Monday, December 15, 2014

వాటా అప్పు


వాటా అప్పు 
-----------------
భావరాజు పద్మిని 

కాజోల్ దగ్గరికి వెళ్లి ఇలా అడిగింది సమంతా. వీళ్ళిద్దరూ సినిమా హీరొయిన్ లు అనుకునేరు. పనమ్మాయిలు, కాలానికి తగ్గట్టు పేర్లు మార్చుకున్నారు.

' ఒసే కాజలమ్మా, నీకు వాట్స్ ఆపు ఉందంటే..."

' అంటే ఏటే సమ్మంతమ్మ... రోజుకోటి మోసుకొత్తావు... ఆ మజ్జన మొబైల్ కొనీ దాకా వదన్నేదు. అది వాడకం తెల్సీసరికి చచ్చాను. అంకెలు నొక్కడం రాక, ఎవడో ఒకడికి మిస్సేడ్ కాల్ ఇచ్చేత్తే, తర్వాత వాడు మాట్టాడే బాష తెలీక నవ్వుకు సచ్చేవోల్లం. ఇప్పుడేమో... వాటా అప్పు అంతన్నావ్... ఇంతకీ ఈ అప్పు యాడ ఇస్తారంట ?'

' హ హ హ... ఓసోస్... అప్పు కాదే. రెండేలకే మారటా(స్మార్ట్) ఫోను కొన్నావా... అందులో ఈ వాట్స్ ఆపు వేయించుకోవాల... అదేదో నాటకంలో కళ్ళు కనపడని రాజుగారు...'ఏమి జరుగుచున్నది...' అంటాడు కదా... అది సూసినోడు  'వాట్స్ అప్పు' సేసాడు  ... దానికి నువ్వు  కార్డు ఏయించుకుంటే, నువ్వు కొఇటా (కువైట్) ఎల్లిన నీ మావతోటి కూడా ఊరికే మాట్టాడేసుకోవచ్చు...'

'అవునా,  ఇదేదో బలేగుందే ! అయినా ... పొట్ట కొస్తే, అచ్చరం ముక్క రానిదాన్ని... నాకేటి తెలుస్తాది '

' నేనున్నాను గాదేటి ? మనం మాట్టాడుకోడానికే... మనలాంతోళ్ళ కోసం అందులో బొమ్మల బాశుంటది... '

'బొమ్మల బాసా... అంటే... '

'అందులో గడియారం బొమ్మ, వెకిలి నవ్వు బొమ్మ, పువ్వు బొమ్మ, గంట బొమ్మ, ఇంకేవో గుర్తులు ఉంటాయ్... అవి ఒత్తితే ఇంకొన్ని బొమ్మలోత్తాయ్... ఇల్లు బొమ్మ, గుడ్డల బొమ్మ, నవ్వే బొమ్మ, ఏడ్చే బొమ్మ, కమోడు బొమ్మ, చీపురు బొమ్మ, గిన్నెల మోరీ బొమ్మ... అన్నీ... ఇదిగో, నా ఫోన్ ల సూడు '

'అవునా, కాని నేను దీన్ని ఎలా వాడాల ?'

' ఏముంది... మోరీ బొమ్మ నేనెత్తే... గిన్నెలు తోమావా అని అర్ధం... గుడ్డ  గౌను బొమ్మేస్తే గుడ్డలు ఉతికావా అని... అలాగే చీపురు బొమ్మ, కమోడు బొమ్మ... ఇల్లూడ్చావా, బాత్రూం కడిగావా... అనర్ధం... నేను ఇంటి బొమ్మ పంపితే, పని చెయ్యడానికి కొత్తిల్లు ఉంది, రమ్మని అర్ధం... ఇంకా రహస్యం బొమ్మ... మనతో తగువులేట్టుకునే వాళ్లకి కూడా ఇందులో రాకాసి బొమ్మల్ని చూసి, పేర్లు పెట్టుకుందాం... నీ మావకి నవ్వే బొమ్మలు, ఏడ్చే బొమ్మలు, ఆచ్చర్యం బొమ్మలు, తల పగలగొడతా అన్నట్టు తల తిరిగే బొమ్మలు, లవ్వు బొమ్మలు, పువ్వు బొమ్మలు అంపు.   నీకు ఏదైనా నచ్చితే, అంగూటా పైకెత్తిన బొమ్మ, నచ్చకపోతే, కిందకు దించిన బొమ్మ , అమ్పేసేయ్...'

'ఓహ్, ఇదేదో యాపారానికి, బలేగుందే. మరి మా తమ్ముడు డైవరు గందా, వాడికీ ఈ వాటా అప్పు పనికొచ్చుద్దా ?'

'ఓహ్, బెమ్మాండంగా, వెళ్ళే కార్ బొమ్మ- అంటే పనుంది వెళ్తావా అని , వచ్చే కార్ బొమ్మ వస్తున్నా అని , కుదరక పొతే కొట్టేసిన బొమ్మ, కుదిరితే అంగూటా పైకెత్తిన బొమ్మ,  ట్రాఫ్ఫిక్ సిగ్నలు బొమ్మ ఇలా వాడతన్నారు డైవర్లు...'

'సరేగాని,నేను  అంపిన బొమ్మ నువ్వు సూసేవని ఎలా తెల్సేది...'

'దానికీ కనిపెట్టేసినాడు ఈడు మందు... ఒక నల్ల టిక్కు ఉంటే, నీ బొమ్మ ఎల్లినట్టు, రెండు నల్ల టిక్కులు ఉంటే ఎల్లింది కాని, వాళ్ళు సూడనట్టు... రెండు బులుగు టిక్కులు వస్తే... సూసినట్టు... ఇంకా ఫోటోలు, యీడియో లు , అంపవచ్చు..., అన్నట్టు మర్చిపోయానోసే, కాజలమ్మ... అసలు బొమ్మలు కూడా అమ్పక్కర్లేని బెమ్మస్త్రం ఉందీడ...'

'ఏంటో అది... బండ పుల్ల కింద చందమామ పెట్టినట్టు ఉన్న బొమ్ముంతాది... అది నొక్కి, నువ్ మాటాడి ఒదిలితే, నీ మాట చనాల్లో మీ మావ దాకా ఎల్తాది... ఇది శానా తేలిక...'

'మరి సేప్పవేటే... పద ఎల్దాం నాకూ, వెంటనే వాటా అప్పు కావాలి...'



Sunday, December 7, 2014

ఫేస్ బుక్కో పీడయ్యా

ఫేస్ బుక్కో పీడయ్యా 
------------------------
భావరాజు పద్మిని - 8/12/14 

ఒకతను ఒక వైపు వాచిన చెంపతో ,' గారెంటీ మానసిక చికిత్సాలయం ' కు వెళ్ళాడు...

డాక్టర్ గారు అతన్ని చూడగానే...' అదేంటి ? సింగల్ పూరీ శర్మ  లాగా ఆ అవతారం ఏమిటి ?' అని అడిగారు ?

"అదంతా ఒక పెద్ద కధ డాక్టర్ గారు. ఇంతకీ రోగాన్ని ఖాయంగా కుడురుస్తామని ఎలా గారెంటీ ఇస్తారు...? "

"వెరీ సింపుల్ నాయనా ! ముందుగా రోగి ఒక పది లక్షలు హాస్పిటల్ లో డిపాజిట్ చెయ్యాలి... రోగం తగ్గితే  అందులో 9 లక్షలు తిరిగి మీవి, లేకపోతే మావి..."

"అదేంటి రివర్స్ లో ఉంది... అసలు మీకు పేషెంట్ లు ఉంటారా ?"

"అక్కడే ఉంది తిరకాసు. డబ్బులు గుర్తుకు వచ్చినప్పుడల్లా, రోగం తగ్గాలని బలంగా ప్రయత్నిస్తారు. చివరికి జబ్బు తగ్గిందని పరీక్షలు చేసి, నిర్దారించాకే డబ్బులు తిరిగి ఇస్తాం ! అది సరే గాని, బయట బోలెడు పేషెంట్ లు వెయిటింగ్... త్వరగా పూరీ సంగతి చెప్పు..."



అతను బొటన వేలు చూపి, ఇలా చెప్పసాగాడు..."ఏముంది సర్... ఈ రోజుల్లో మామూలు జబ్బే ! కాకపొతే మరికాస్త ముదిరింది. నాకు తెల్లారి లేస్తే మొబైల్ లో ఫేస్ బుక్ చూడందే పొద్దు పోదు. ఇలా చూసి, చూసి, బయటి వారితో కూడా అలాగే మాట్లాడుతున్నా. నా ఎదురుగుండా ఎవరైనా కూర్చుంటే, వాళ్ళు మాట్లాడింది నచ్చితే బొటన వేలు చూపిస్తాను. లైక్ అన్నమాట. మరీ నచ్చితే, కాసేపు వెళ్ళు టకటక లాడించి lol, rofl, rip లాంటివి వాడుతుంటా. ఎవరొచ్చినా ఆటలు ఆడేందుకు పిలుస్తా. అలాగే ఫోన్ లో కూడా. కాని, ఫోన్ లో వాళ్లకి, నేను చూపించిన బొటనవేలు కనబడక , ఫోన్ పెట్టేస్తున్నారు. కొత్త వాళ్ళతో ఐతే మరీ ఇబ్బందిగా ఉంది. నిన్న ఒకావిడ మా ఇంటికి వచ్చి, ఏదో జోక్ చెప్పింది. వెంటనే, ఆవిడ దగ్గరకు వెళ్లి, బుగ్గ మీద పొడిచాను ... అదే పొక్ అన్నమాట. వెంటనే ముందు ఆవిడ, తర్వాత మా ఆవిడ లాగి పెట్టి కొట్టడంతో బుగ్గ బూరెలా ఉబ్బి, ఇలా పూరీ అయ్యింది... "

"బాధపడకు... దీన్ని 'ఫేస్ బుక్కో పీడయ్యా '  అంటారు. వెంటనే పది లక్షలకు పోస్ట్ డేటెడ్ చెక్ ఇవ్వు. నీ రోగం నేను కుదురుస్తా !"

చెక్ తీసుకుని, "చూడు నాయనా ! రోగం వచ్చిన చోటే వదిలించుకోమన్నారు మా మానసిక శాస్త్ర వేత్తలు. అందుకే... ముందుగా నీ ఫేస్ బుక్ ఖాతా కొన్నాళ్ళు డీ ఆక్టివేట్ చెయ్యి. తర్వాత ఒక అందమైన హీరొయిన్ బొమ్మ పెట్టి, కొత్త ఖాతా తెరువ్... రోజుకో హీరొయిన్ బొమ్మ మార్చు.  ఫ్రెండ్ రిక్వెస్ట్ లు వరదల్లా వస్తాయి. నీకు ఇన్నాళ్ళు ఫేస్ బుక్ లో తెలిసిన వాళ్ళే, అతి సంస్కార వంతులు అని నువ్వు అనుకున్న వాళ్ళే... 'మేడం, ప్లీజ్ మేడం మాట్లాడండి... ఫ్రెండ్ చేసుకోండి, ఒక్క సారి మీ ఫోటో పెట్టండి... మీరు బదులు ఇవ్వకపోతే కిరసనాయిలు తాగి చస్తా... ' అంటూ పలు తెరంగుల వేధిస్తారు. నువ్వు మగాడివి, కాని అంతా స్త్రీ లింగంలో మాట్లాడతారు. అదంతా చూసి, నీకు ముందు కాస్త పిచ్చి పడుతుంది. తర్వాత చిరాకు వస్తుంది. నెమ్మదిగా విరక్తి కలుగుతుంది. అంతా మిధ్య. దీనికంటే, మామూలు ప్రపంచంలో బతకడమే నయమని, నెమ్మదిగా నిర్ణయించుకుంటావు. ఇలా రెండు నెలలు గడిచేసరికి నీ పిచ్చి గాయబ్..."

"గాయబ్... కాని, ఇదంతా నిజంగా జరుగుతుంది అంటారా ? "

"ఆ జరగకపోతే ఏమౌతుంది, నీ పది లక్షలు నావి అవుతాయి ... అంతేగా ! అప్పుడు మళ్ళీ వచ్చి , డబ్బిచ్చి, ఇంకో ఐడియా కొనుక్కో ! చికిత్స గారెంటీ !"

"ఆ... !"

Wednesday, December 3, 2014

బద్ధకం - కవిత


 
నాకు ఈమెయిలు లో ఏదో  సైబర్ సెంటర్ నుంచి స్కాన్ చేసిన ఒక కవిత వచ్చింది... పత్రికలో ప్రచురణ కోసం... ఇప్పుడు ఒక్క పదం పట్టుకుని తవికలు రాసే ' సింగల్ పదం సిల్లీ' కవితలు రాస్తున్నారు కదా... ఇదీ అలాంటిదే...

బద్ధకం - కవిత 
-------------------

నాకు పొద్దుటే లేవాలంటే బద్ధకం 
ఎందుకంటే నాకు మలబద్ధకం 

మా కుక్కతో వాకింగ్ కి పోవాలంటే బద్ధకం 
ఎందుకంటే దానికీ అదే బద్ధకం 

మా ఆవిడకి ఇంటిపని చెయ్యాలంటే బద్ధకం 
ఎందుకంటే ఆవిడకి ఒళ్ళు బద్ధకం 

మా పాపకు స్కూల్ కు వెళ్ళాలంటే బద్ధకం 
ఎందుకంటే చదువంటే దానికి సుద్ద బద్ధకం 



అంతేనా ? బద్ధకం మాకేనా ?
మన్మోహన్ సింగ్ కు మాట్లాడాలంటే బద్ధకం 
వాజ్పేయికి సభలో నిద్ర లేవాలంటే బద్ధకం 
జయలలితకు పెళ్ళంటే బద్ధకం 
కొండచిలువకు కదలాలంటే బద్ధకం 
లోకమంతా అమిత బద్ధకం !
బద్ధకం కాదు బలవర్ధకం 
అయినా బాసింపట్టు వేసుకు కూర్చుంటుంది 
ఎందుకింత దాష్టీకం ?

కె. రావు ... అంటే కవితలు రావు కాబోలు. ఖర్మ... వెనక్కి తిడదామంటే... సైబర్ సెంటర్ అడ్రస్... ఏం చెయ్యడం... నాకు చంటబ్బాయ్ సినిమాలో ఎడిటర్ గుర్తొచ్చారు.
"అమ్మా, మా పత్రిక మూసేద్దామని తీర్మానించుకున్నప్పుడు... తప్పకుండా మీ కవిత వేస్తాం..."
కవితాసురుల హింస ... బాబోయ్...






Wednesday, November 12, 2014

సె(హె)వెన్ సీటర్

నవ్వేజనా సుఖినోభవంతు -6

సె(హె)వెన్ సీటర్ 
--------------------
భావరాజు పద్మిని - 12/11/14 

డుగు డుగు డబ్బా బండి...
ఒక్కసారైనా ఎక్కి చూడండి...

పేరుకేమో ఇది సెవెన్ సీటర్ 
జనాల్ని లెక్కెడితే లెవెన్ సీటర్ 

స్వర్గాసుఖాలన్నీ అమరినట్టుండే 
ఈ రేకుబండి నిజానికి హెవెన్ సీటర్ 

సూది బెజ్జంలో ఏనుగు దూర్చినట్టు 
లాఘవంగా కుక్కేస్తారు మనల్ని ఒట్టు  

కుర్చీ కోసం కొట్టుకునే పాట్లు 
త్వరగా వెళ్ళాలనే ఇందరి అగచాట్లు 

తానుదూర సందు లేకపోయినా 
బాగ్ తో సహా తోసుకొస్తారు కొందరు 

కాళ్ళూ వేళ్ళు పచ్చడి చేసి,
పక్కవాళ్ళ ఒళ్లో చేరతారు కొందరు 

ఒంటి కాలిపైనే కూర్చుని, 
గమ్యానికై  కొంగ జపం చేస్తారు కొందరు 

సందట్లో సడేమియా అంటూ,
పడుచుపిల్లను నొక్కేస్తారు కొందరు 

ఖాళీ లేక ఉక్కతో తిక్కలేస్తుంటే 
తీరిగ్గా ఆరాలు అడిగుతారు కొందరు 



అసలిది బండా... కాదు కాదు, సుమండీ 
సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ వాహనమండి.

కదిలే భూకంపం లాగా లోనున్నవారి 
అండపిండ బ్రహ్మాండాలు కుదిపే జర్క్ 
,
ఖర్మకాలి స్పీడ్ బ్రేకేర్ వచ్చిందో
దేహంలో ఏదో ఒక పార్ట్ అవుతుంది క్రాక్ 

జోరుగా నడుపుతూ మెలికెలు తిప్పి,
ప్రమాదం ఒళ్లోకి వెళ్లి వేస్తాడొక బ్రేక్ 

చావుతప్పి కన్ను లొట్టబోయేలా  చేసే,
ఈ వాహనం యముడి దున్నపోతుకి రీమేక్ 

ప్రాణాలతో చెలగాటమే ఇప్పుడు కిక్కు 
మరి హెవెన్ సీటర్ ఎక్కి చూసుకోండి మీ లక్కు!

Tuesday, November 11, 2014

ఉప్మా (ఉపమా) నాలు

నవ్వేజనా సుఖినోభవంతు -5 
-----------------------------------
ఉప్మా (ఉపమా) నాలు 

కాంత కనుగుడ్లు  
కుంకుడుకాయ్ గింజలేగా 

నాతి నాసిక 
నారింజకాయ్ కాడేగా 

పడతి పెదవులు 
పంపరపనాస తొక్కలేగా 

ముదిత కరములు 
ములక్కాయ కాడలేగా 

జవ్వని జడ 
పొడవాటి బర్రె తోకేగా 



మొత్తంగా ఆమె ఒక 
కదిలే సిమెంట్ దిమ్మేగా 

లలన మెచ్చగ ఇదిగో తెచ్చితిని 
దురదగుంట పువ్వును...

ఆకుతగలక అందుకొని 
సిగను తురిమి ఆమె నవ్వును...

అతివ అందం చూసిన 
మనసు కుప్పి గంతులేసేగా ! 

ఏవిటో ప్రతి కవితలో
ప్రాస కోసం ప్రయాసేగా !
ఇంక చాల్లెండి ! ఆపేస్తా !

(బాబోయ్... ఉపమా కాళిదాసః అనడం మానేసి... ఉప్మా పద్మిని... అంటారేమో అని నాకు సిగ్గేస్తోంది బాబూ !)

 

Monday, November 10, 2014

భా(దో)మా కలాపం

నవ్వేజనా సుఖినోభవంతు - 4 

భా(దో)మా కలాపం 
--------------------------
(భావరాజు పద్మిని - 10/11/14 )

యెంత ప్రేమ నీకు నేనంటే...
పగలు రాత్రి నా చుట్టూ గింగిరాలు తిరుగుతావ్ !

నా దృష్టిని ఆకర్షించాలని ,
నేను ఎక్కడికి వెళితే అక్కడికి వస్తావ్ !

కాస్త పరాగ్గా ఉన్నానంటే,
చప్పున నెమ్మదిగా నా మీద వాలిపోతావ్ !

అలా నిద్రపోదామని 
కన్ను ముయ్యగానే చెవుల్లో గుసగుసలాడతావ్ !



కాని, ఒసేయ్ దోమా !
నీ రక్తప్రేమా కలాపం తట్టుకోలేక,
నేను చేసే దోమాకలాపం యేమని చెప్పను ?

కంపుగోట్టే క్రీం రాసుకుని,
నువ్వు నా దగ్గరకే రాకూడదని ప్రయత్నిస్తాను.

కచువా వెలిగించి ప్రతిరోజూ 
నీకు ధూపం వేసి తరిమేయ్యలని చూస్తాను.

నీకోసం 'అల్ అవుట్ ' పెట్టి,
దానితో ఇంట్లో అందరి ఆరోగ్యాలు అవుట్ చేస్తాను.

అయినా... నీకు దోమ కుట్టినట్టు కూడా ఉండదు.
ఇలా నిద్ర పోగానే, అలా జుయ్యి మంటూ గోలపెడతావ్ !

నాకు ఒళ్ళు మండుతుంది.
వెంటనే బాట్ బ్రహ్మాస్త్రం తీస్తాను.

మంచం కింద దూరతాను,
బెడ్ పై నుంచి హై జంప్ చేస్తాను.

సీలింగ్ దాకా యెగిరి గంతేస్తాను,
వాళ్ళనీ వీళ్ళనీ పొరపాట్నచావగొడతాను,

పైన చూస్తూ పరుగెత్తి బోర్లా పడతాను,
నాకు నేనే ఒకటిరెండు వాతలు పెట్టుకుంటాను.

ఒకటే పరుగులు పెట్టిస్తావ్, 
చిటికెలో మాయమయ్యి వెక్కిరిస్తావ్ ...
దొరికిన దోమల్ని చంపి, 
హమ్మయ్య అని కన్నుముయ్యగానే ...

మళ్ళీ చెవుల్లో గుయ్య్  మంటావ్...
మళ్ళీ దోమాకలాపం మొదలు.... 
డాన్స్ రాని వాళ్ళను సైతం డాన్సు ఆడించే...
నీ గడుసుదనం ఎంతని చెప్పను ?
ఆడండి బాట్ తో దోమాకలాపం ,
అయినా, చెయ్యండి దోమలకు రక్తదానం.

( రాత్రి నేను నిద్దరోదామంటే నా చెవిలో గుయ్యి మంటూ రొద పెట్టి, అందకుండా పోయిన దోమకి ఈ కవిత అంకితం...)




Sunday, November 9, 2014

'కల' కలం

'కల' కలం 

నాకు పొద్దుటి నుంచి చాలా కోపంగా ఉంది. వెంటనే కలల మీద ఒక నియంత్రణా చట్టం వచ్చే దాకా... స్నానాగ్రహం (సత్యాగ్రహం లాగా ) చెయ్యాలని ఉంది. అసలు ఏం జరిగిందంటే...

రాత్రి హాయిగా నిద్ర పోయానా... అడగాపెట్టకుండా ఓ కలొచ్చింది... మేమంతా ఒక చోటు నుంచి వెళ్తున్నాం... రోడ్డుమీద నడుస్తున్నాం... ఇంతలో ఉన్నట్లుండి వరద నీరు... అలా నీటిలో నడిచి వెళ్తుంటే... పీక లోతు దాకా నీరు వచ్చేసింది... ఇంతలో... మా ముందు నడుస్తున్న వారంతా శరీరం +ఆత్మ గా విడిపోయారు. అలా మారిపోయిన వాళ్ళని కొందరు లాగి తీసుకుపోతున్నారు. నేను ఆశ్చర్యంగా చూడసాగాను. నేనలా విడిపోలేదు...

ఇంతలో ఓ మాయల మరాఠి మాంత్రికుడు దభుక్కున వచ్చేసి... ' ఓయ్... ఇదంతా నా మాయాజాలం ! నా మాయ నీ మీద పని చెయ్యలేదంటే... నీ దగ్గర ఏదో ఉంది. స్కానింగ్ ప్లీజ్... అన్నాడు.'

వాళ్ళంతా చూద్దురు కదా, నా మెళ్ళో మా గురువుగారు ఇచ్చిన లాకెట్ కనిపించింది. ఓహో, ఇదేనా, అడ్డుపడేది, ఈవిడని మన భవంతికి ఈడ్చుకు రండి, ఆ మెళ్ళో ఉన్న లాకెట్ తెంపేసి, అంతు తేలుద్దాం... అన్నాడు.



మాంత్రికుడి కార్ఖానా కు వెళ్లి చూద్దును కదా... అక్కడ కొట్టేసిన సెల్ ఫోన్ లో సిం కార్డు మార్చినట్టు, ఒకళ్ళ బాడీ కి ఒకళ్ళ ఆత్మను వాళ్ళ కోరికల్ని బట్టి తగిలిస్తున్నారు. దొరికిన ఆత్మల atm కార్డు తీసుకుని, ఆస్థుల వివరాలు తెల్సుకుని, వాళ్ళ కోరికను బట్టీ, మాంత్రికుడు వాళ్ళను వేరొకరి దేహంలోకి పంపుతాడన్నమాట ! మరో ప్రక్క శరీరాల వేలం పాట !

"ఆ రండి బాబూ రండి... కోటీశ్వరుడి బాడీ... కేవలం కోటి రూపాయిలే... కొనండి, దర్జాగా బ్రతకండి...
మరోప్రక్క...
ఆ రండి బాబూ, ఆలసించిన ఆశాభంగం... ఆంజేలినా జోలె దేహం... త్వరగా కొనండి...
ఇంకో చోట...
ఆరోగ్యమే మహాభాగ్యం బాబూ... మీ రోగాలున్న దేహం వదలండి, కొత్త నాణ్యమైన బాడీ కొనుక్కోండి..."

నాకు తిక్క రేగింది. చట్టాలు మాంత్రికుల చుట్టాల లాగా ఉన్నాయే ! ఇంత డబ్బు తింటాడా ? అనుకుంటూ ఉండగా...

మాంత్రికుడు కటింగ్ ప్లేయర్ పట్టుకు వచ్చాడు. నా లాకెట్ తెంపబోగా... నేను మా గురువుగారిని తల్చుకున్నాను. వెంటనే ఆయన ఆకాశ మార్గంలో వచ్చి, నన్ను, అక్కడ ఉన్న వారిని రక్షించారు...

ఇదండీ కల... ఏమైనా అర్ధం పర్ధం ఉందా ? పోనీ పగలు ఆలోచనలు రాత్రి కలల్లో వస్తాయి అనుకుందామంటే... నిన్న పొరపాట్న మా అమ్మాయి స్కూల్ వాళ్ళు నిర్వహించిన "కుప్పి గంతులు  , పిల్లి మొగ్గలు, జిమ్నాస్టిక్స్ , తిక్క హావభావాలు" మేళవించిన డాన్స్ పోటీలు ఓ 4 గంటలు చూసొచ్చాను. అంతకు మించి ఏ విపరీతాలు చూడలేదు. అసలు మన అనుమతి లేకుండా మన మీద ఈ కలల పెత్తనాలు ఏంటి ?

అందుకే కలల మీద "కలహింస మహాచట్టం " తీసుకు రావాలని డిమాండ్ చేస్తా ఉన్నా ! మీరేమంటారు ? మీకూ ఇలాంటి వింత కలలు వచ్చాయా ?