Tuesday, May 10, 2016

ఓ గజిని ఈక్కధ

ఓ గజిని ఈక్కధ
-----------------------
భావరాజు పద్మిని - 10/5/16

"అమ్మా, కధచెప్పు..."
"మీ అక్కకో 14 ఏళ్ళు, నీకో పదేళ్ళ నుంచి కధలు చెప్పీ, చెప్పీ, స్టాక్ మొత్తం ఐపోయిందే. పాత కధే చెప్పమంటే చెప్తాను."
"సరే, ఆ గజిని ఈక్కధ చెప్పు, అదే పేరు మర్చిపోయి, ఊరంతా "నాపేరేంటి?" అని అడుగుతుందే, ఆ కధ, కానీ కొత్తగా చెప్పు."
"ఓ, మళ్ళీ ఇదో ట్విస్టా, సర్లే, అంతర్జాలమార్జాల భావరాణిని. కాబట్టి, కధనుతారుమారు చేసి, చెప్పేస్తా కాస్కో!"
"అర్ధం కాని భాషలో తిట్టకమ్మా, ఎలాగోలా చెప్పు చాలు."
"అనగనగా ఓ ఊళ్ళో ఒక ఈగుంది. అది ఇల్లు చిమ్ముకుంటూ, పాట పాడుకుంటోంది."
"ఏం పాట?"
"ఏదో పాట పాడుకునే ఖర్మ దానికేంటే, ఎంచక్కా, రాజమౌళి సినిమాలో 'ఈగ ఈగ ఈగ రాజమౌళి ఈగ, యముడి మెరుపుతీగ... ఖుషిఖుషిఖుషీగా... అని పాడుకుంటోందా, అప్పుడూ..."
"ఊ... అప్పుడు..."
"అప్పుడు అది దాని పేరు మర్చిపోయింది. వెంటనే మొబైల్ లో సేల్ఫీ తీస్కుని, గూగుల్ లో అప్లోడ్ చేసి, ఇమేజ్ సెర్చ్ కొట్టింది."
"అదేంటి, పేదరాసి పెద్దమ్మ, పెద్దమ్మకొడుకా, కొడుకు చేతిలో గొడ్డలా, గొడ్డలి కొట్టే చెట్టా, చెట్టు మీద పక్షుల్లారా, పక్షులు తాగే నీళ్ళల్లారా, నీళ్ళల్లోని చేపల్లారా, నీళ్ళు తాగే రాజుగారు, రాజుగారి గుర్రం, గుర్రం కడుపులో పిల్లా..." అని చెప్తావుగా !
"ఆహా, ఈ మెమరీ గేమ్ రొటీన్ ఐపోయి, నీకు మైండ్ లో ఫిక్స్ ఐపోయిందే. కధమొత్తం తెలిసీ అడిగే నీలాంటి వాళ్ళకోసమే ట్రెండ్ మార్చా. మాట్లాడకుండా విను, ఫ్లో కట్ అవుతుంది."
"అలా ఆయొక్క ఘజిని ఈగ, షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉండడం చేత, తన పేరు మర్చిపోయి, మొబైల్ లో సెల్ఫీ తీసుకుని, దాన్ని గూగుల్ లో అప్లోడ్ చేసి, ఇమేజ్ సెర్చ్ కొట్టింది. వెంటనే, ఈగ, కందెరీగా, తేనెటీగ వంటి సినిమా పోస్టర్లతో పాటు, ఓరెండు మూడు మలయాళం సినిమా పోస్టర్లు, ఇంకా తెల్లీగా, ఎర్రీగా, నల్లీగా, పంచెవన్నెల ఈగ, ఇలాంటి ఓ వెయ్యి ఫోటోలు వచ్చాయి. దాని పేర్లు చదివి, చుద్దామంటే, పాపం ఈగ చిన్నప్పుడు చదూకోలేదు కదా. దిగులుతో కూడిన బెంగ వల్ల వచ్చిన నిరాశతో క్రుంగిపోతూ ఉండగా, దాని బుర్రలో "వాట్ ఆన్ ఐడియా ఈగాజీ!" అనేట్టు ఓ అవిడియా మెరిసింది. పోనీ, తనలాంటి మరో పోలికలున్న ఈగ ఎక్కడుందో నావిగేషన్ ద్వారా కనుక్కుని, కారులో షికారుగా దాని దగ్గరకు వెళ్తే పేరు చెప్తుందిగా ! వెంటనే "నావిగేషన్" ఆన్ చేసుకుని, కారులో బయలుదేరింది. దారిలో పెట్రోల్ బంకు, హోటల్, నదులు, కొండలు, గుట్టలు, అన్నీ చూసేసింది. అలా వెళ్ళగా, వెళ్ళగా సప్తసముద్రాల అవతల మర్రిచెట్టు తొర్రలో మరో ఈగ ఉందని నావిగేషన్ చూపింది. వెంటనే సముద్రం ఒడ్డున కార్ పార్క్ చేసి, రెక్కలున్నాయి కనుక, ఎగురుకుంటూ వెళ్తుంది అనుకునేవు.



ఈ ఈక్కి మెమరీ లాస్ తో పాటు కొండంత బద్ధకం కూడా ఉంది. అందుకే అప్పుడే బయల్దేరిన ఓ ఓడెక్కి కూర్చుంది. హాయిగా, ఓడలో స్టార్ ఫుడ్డు తింటూ, వెళ్లి, జి.పి.ఎస్ చూపించిన ద్వీపానికి చేరుకుంది. వెంటనే హుటాహుటిన మర్రిచెట్టు దగ్గరకి వెళ్లి, ఆ ఈగను ఈగభాషలో పిల్చి, పేరు అడిగింది.
"ఓసి నా జఫ్ఫా ఈగ, ఈ పాటి దానికి ఇంత దూరం వచ్చావా, నువ్వు ముందు పాడుకున్న పాటే పాడుకుంటే సరిపోయేది కదా ! లేకపోతే, 'నా చుట్టూ వైఫై ఉన్నట్టు, ఈగో ఉంటుంది' అన్న సినిమా డైలాగ్ బట్టీ కొడితే పోయేదిగా. అదీ కాప్పోతే, మెళ్ళో మూర్చరోగుల్లా, పేర్లు కార్డు మీద రాసుకు తిరుగుతారే మనుషులు, వాళ్ళలా నువ్వూ, మెళ్ళో అట్టేసుకో. అంతేకాని, 'రెక్కాడితే కాని, డొక్కాడని వాళ్ళం' రెక్కల కష్టమంతా ఇలా వృధా చేసుకుంటే ఎలాగమ్మా, " అని నీతి చెప్పింది.
"బాగుంది... అయిపోయిందా?"
"లేదు, ఇప్పుడు నువ్వు ఇందాక ఈగ కధలో చెప్పిన సీక్వెన్స్ లాగా, ఘజిని ఈగ ప్రయాణం గురించి, ఈ పోస్ట్ చదివేవాళ్ళు రాస్తారు, మనం చదూదాం. లేకపోతే... వారికి 'ఘజిని ఈగ మేధాపహరణ దోషం' పట్టుకుంటుంది ట. ఏం?"
"$$$$$$******~~~~~~~" (గాఢనిద్ర సంజ్ఞ అని గమనించగలరు.)



గమనిక : దగ్గరలో ఈగలే లేనట్టు సప్తసముద్రాల అవతల ఈగుంది అని చూపించాలా, జి.పి.ఎస్ అని మీలాంటి మేధావులు అడగడం సహజమే ! కాని, జి.పి.ఎస్ హైదరాబాద్ పెట్రోల్ బంకుల వాళ్ళతో కుమ్మక్కైనట్టు నాకెప్పుడో అనుమానతీర్మానం వచ్చేసింది. ఎందుకంటే... అదెప్పుడూ, ' నీ ముక్కెక్కడ' అంటే తల వెనుక నుంచి చెయ్యి తిప్పి చూపినట్లు చూపిస్తుంది. అంతేకాక, గూగుల్ సెర్చ్ లో ఘజిని ఈగ ఎంచుకున్న ఈగ తాలూకు ఫేస్బుక్ ప్రొఫైల్ ఇమేజ్, సదరు ఈగ 'lives in ' లొకేషన్ కూడా అదే.

No comments:

Post a Comment