Saturday, July 9, 2016

ప్రేమలో 'పడితే' - సరదా తవిక

ప్రేమలో 'పడితే' - సరదా తవిక
----------------------
భావరాజు పద్మిని- 29/4/16/16

(ప్రేమలో పడితే... కంటికి నిద్దరుండదు, కడుపుకి ఆకలుండదు అంటారు కదా. కాని, వైద్య భాషలో చెపితే ఎలాఉంటుంది? సరదాగా... ఓ కవిత... నవ్వుకోడానికే నండోయ్...)



కార్నియా మీద నీ బొమ్మ పడగానే,
కనుగుడ్డు తెల్లబోయింది...
రెటినా కదలనని స్తంభించింది
రెప్ప వాలక 'లేజీ ఐ' జబ్బోచ్చిందని,
ఒకటే అనుమానంగా ఉంది.

నిన్ను చూడగానే దిమ్మదిరిగి 
మైండ్ బ్లాంక్ అయ్యింది...
చిన్నమెదడు చితికిందేమో,
షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఐంది.

కాళ్ళు మీ ఇంటి చుట్టూ,
గింగిరాలు తిరగమని చెప్తున్నాయి,
ఓ రకంగా వాకింగ్ అయిపోతుంది,
పోన్లే ఆరోగ్యానికి మంచిదేగా !

కడుపులో అల్సర్ వచ్చినట్టు,
తట్టుకోలేని అసిడిటీ ఉన్నట్లు,
ఆకలే వెయ్యట్లేదు ఏవిటో, 
లివర్ డామేజి కాదుకదా.

నరనరాల్లో ఏదో టెన్షన్,
బి.పి వచ్చి చచ్చిందేమో,
లేక హిమోగ్లోబిన్ తగ్గిందో,
ఏవిటో ఈ కంగారాదుర్తా.

మనసు మనసు అంటారు,
లొకేషన్ ఎక్కడో తెలీట్లేదు,
కాని గుండెలో సన్నటి బాధ,
మైనర్ బ్లాక్ అవలేదు కదా.

సుబ్బరంగా ఆరోగ్యంగా ఉన్న నాకు,
అడ్డవైన అనుమానాలు కలిగేలా,
చేసింది ప్రేమే నంటావా ?
సర్లే కాని, కంప్లీట్ హెల్త్ చెక్ అప్...
అర్జంటుగా చేయించుకోవాలి.
తెలిసో తెలీకో నువ్వే కారణం కనుక,
ఓ ఫిఫ్టీ థౌసండు అప్పిప్పిస్తావా ?

(సాధారణంగా చేసే వృత్తిని బట్టి, మనిషి ఆలోచనా విధానం మారుతుంది. గాయకుడు ఎదుటి వాళ్ళ గొంతును చూస్తాడు, దర్శకుడు వారిలోని అందాన్ని చూస్తాడు, చిత్రకారుడు వారి చుట్టూ ఉన్న పరిస్థితులని చూస్తాడు... ఇలా మనిషిని బట్టి, వృత్తిని బట్టి, భావాలు మారుతూ ఉంటాయి కనుక, అచ్చంగా నవ్వులకే ఓ నూరు ఇలాంటి ప్రేమలేఖలు రాస్తే ఎలా ఉంటుందంటారు? చెప్మా... ప్రేమను ప్రేమించే ప్రేమ ఆ ప్రేమను ప్రేమించే ప్రేమకై ప్రేమతో ప్రేమిస్తుంది... లాంటి టంగ్ ట్విస్టర్ కి అర్ధం అడగలేదుగా, చిన్న ప్రశ్నేగా... జవాబివ్వండి.)

No comments:

Post a Comment