Saturday, July 9, 2016

మాయదారి సవితి

మాయదారి సవితి 
------------------------
భావరాజు పద్మిని-11/3/16


కొత్త చీర కట్టి, మగని కళ్ళెదుట తిరిగినా,
కన్నుతిప్పనీదు కనికట్టు సవితి.

గాజులు, అందెలు సందళ్ళు చేసినా,
చెవులకెక్కనీదు చుప్పనాతి సవితి.

చంద్రవంక మోమున నెలవంక నవ్వులు,
చూడనియ్యదమ్మ నెరజాణ సవితి.

వాలుజడ మాలికల వలపువల వేసినా,
తనపట్టు వదలనే వదలదే వగలాడి సవితి.



ఊసులాడబోతే "ఊ" కొట్టుటే కాని,
వివరమే విననీదు వగరు సవితి.

ఏం మాయ చేసెనో మాయదారి సవతి,
సతులెల్ల పతిధ్యాసకై పాట్లు పడుచుండ,
మీకన్ననేమిన్న చూడుమనుచు,
కొంటెగా నవ్వునే తుంటరి సవితి.

"నీ ఛార్జి డిశ్చార్జి కాను" అన్న శాపాలు
"రీచార్జి" యగుచు విని నవ్వుకోనునేకాని,
కడగంటి చూపైనా దక్కనీయదమ్మ...
టక్కరి గాలమేయు మొబైల్ సవతి.

( జీవితసమస్య చూస్తున్నట్లు, గుడ్లప్పగించి, మొబైల్ లో వచ్చే ప్రతి వీడియోను తదేకంగా చూస్తూ, సతుల్ని పట్టించుకోని పతులకు(అలాగే పతుల్ని వెయిట్ లిస్టులో పెట్టే సతులకు)... చిన్నసతుల మానసావిష్కరణ... భక్తితో అంకితం.)

No comments:

Post a Comment