఫోన్ కొట్టి చెయ్యవోయ్...
హడావిడి !!!

పెళ్ళికి వెళుతూ పిల్లిని తెచ్చినట్టు,
బుట్టలో పాముని తెచ్చాడని భయమేల? 
ప్రతి ఫ్రెండు అవసరమేనోయ్ !!!

చెవిటి పెద్దమ్మా చాంతాడు తెమ్మంటే,
చెవులపోగులు నాజన్మాన ఎరగనందిట...
సెల్ ఫోన్ భామ!!!

యోగికీ భోగికీ,రోగికి నిద్ర లేదు,
చివరికి నర్స్ కి, డాక్టరుకు కూడా...
కార్పో'రేట్' ఆసుపత్రిలో!!!

గమనిక : మీరు పద్మ శ్రీ, పద్మ విభూషణ్ ఇప్పిద్దామని అనుకుంటే మాత్రం... నాపేరులో 'పద్మ' ఉంది కనుక, కాస్త మినహాయింపుతో... ఉదారంగా ఆ శ్రీ, భూషణ్ ఇప్పిస్తే చాలునని మనవి.

No comments:

Post a Comment