Saturday, July 9, 2016

మీరేం చేస్తుంటారు ?

మీరేం చేస్తుంటారు ?
భావరాజు పద్మిని - 23/4/16

ఇలా చెప్పలేదు కానీ, చెప్పద్దూ... ఇలాగే చెప్పాలనిపిస్తుంది.
"మేడం, ప్లీజ్ నాకో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టండి..." అని అరవైఆరోసారి పరిపరివిధాలా అభ్యర్ధించాకా, పోన్లెమ్మని, ఒప్పుకోగానే... మొదలు...
"గుడ్ మార్నింగ్ మేడం, మీరు ఏం చేస్తుంటారు మేడం?"
ఆసరికే కొండలా పనులు పేరుకుపోయి, అందులోంచి ఓ కలుగు నిర్మించుకుని, ఎలుకలా తలబైటపెట్టి, ఊపిరి పీల్చుకుందామని చూస్తున్న నాకు... ఓ రకంగా ఉంటుంది, ఎవరో పొరుగుదేశపు నాయకుడు ధడాలున చచ్చినట్టు మౌనం పాటిస్తాను.
"మేడం ఆర్ యు దేర్?"
"హా... పెద్దగా చదువుకోలేదండీ, ఏదో పాటలు పాడుతుంటాను."
"వావ్... నాకు పాటలంటే చాలా ఇష్టం, ఓ పాట పాడతారా?"
"అబ్బే, ఎప్పుడూ పాడనండి, ఆ మధ్య కొన్నేళ్ళ క్రితం పాడితే, కేదార్నాథ్ లో వరదాలొచ్చాయి, మళ్ళీ రెండోసారి మొన్ననే ముచ్చటపడి పాడితే... చెన్నైలో వరదలోచ్చాయి, అందుకే... పురజనుల క్షేమం కోరి ఇప్పుడు పాడట్లేదు."
"ఓ, ఇంకేం చేస్తుంటారు మేడం?"
"డాన్స్ చేస్తుంటాను."
"ఓహ్, నిజంగా ! నాకు డాన్స్ అంటే ప్రాణమండీ. ఎక్కడ నేర్చుకున్నారు?"



"అబ్బే, నేర్చుకోలేదండి. ఏదో ఆ మధ్య ముచ్చటపడి, రెండు గెంతులు గెంతితే, ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం వచ్చింది, తర్వాత పాకిస్తాన్ లో వచ్చింది. ఈ మధ్య తరచుగా మాఊరి చుట్టుప్రక్కల భూకంపం రాడానికి కూడా కారణం నేనే. అందుకే లోకకల్యాణాన్ని కాంక్షించి ఆ ప్రయత్నమూ విరమించుకున్నా!"
"పోన్లెండి... వంటైతే చేస్తారుగా... తిన్నారా"
"ఎక్కడా, నాకు వంట రానిదే ! మావారు వండి పెడితే తింటా ! నాకు పొయ్యి చూస్తేనే భయమండీ."
"సర్లెండి, ఇంకా మీ హాబీస్ ఏంటి?"
"నాకు మీలా ముక్కూమొహం తెలీని వాళ్ళతో స్నేహంచేసి, అడ్డవైన విషయాలు చర్చించడం అంటే, చచ్చేంత ఇష్టం... కానీ నాతో స్నేహం అంతగా కలిసిరాదండి. వాళ్ళిద్దరికీ అయినట్టే అవుతుంది."
"ఎవరండీ వాళ్ళిద్దరూ?"
"ఇంకెక్కడున్నారు? ఒకరు చెన్నై బీచ్ లో ఆడుకుంటూ, సునామీలో కొట్టుకుపోయారు, మరొకరు హాలిడే కి మలేషియా వెళ్లి వస్తూ, మిస్ అయిపోయిన ఫ్లైట్ లో ప్రపంచాన్ని శాశ్వతంగా మిస్ అయ్యారు. అప్పట్నుంచీ నేను మానవతా దృక్పధంతో స్నేహాలు చెయ్యడం మానేసాను. ఓ స్వామీజీ చెప్పారు... నేను ఎవరితోననైనా మాట్లాడితే, నా దురదృష్టం వాళ్లకి బ్లూ డార్ట్ కొరియర్ లో వెళ్తుందట, వాళ్ళ అదృష్టం నాకు జెట్ ప్లేన్ లో వచ్చేస్తుందట. పోన్లెండి, మీరైనా దొరికారు. ఇంతకీ మీరేం చేస్తుంటారు. నాకు మీతో స్నేహం చెయ్యాలని ఆశగా ఉంది."
ఇట్స్ గాన్... పోయె పోచె... పోయిందే ! ఎక్కడమ్మా, స్నేహం చెయ్యాలన్న తాపత్రయం. లేకపోతే... ఆ.

No comments:

Post a Comment