Saturday, July 9, 2016

స్నాన విలాపం

స్నాన విలాపం 
----------------
భావరాజు పద్మిని - 11 /10/15.
(గమనిక : కేవలం హాస్యం కోసమేనని సవినయ మనవి. )


నేనొక నీళ్ళతొట్టి కడ నిల్చి, తటాలున టాపు తిప్పి 
మగ్గానెడు నంతలోన నీళ్ళన్నియు జాలిగ
నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు
బావురుమన్నవి కృంగిపోతి నా
మానసమందేదో తళుకు మన్నది స్నానవిలాప కావ్యమై

అంతలో ఒక నీటిచుక్కకన్నె సన్నని
గొంతుకతో నన్ను చూసి యిలా అంది ప్రభు

ఎక్కడో వానచినుకై ప్రభవింతుము మబ్బుజారి 
మన్నుమింగకున్న మరియొక చినుకుతోను కలిసి 
బొట్టుగ జట్టుగ ధారగ మారి 
కొండల దారిని చీల్చుకు వత్తుమోయి

ధార ధారతో కలిసి జలపాతమవ్వునోయి 
జలపాతము ముందుకు సాగి ప్రవాహమవ్వునోయి 
అది తిరిగి కాలువై నదిలోకి కాలుమోపునోయి 
నది పెరిగి, తరిగి, తిరిగి వొరవడిని వచ్చునోయి

అమ్మ నదిలోని బిందువనుచు మురియునంతలోన 
బండ పైపొకటి మోటార్ పెట్టి పీల్చి లాగిరోయి 
ఓవర్ హెడ్డు టాంకులోకి మమ్ము తోసిరోయి 
క్లోరిన్, రిన్ కలిపి మా ఉసురు తీసిరోయి



కొనఊపిరితో కొట్టుకొనుచున్న మమ్ముజూచి 
జాలియన్నది నసలు జెందక మరల తిరిగి 
పైప్ లైన్ పంపుల నుండి పంపి పంపి 
మీ ఇంటి టాంకు లోకి మమ్ము తోసిరోయి

పాపం మీరు దయాదాక్షిణ్యాలుగల మానవులు కావోలునే
ఎందుకమ్మా మా స్వేచ్చ జీవనానికి అడ్డు వస్తావు
మేము నీకేం అపకారము చేసాము ???

మా వెలలేని ముగ్ధసుకుమార స్వచ్ఛ మాధురీ
జెవితమెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయే
మా జీవమెల్ల కొల్లగొని ఆపై మగ్గుతోడ మురికిన చిమ్మి
మమావల పారబోతురుగదా నరజాతికి నీతియున్నదా

:వోసీ మానవీ !!!
బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమంగు ప్రేమ నీలోన చచ్చ్చేనేమి
అందమును హత్య చేసి తళుకులిడు హంతకీ 
మైలపడిపోయెనోయి నీ మనుజ జన్మ

అని దూషించు నీటి బిందువుల స్నాన మాడలేక
వట్టిచేతులతో వచ్చినాను ఇటుల నేను 
మీరునూ స్నానము త్యజియించి 
నికపై పాడుకొనుము ఈ గేయమును.

ఫలశృతి : ఈ గేయమును చదివిన వాళ్ళు తప్పనిసరిగా 3 రోజులు స్నానం మానెయ్యాలి. లేకపోతే చీర మహా పాతకాలు చుట్టుకుని, వచ్చే జన్మలో నీళ్ళు దొరకని ఏ చెన్నై లోనో, హైదరాబాద్ లోనో పుడతారు, ఉత్తుత్తినే.

No comments:

Post a Comment