Saturday, July 9, 2016

వెన్నెల కరిచిన రాత్తిరి

వెన్నెల కరిచిన రాత్తిరి 
------------------------
భావరాజు పద్మిని - 15/5/16

(ఇదేం పైత్యం, వెన్నెల కురుస్తుంది కాని, కుక్కలా కరుస్తుందా అని మీవంటివారు అడగడం న్యాయమే. కాని, అంతర్జాలంలో అన్వేషణలో ఈ ఉపమానం టైటిల్ తో కూడిన కవిత చదవగానే, నాకూ సరదాగా ఓ తవిక రాయాలనిపించింది. అంచేత... అర్జ్ కియా హై... అవధరించండి.)
కొబ్బరాకులు కొరగ్గా మిగిలిన చంద్రుడు
దూరదర్శన్లో అంతరాయం వచ్చినప్పుడు
కనిపించే గజిబిజి గీతల లాగా ఉన్నాడు.

తిన్న వెన్నెలంతా ఆకులు మానులో పోగేసి,
కొబ్బరి మొవ్వు, కొబ్బరి నీళ్ళు, కొబ్బరికాయలాగా
మార్చేసుకున్నాయ్ మౌనంగా తెలివైన ఆకులు.

"ఓహోయ్, వెన్నెల ఎవరి సొత్తూ కాదోయ్" అంది...
నిటారుగా నిల్చుని ఉడుగ్గా చూస్తున్న తాడిచెట్టు.
"ఆహా, ఇకనేం, నువ్వూ కాస్త కొరుక్కుని తాగు"
'తాడి చెట్టంత ఉన్నావ్ గా" సవాలు విసిరిందది.

"ఓసోస్, నేను కాస్త కిక్కు కలిపి దాస్తా చూడు" 
అంది ధీమాగా తాడి చెట్టు, పెడసరంగా తలూపుతూ!
వెంటనే తాడిచెట్టు ఆకులూ వెన్నెలని కరవసాగాయి.
కరిచిన వెన్నెలని మానుకు సరఫరా చేసాయి.


ఇక్కడే కదా మరి అసలు గమ్మత్తు!
తాటి ముంజెలు వెన్నెల తునకల్లా కాసాయి.
కాని, తాటి మానుకు గాట్లెట్టి, కుండలు కట్టారు.
కుండలో వెన్నెల పాలు, తాటికల్లుగా నిండాయి,

కల్లు తాగిన కోతులన్నీ కిష్కిందకాండ చేసాయి,
ఫుల్లుగా కొట్టినవి కిక్కురుమనకుండా పడున్నాయి,
'చూసావా నా పెతాపం కిక్కు' అంది తాడిచెట్టు 
ఆ రాత్తిరి నుంచి ప్రతీరాత్తిరీ...
వెన్నెల కొన్ని బ్రతుకుల్ని కరుస్తూనే ఉంది.
అదన్నమాట !!!

(హవ్వా... హవ్వా... ఇదీ ఒక తవికేనా... తవికలకి వహ్వా బదులు హవ్వా అనాలని, గతంలో మనవి చేసుకున్నాను అజ్జక్షా !)

No comments:

Post a Comment