Thursday, November 19, 2015

హమ్మబాబోయ్...

హమ్మబాబోయ్...
--------------------
భావరాజు పద్మిని - 19/11/15.

పూబోణుల పై మెరుగులు గాయబ్  
ఆంటీల మేక్ అప్ లు పోయెపోచె
సోగ్గాళ్ళ వేషాలన్నీ ఇట్స్ గాన్...
డాబులు చూపే దుస్తులిక వానిష్

ఎవరైనా ఒకటే అవతారం...
ఉన్న బట్టలన్నీ అటకెక్కి,
ఉన్ని బట్టలు దించి ఉతికేసి,
కదిలే గొర్రెల్లా, గంగిరెద్దుల్లా,
దీని దెబ్బకు తోకముడిచి,
నిండా కప్పుకు దాక్కోవాల్సిందే !


ఐస్ క్రీం లకు కాలం చెల్లింది,
ఏ.సి లకు రెస్టు దొరికింది,
వెన్నులో వణుకు పుట్టింది,
ఫానురెక్కలకు ఆర్నెల్లు విశ్రాంతి,
ప్రతిచోటా చలిమంటల సంక్రాంతి.

జానెడు బట్టలతో ఒళ్ళునింపుకునే
జాణలను సైతం దారికి తెచ్చి,
ముసుగు వీరులని వీరమ్మల్ని చూసి,
ముసిముసిగా నవ్వుతోంది చలిపులి.
హమ్మబాబోయ్... ఇకపై...
తాళజాల గలమా నీ ఉధృతి ?

Friday, November 13, 2015

కవ్వింతల కాపురాలు

కవ్వింతల కాపురాలు 
-----------------------
భావరాజు పద్మిని - 13/11/15

పెళ్ళైన కొత్తల్లో...

"హొయ్... హొయ్, హొయ్... జింగిచకా, హొయ్, లస్కుటపా , ఆహా, హోయ్యరే హొయ్య..."
"ఓహో, ఆ మల్లెపూలు అమ్మే కుర్రాడు నన్ను ఆంటీ అన్నంత మాత్రానికే ఇంత సంబడం. హోయబ్బా... ఏదో ఒకరోజు ఎవరో ఒకరు మిమ్మల్ని అంకుల్ అనకపోతారా, నేనూ డాన్స్ ఆడకపోతానా ?"
కొన్నాళ్ళకి...
"అంకుల్ జీ, మీ కార్ కీస్ హోటల్ లో టేబుల్ మీద మర్చిపోయారు... " అంటూ ఇచ్చింది ఒక చిన్ని పాప.
"మా అమ్మే, మా తల్లే, ఏమన్నావు, మళ్ళీ పిలువు తల్లీ..."
"అంకుల్ అన్నాను..."
"విన్నారా, గుర్తు పెట్టుకోండి." ఇంటికి వెళ్ళాకా...
" ఓహో లగుజిగి లగుజిగి జిగులగి లంబాడోల్లన్నా, నువ్వు సిందులాడ రన్నా..."
"మరీ అంత సంబరం ఎందుకో, నన్ను ఉడికించాలనా ?"
"ఏం, మీరు నన్ను ఉడికించలేదూ... ఇదీ అంతే. "
*******************************************************
కొన్నేళ్ళ తర్వాత...
"చూడు, చిటికెన వేలు లాగా ఉండేదానివి, ఇప్పుడు బొటన వేలు లాగా తయారయ్యావు. ఆ జబ్బలు చూడు, జబ్బల్పూర్ రాణికి కూడా ఇంత దిట్టంగా ఉండవు, ఈ రోజు నుంచి, నీకు 'వీరబాహు' అని నామకరణం చేస్తున్నానోయ్. 
"అదేం పేరు ? ఇన్నాళ్ళు, ఏదో సుబ్బలక్ష్మి, వేంకటలక్ష్మి అని పిలిస్తే, పోన్లే అని పలికాను. మరీ వీరబాహు ఏమిటి ? అయినా ఇద్దరు పిల్లల్ని కన్నాకా, ఐశ్వర్యా రాయ్ లాగా ఉండాలంటే ఎలా కుదురుతుంది ? ఇలా పిలవడానికి నేనొప్పుకోను..."
"ఓహో, నీకు ఉడుగ్గా ఉందీ, అయితే ఇదే పేరు ఖాయం చేస్తున్నా... " 
"పిల్చుకోండి, నా పేరుతో పిలిస్తే తప్ప చస్తే పలకను. ఆ."
ఈ లోగా సీన్ లోకి కొన్నాళ్ళకి ఒక చుట్టాలావిడ వచ్చింది.
"మీ ఆయన పూర్తిపేరు నీకు తెల్సటే అమ్మాయ్..."
"లేదండి"
"హయ్యో... నే చెప్తా రాసుకో...వేంకట వీరభద్ర నాగ దుర్గ రామ సత్యసాయి ... చివర్లో నీకు తెల్సిన పేరు ..."
"ఏవిటీ, నిజమే..."
"అవునే..."
"ఉండండి, నోరు తీపి చేస్తాను. చల్లటి వార్త చెప్పారు..."
శ్రీవారు ఇంటికి రాగానే...
"ఏవోయ్ వీరభద్రం... ఓ సారి పాప ఏడుస్తోంది, ఎత్తుకోండి."
"ఎవరూ వీరభద్రం, నేనేం కాదు..."
"తెలిసిందిలే, తెలిసిందిలే... శ్రీవారు మీ పేరు తెలిసిందిలే..."
"అయినా నేనొప్పుకోను... "
"ఏవిటి ఒప్పుకోను, పేరులో వీరభద్రం పెట్టుకుని, ధర్మపత్ని దగ్గర ఏడేళ్ళు ఆ సంగతి దాచి, పైగా వీరబాహు అని పేరు పెడతారే. హన్నా !"
"అదేం కుదరదు... అలా పిలవద్దు..."
"హైసల్లక్కిడి హై... హొయ్, హొయ్, హొయ్..."
"అమ్మా, మా అమ్మతో చెప్తానాగు నీ పని..."

******************************************
మరో 8 ఏళ్ళ తర్వాత...
"నిద్దర్లో ఆ గురక ఏవిటి నాయనా, నిద్దరట్టక చస్తున్నాను..."
"ఒహొహ్... నువ్వు నిద్దరోతే, ఏనుగులోచ్చి తొక్కినా లేవవు అని లోకానికి తెలుసోయ్... కొయ్యకు, నేను గురక పెట్టడం ఏమిటి ?"
"సరే, ఈ సారి పెట్టినప్పుడు, ఫోన్ లో రికార్డు చేసి వినిపిస్తా..."
ఓ వారం తర్వాత..."ఆ రండి బాబూ, రండి... ప్రణవ నాదం వినిపిస్తా... " అంటూ ఫోన్ రికార్డు ఆన్ చెయ్యగానే...
"తూచ్, ఇది నా గొంతు కాదు, ఎవరో డూప్ ది. నేనొప్పుకోను."
కొన్నాళ్ళకి...
"డాడీ, రాత్రి అమ్మ గురక పెట్టింది, పాతాళ లోకం నుంచి భూతాలు వచ్చి అరుస్తున్నట్టు ఏం సౌండ్ డాడీ... "
"ఆహా, నా బంగారుతల్లి, భలే చెప్పావమ్మా..."
"పిల్లికి ఎలుక సాక్ష్యం లాగా బానే ఉందే యవ్వారం. ఏవిటే, పిట్ట కూతకి వచ్చింది ? మీ నాన్న కూడా పెడతారు గురక..."
"ఏమ్మా, నువ్వు చెప్పు, నేను అమ్మంత పెద్దగా గురక పెడతానా ?"
"లేదు నాన్నా... నీ గురక టీవీ మ్యూట్ లో పెట్టినప్పుడు సౌండ్ లాగా 'కుయ్...' అని చిన్నగా వస్తుంది. అమ్మ గురక ఫుల్ వాల్యూం లో..."
"బొత్తిగా భయం లేకుండా పోతోంది... మిమ్మల్నీ... "
***********************************************
ఏమైనా... ఆలూమగలు కలిసి జీవిస్తూ, కలిసి కవ్వించుకుంటూ సాగే ఈ జీవనయానంలో ఈ మధుర జ్ఞాపకాలు అందరికీ సహజమే కదూ... మీకూ ఇలాంటి అనుభవాలు ఉన్నాయా ?

Wednesday, October 14, 2015

నలకలతో నాన్

నలకలతో నాన్ 
---------------
భావరాజు పద్మిని - 14/10/15 

టీవీ లో వస్తున్న 'సరికొత్త వంట ' కార్యక్రమం 1315 భాగాన్ని, ఎప్పటిలాగే పెన్ను డైరీ పట్టుకుని, రెప్ప వెయ్యకుండా చూస్తోంది వెంగళమ్మ. ఆ రోజు 'నలకలతో నాన్' అనే కొ(చె)త్త వంటకం చూపిస్తున్నారు.

టీవీ లో సగం మొహం జుట్టుతో కప్పుకున్న శాల్తీ వచ్చింది. పేరు జూలీ ట.
"చూడండి, నలకలు ఆరోగ్యానికి చాలా మంచివి. పైగా బియ్యం ఖర్చు, కూరగాయిల ఖర్చు కూడా ఉండదు. ముందుగా ఇల్లు మొత్తం బాగా డేకేస్తూ, కంటికి కనిపించిన నలకలు అన్నీ ఏరుకురావాలి. కంటి చూపు మందగించినవారు చీపురుకట్టతో ఊడ్చి, ఆ కసువును నాన్ కు వాడవచ్చు అనుకోండి..."

ఆశ్చర్యంగా తెరిచిన నోటిని ముయ్యడం కూడా మర్చిపోయి చూస్తోంది వెంగళమ్మ.

ఈ లోపు ఆంకరమ్మ జోక్యం కల్పించుకుని, "అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది, చెప్పండి జూలీ  !" అంది.

"చూడండి, మట్టిలో చాలా శక్తి ఉంటుంది. చిన్నప్పుడు మనం మట్టి తినేవాళ్ళం కదా ! మరి నేటి తరం వారు ఇంక్యుబేటర్ కోళ్ళలా ఏసీలలో పుట్టి, ఏసీలలో పెరుగుతున్నారు. మరి వాళ్లకు బలం ఎలా వస్తుంది ? మట్టికి దూరమై మళ్ళీ 'మడ్ బాత్ లు' అంటూ వెళ్తున్నారు. అంతెందుకు శ్రీకృష్ణుడే మన్ను తిన్నాడు కదా ! అందుకే, అదే ఐడియా ను వాడి, ఇది తయారుచేసాను." అంది జుట్టు ఎగరేస్తూ జూలీ.

ఆ తర్వాత కసువు ఏరడం, చెంచాడు మైదా పిండితో కలిపి నాన్ చెయ్యడం, చెప్పింది చెప్పినట్టు రాసుకుంది వెంగళమ్మ, ఆమె కేవలం రాసి ఊరుకునే రకం కాదు, చూసి ఊరుకోమంటే, నాన్ లు చేసి, కాల్చి కాని, ఊరుకోదు. సాయంత్రానికి నలకలతో నాన్ లు సిద్ధమయ్యాయి. ఆవురావురు మంటూ ఇంటికి వచ్చాడు ఆదికూర్మయ్య. వేడి వేడి రొట్టెలు, నోట్లో పెట్టగానే పంటికింద కసక్కుమని, జ్ఞానదంతం ఊడినట్లు అనిపించింది. అంతే, చంటబ్బాయ్ సినిమాలో శ్రీలక్ష్మి వంట తిని, మతి చెడిన ఎడిటర్ లాగా ఇలా మాట్లాడసాగాడు...



"ఏమేవ్... ఆ మొలతాడుతో స్కిప్పింగ్ ఆడద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను ? తనకు పోటీ వస్తున్నావని, పూలన్దేవి నొచ్చుకోదూ... అయినా బాహుబలి నేను ఎందుకు తీసాను, రుద్రమదేవి సినిమాకు బదులు దీనికి అవార్డు ఇస్తుందనే కదా... మరి ఆ రాజ్ మౌళి అలా అంటాడేవిటి ? కట్టప్ప కట్టుడు పళ్ళు నేను కొట్తేసాను అంటాడేవిటి ?

ఇదిగో, ఎవరక్కడ, వెంటనే ఒక డైనోసార్ ని సైకిల్ తొక్కుకుంటూ రమ్మనండి. హారీ పొట్టర్ హారతి ఇస్తాట్ట. అసలే ఆ చక్కరపొంగలికి దిష్టి తగిలి, చక్కెర వ్యాధితో ఐ.సి.యు లో వెంటిలేటర్ మీదుంది. నేనెళ్ళి చూసొస్తా.

భౌ, భౌ... ఏమేవ్... ఆ కుక్కకి కాసిన్ని పాం బిళ్ళలు పెట్టు, దాని అరుపులకి భయపడి, పిపీలికానికి హార్ట్ అటాక్ వచ్చిందట. వస్తామారి, రేపు కాట్ విన్స్లెట్ నాతో కోతికొమ్మచ్చి ఆడతానంది. నేను వెంటనే వెళ్లి, ఓ బుల్ డోజెర్ అద్దెకు తేవాలి. " అంటూ బైటికి వెళ్లిపోతుంటే... చటుక్కున లాగి, బలవంతంగా కుర్చీకి కట్టేసింది వెంగళమ్మ. ఆ క్షణం నుంచే, 'న కరోమి టీవీ వంట జిందగీ మే...' అన్న కొత్త నోము పట్టింది. అంటే ఏవిటో తెలిసిందిగా, అదన్నమాట !

Thursday, October 8, 2015

ఆశువుగా 'ఏక్ పటాకా' లు

ఆశువుగా 'ఏక్ పటాకా' లు
(అదేలెండి, ఏకవాక్య హాస్య కవితలు - అర్ధం చేసుకోరూ...)
ఎంతమంది దేవుళ్ళకి మొక్కుకుందో మరి నది - గుండ్రాళ్ళకి నున్నగా గుండు కొట్టేసింది.
కొండల్లో దేవతలు వంటలు చేసుకుంటున్నరేమో - మబ్బుల పొగలు వస్తున్నాయి.
మేక్ అప్ చేసుకుంటోంది చెట్టు - నీటి అద్దంలో చూసుకుంటూ.
మహేష్ బాబు లాగే దూకుడెక్కువ - జలపాతానికి.
కొట్టీ కొట్టీ బోర్ కొట్టిందట, మొరాయించింది - బోరింగ్ పంపు.
యెంత దాహమేసిందో, ఆపకుండా పెట్రోల్ తాగేస్తోంది - లారి.
గంపెడు జ్ఞాపకాలు తిన్నట్టు నెమరేస్తూనే ఉంటుంది - గేదె.
మొక్కే కదా అని పీకినా మళ్ళీ మొలుస్తుంది - గడ్డి పరక.
రోజూ హోలీయే - ఊసరవల్లికి.
ఎన్ని రాసినా మింగేసి, ఆవులిస్తూ ఇంకేంటి అంటుంది - పేస్ బుక్.
వీటిలో మీకు నచ్చిన వాటికి వోట్ చెయ్యండి. నచ్చితే బ్యాంకు ఎకౌంటు నెంబర్, నచ్చకపోతే, క్రెడిట్ కార్డు నెంబర్, పిన్, ఇతర వివరాలతో సహా నాకు మెసేజ్ ఇవ్వండి.
ప్రత్యేక ఆఫర్ : కార్డు వాడిన ప్రతి సారి, మీ మొబైల్ కు ఉచితంగా మెసేజ్ వచ్చే సదుపాయం ముందే ఉందిగా ! అదే ఆఫర్ అన్నమాట !


Thursday, August 13, 2015

తూచ్ పజ్యాలు

తూచ్ పజ్యాలు (సరదాగా నవ్వుకోడానికే నండోయ్ )
---------------------------------------------------------

- భావరాజు పద్మిని 

అయ్యలారా ! అమ్మలారా ! ఇవాళే ఒక కొత్త పజ్జ ప్రక్రియ కనిపెట్టేను. రవ్వలు, చువ్వలు, అజ్నానీలు లాగా... ఇదికూడా వెరైటీ అన్నమాట ! 'ఆటవిక అట్ట ప్రవేశంలో' (wild card entry) నా ఈ ప్రక్రియ తెలుగు ఛందస్సు లో దొడ్డి దారిలో చేరాలంటే, మీరంతా ఈ ప్రక్రియ మీకు నచ్చితే... 'భళా !' అని 100 నెంబర్ కి, నచ్చకపోతే 'అంతా అయిపొయింది' అని 108 నెంబర్ కి sms పంపగలరు.
తూచ్ పజ్యం 
-------------
మాచ్ ఆడుతున్న క్రీడాకారుడు
హాచ్ అనుచు తుమ్మి అపశకునమనుచు
తూచ్ అని బయల్పడెన్ అదిగని
కోచ్ లబోదిబోమనగ ఆట గోవిందాయెన్



హా, ఇప్పుడు ఈ పజ్జ ప్రక్రియ గురించి, ముఖ్యంగా ఛాందసులు అయిన పెద్దవాళ్ళకి చెప్పాలి. వేదాంతం పెకారం నిజానికి మనం చూసేది అంతా తూచ్... అంటే మిధ్య. అందుకే ఈ పేరేట్టాను. ఇందులో ప్రతి పాదంలోనూ రెండో అచ్చరం 'చ్' రావాలి. యతి నియమం, అక్షర నియతి లేవు. కొన్ని అన్యభాషా పదాలు కలిసిన ఈ పజ్జ ప్రక్రియను పెనుప్రమాదం(మణిప్రవాళం ) అంటారు. మీరూ ప్రయత్నించండి , వోట్ చెయ్యడం మరువకండి.


Sunday, July 26, 2015

మౌనాన్ని తిందాం రా !

 మౌనాన్ని తిందాం రా !
-------------------------
- భావరాజు పద్మిని 
ఎన్నాళ్ళని ఈ పులిహోరలు, పాకుండలు తింటాం ?
ఎన్నేళ్ళని ఈ పిజ్జాలు, పాప్కార్న్ లు తింటాం ?
ఎన్ని రోజులని ఫేస్బుక్ లో, వాట్స్ ఆప్ లో చాటుతాం?
ఎన్ని డబ్బులని మొబైల్ బిల్లుకు కడతాం, నువ్వే చెప్పు?

అందుకే ప్రియా...
ఇద్దరం కాస్త మౌనాన్ని తిందాం రా !
గుటుక్కున నిశ్శబ్దాన్ని మింగుదాం రా !
పుటుక్కున శూన్యాన్ని తాగుదాం రా !
లటుక్కున దైన్యాన్ని తరుముదాం రా !
ఘబుక్కున దూరాన్ని పిండి ఆరేద్దాం రా !
రిన్ సబ్బుతో ప్రేమనుతికి తెల్లగా మెరిపిద్దాం రా!

కూలింగ్ గ్లాస్సెస్ తో కళ్ళు నెత్తికెక్కి,
డబ్బుతో జబ్బుచేసిన ఈ పాడులోకంలో 
స్వచ్ భారత్ లా స్వచ్చమైనవి ఇవే ప్రియా...
చీపురుతో గుండె గూటిని ఊడుద్దాం రా !
చాటతో ప్రేమ తాట తీసి, ఎత్తేద్దాం రా !



Monday, July 13, 2015

భీభత్స కవిత


అదేవిటోనమ్మా... ఇవాళ కవితలు తన్నుకోచ్చేస్తున్నాయి.... మరొక నవజాత కవిత....
భీభత్స కవిత 
- భావరాజు పద్మిని, సెప్టెంబర్ 6,2013 

అర్ధరాత్రి... అమావాస్య....

కరకింకర స్మశానంలో 
కరకరా జంతికలు తింటూ,
రాంగోపాల్ వర్మ సినిమా చూస్తున్నాడు.

ఉన్నట్టుండి ఉలిక్కిపడ్డాడు 
బిక్కచచ్చిపోయాడు...
పిల్లదేయ్యం వీపు తట్టింది.

అంతే ,
సుడిగాలిగా గాల్లో తేలుతూ 
రాంగోపాల్ వర్మ ఇంటికి వెళ్ళాడు.
వికటాట్టహాసం చేసాడు.
లెంపకాయ్ కొట్టి,


దెయ్యాలు కూడా బెదిరి చచ్చేట్టు 
ఏవిటా దిక్కుమాలిన సినిమాలు...
నీ పిండం పిల్లదేయ్యలకు పెట్టా!
అంటూ బిగ్గరగా ఆర్తనాదం చేసాడు.

ఒక్కసారి కరకింకరను తేరిపారా చూసి,
ఆవులించిన అభినవ భీబత్స దర్శకుడు,
ఎల్లెల్లవో, సినిమాల్లో చాలా చూపించాం 
నీ లాంటి ఆకారాల్ని, అంటూ...
ఆవులించి, మళ్ళీ నిద్రపోయాడు.