Saturday, July 9, 2016

మూడు కోరికలు

మూడు కోరికలు
---------------------
భావరాజు పద్మిని - 6/5/16

"సింహం సింగల్ గానే వస్తుంది" అని మౌనంగా వికటాట్టహాసం చేసుకుంటూ వారం క్రితం అనుకోని అతిధిలాగా జలుబొచ్చింది. 'నిను వీడని నీడను నేనే' అని పాడుకుంటూ దాని వెనుకే అమర ప్రేమికురాలిలాగా ఓ ఐదు రోజుల క్రితం జ్వరం వచ్చింది. 'మీరిద్దరూ సిమ్మాలు కాదహే, మనం గుంపుగానే వస్తుంటాం కనుక... మనం అచ్చ సూకరాలం...' అనుకుంటూ, వీటి వెనుకే మూడు రోజుల క్రితం దగ్గొచ్చింది. ఇవి మూడూ నామీద వంతుల వారీగా ప్రతాపం చూపిస్తూ ఉండగా నేను "సీతమ్మ ఎవరి మాటా వినదు" లాగా భీష్మించుకుని, రేడియోలో లైవ్ చేద్దాము అని విక్రమూర్ఖించుకున్నాను. కానీ, నేను ఇలా "నాదాత్మకుడవై" అన్నదగ్గర దగ్గుతూ పాడలేని శంకరాభరణం శంకరశాస్త్రి గారిలా స్ట్రక్ ఐపోయి కొట్టుమిట్టాడుతూ ఉంటే, ఎప్పుడూ మౌనముద్రలో(పాపం వీళ్ళ skype ఎప్పుడూ మ్యూట్ లో ఉంటుంది. వింటారు, టైపుతారు, కాని మాట్లాడలేరు) ఉండే మా జాలిగుండె గల సౌండ్ ఇంజనీర్లు ఇద్దరూ, అర్జెంటుగా సెట్టింగ్స్ మార్చేసుకుని... "ఆఆఆ... నాదాత్మకుడవై..." అని పాడేస్తారేమో, అని డౌటనుమానసందేహమీమాంశతో, పురజనుల క్షేమంకోరి ఆ ప్రయత్నం విరమించుకున్నాను.
"జరిగితే అంత సుఖం లేదు," అన్నారు. అలాక్కాకోపోతే, ఓపక్క మనుగడ కోసం రోగాలతో పోరాటం, మరోపక్క పడుతూలేస్తూ పనుల కోసం ఆరాటం.... వీటి మధ్య నీరసంతో కూడిన అశక్తత వల్ల వచ్చే దిగులుచేత , అలా సీలింగ్ ఫ్యాన్ ను చూస్తూ, దీర్ఘాలోచనలో ఉండగా, కష్టాలోచ్చినప్పుడే ఖాళీగా గుర్తొచ్చే ఆ దేవుడిని ఎడాపెడా ఓ మూడు కోరికలు కోరేయ్యాలి అనిపించింది. మీకు తెల్సుకదా, నాకు పెద్దగా దురాశ లేదు. కాని హీనపక్షం మనిషికి - రోటీ, కపడా, మకాన్ కావాలి కదా ! అందుకే, ధైర్నం తెచ్చుకుని, నా వినతిపత్రం దేవుడి ముందున్న అఖండ పర్వతం వంటి వినతిపత్రాల పోగులో పెట్టేసాను. ఎంసెట్ పరీక్షలో రాసినట్టు, దేవుడికి సులువుగా ఉండేందుకు ముల్తిపుల్ ఛాయస్ లో ఓ నాలుగు ఆప్షన్స్ కూడా ఇచ్చాను. ఇంతకీ ఆ మూడు కోరికలూ ఏమిటంటే...
                    
1.అక్షయపాత్ర, హంసతూలికాతల్పం, వస్త్రాభరణాలు అమర్చిన ఒక పుష్పకవిమానం (మావారికి తరచుగా బదిలీలు అవుతుంటాయి కనుక ఇదొక మొబైల్ ఇల్లులాంటిది అన్నమాట).
2. ఇన్నీ ఒకేసారి గ్రాంట్ చెయ్యడం కష్టమని తెలుసు కనుక - కోరినవి తక్షణమే పొందే అష్టసిద్దుల్లోని "ఇచ్చాసిద్ధి"
3. అల్లాద్దీన్ అద్భుత దీపం తో కూడిన ఆ జీనీ భూతాన్ని అనుగ్రహిస్తే, కనీసం దానితోనైనా సరిపెట్టుకుంటా.
4. ఆల్ ది అబోవ్.
ఊర్కోండి... ఈ నా న్యాయమైన కనీసావసరాల కోరికలు విని, మీరు హీనపక్షం ఒక్క ఆప్షను అయినా నాకిమ్మని, ఉద్వేగంతో, కన్నీరుమున్నీరవుతారని, నా డిమాండ్లు తీర్చమని నా కోసం ముక్కోటి దేవతలకు మొక్కుకుని, ప్రార్దిస్తారని నాకు తెలుసు. అంచేత... ఇప్పుడే ధర్నాలు, దానాలు, ప్రార్ధనలు మొదలుపెట్టండి.
ముఖ్య వార్నింగ్గమనిక: నా కోరికలకు ముచ్చటపడిపోయి, మీలో ఎవరైనా నాకు బంగారు గండపెండేరం తొడగాలని ముచ్చటపడితే, ముందుగా అది పెట్టుకునేందుకు ఓ లాకర్ కూడా తీసుకోమని మనవి. అలాక్కాకుండా గజారోహణం చేయించాలి అనుకుంటే, నడుముకు వడ్డానం లేని, గజాన్ని నేను అధిరోహించను. కాబట్టి, మణిమయఖచితమైన(hall mark ధృవీకరణ పత్రం ఉండాలి) వడ్డానంతో సహా గజారోహణం చేయించి, దాని పోషణ ఖర్చుల తాలూకు బ్యాంకు ఎఫ్.డి, నడుముకు వడ్డానంతో సహా నాకు దానమిమ్మని మనవి.

No comments:

Post a Comment