Saturday, July 9, 2016

బుర్ర భోజనం

బుర్ర భోజనం 
-----------------

భావరాజు పద్మిని - 5/11/14
కొంతమందికి ఫుల్ స్టాప్ లు, కామా లు లేకుండా ఆపకుండా మాట్లాడే అలవాటు ఉంటుంది. అది చాట్ తో నైనా... ఫోన్ లో నైనా...నోటితో నైనా...
అలా ఏకధాటిగా మాట్లాడగల అదృష్ట జీవుల్లో మా పనమ్మాయి 'ప్రీతి 'ఒకటైతే... అది విని గిలగిల లాడే దౌర్భాగ్య జీవుల్లో నేను ఒకదాన్ని.
ఉదయం లేవగానే నా ఆలోచనలు ఇలా ఉంటాయి... త్వరగా పిల్లలకు టిఫిన్ పెట్టాలి, పాలు కలపాలి, జళ్లు వెయ్యాలి... టైం కి అన్నీ అందాలి... వాళ్ళు వెళ్ళాకా టిఫిన్లు, స్నానం, పూజ, వంట, నైవేద్యం... ఇవాళ ఎలాగైనా సరే... త్వరగా పని ముగించుకుని, ఇంటర్నెట్ లో పని చూసుకోవాలి...
ఈ లోపల ప్రీతి వచ్చేస్తుంది. నేను చూడకుండా నెమ్మదిగా పిల్లిలా వచ్చి, వెనుక నిల్చుని, నన్ను భయపెట్టాలని, తన ప్రయత్నం... అయినా చూసేస్తాను నేను... తను విఫలమౌతుంది. 'దీదీ... మీరు వెనుక కూడా ఎలా చూస్తారు ?' అంటుంది... అదంతేలే... అంటాను.
ఇక నా బుర్ర మీద మాటల దాడి మొదలు... "దీదీ... మేరి భాభి కా భాంజి హైనా... " అంటుంటే... ఈ ఇన్ఫర్మేషన్ నీకు అవసరమా... అని మందలించి, బుర్ర వెంటనే అప్రమత్తమై నా చెవులు సగం మూసేస్తుంది. యాంత్రికంగా 'ఉ' కొడతాను. ఏ వెట్ గ్రైండర్ లోనో పిండి వేస్తుంటాను... మళ్ళి మొదలు... "దీదీ ఏ నీచే కా పత్థర్ ఘూం రహి హై... ఫిర్ అందర్ కా భి క్యూ ఘుమ్తా హై..." చిన్నగా నవ్వుకుని... ఐసా హాయ్ ఇడ్లీ కా ఆటా బన్ తా హై... అంటాను.
                             
ఏ పడగ్గదిలోనో పక్క సర్దుతూ ఉంటాను... ' దీదీ, రాత్ భర్ మై సోయీ నహిన్... ' అంటూ ఆపుతుంది. 'క్యూన్... క్యా హువా...' అంటే... ' దేఖో... కూలర్ మే తో హమ్ పాని డాలతే హై... హా... ఫిర్ ఏ.సి. మే తో డాలతే నహిన్ హై ? వహన్ సే పాని కైసే నిక్లేగా ?' మళ్ళి, నవ్వి... ' ఏ .సి మే పాని బనానే కా మెషిన్ హోతా హై... ' అంటాను.
ఈ లోపు తను ఇల్లుచిమ్మి, తడిబట్ట పెట్టేందుకు వచ్చింది...' దీదీ... ఏ ధర్మామీటర్ సే క్యా కర్ రహే హో...' అంటుంది. నేను కలవరంగా చుట్టుపక్కల చూసి... 'క్యా కహా...' అన్నాను. అప్పుడు నా ముందున్న వస్తువును చూపి, ' ఏ నా ఊపర్ వాలే అంకుల్ కే పాస్ భి హై... ' అంటుంది. అప్పుడు అర్ధమై... మనసులో బుర్ర బాదుకుని, ' ఇస్కో ప్రింటర్ కహతే హై... ధర్మామీటర్ బుఖార్ ఆనే పర్ డాక్టర్ మూ మే లగాతే హై నా... వో హై...' అంటాను. 'అచ్చా...' అంటుంది.
ఏ వస్తువుని అయినా ఎక్కువగా తినేస్తే ఏమౌతుంది... ఇదిగో... ఫైనల్ గా ఇదే అవుతుంది...
'దీదీ సాబున్ కిధర్ హై...'
' ఫ్రిజ్ మే రఖా హై...'
'పద్మినీ, పచ్చిమిరపకాయలు ఎక్కడున్నాయ్... ' అడుగుతారు మా అత్తగారు.
'పాల ప్యాకెట్ లో ఉన్నాయండీ...' అనేసి, నాలుక కొరుక్కుని... 'పాల ప్యాకెట్ పక్కన ఉన్నాయండి...' అంటాను.
వంకాయ పచ్చడి నూరుతుంటే వచ్చింది... 'దీదీ ఏ కైసే బనాతే హై...'
' ఇస్కో నా పెహ్లే seo కర్నా హై.'
ఛి, ఛి... మనసులో సైట్ కు చెయ్యాల్సిన seo ఆలోచన ఇలా వంకాయ పచ్చడిలో పడిందా... ఇక లాభం లేదు... అని తీర్మానించుకుని... శరణాగతి వేడాను.
'దేఖో... హమే బహుత్ కాం హై. అభి ఆప్ కిత్నా భి బోలో... హమరే దిమాక్ మే నహి జాయేగా. బాద్ మే బతానా ... "
పాపం, అప్పటినుంచి, తను ఏది మొదలెట్టినా... పై వాక్యమే... రిపీట్... లేకపోతే, ఈ చండివనంలో లేడీ ఘజిని ఉందని, మీరంతా నవ్వి పోరూ ! ఆ !

No comments:

Post a Comment