వాటా అప్పు
-----------------
భావరాజు పద్మిని
కాజోల్ దగ్గరికి వెళ్లి ఇలా అడిగింది సమంతా. వీళ్ళిద్దరూ సినిమా హీరొయిన్ లు అనుకునేరు. పనమ్మాయిలు, కాలానికి తగ్గట్టు పేర్లు మార్చుకున్నారు.
' ఒసే కాజలమ్మా, నీకు వాట్స్ ఆపు ఉందంటే..."
' అంటే ఏటే సమ్మంతమ్మ... రోజుకోటి మోసుకొత్తావు... ఆ మజ్జన మొబైల్ కొనీ దాకా వదన్నేదు. అది వాడకం తెల్సీసరికి చచ్చాను. అంకెలు నొక్కడం రాక, ఎవడో ఒకడికి మిస్సేడ్ కాల్ ఇచ్చేత్తే, తర్వాత వాడు మాట్టాడే బాష తెలీక నవ్వుకు సచ్చేవోల్లం. ఇప్పుడేమో... వాటా అప్పు అంతన్నావ్... ఇంతకీ ఈ అప్పు యాడ ఇస్తారంట ?'
' హ హ హ... ఓసోస్... అప్పు కాదే. రెండేలకే మారటా(స్మార్ట్) ఫోను కొన్నావా... అందులో ఈ వాట్స్ ఆపు వేయించుకోవాల... అదేదో నాటకంలో కళ్ళు కనపడని రాజుగారు...'ఏమి జరుగుచున్నది...' అంటాడు కదా... అది సూసినోడు 'వాట్స్ అప్పు' సేసాడు ... దానికి నువ్వు కార్డు ఏయించుకుంటే, నువ్వు కొఇటా (కువైట్) ఎల్లిన నీ మావతోటి కూడా ఊరికే మాట్టాడేసుకోవచ్చు...'
'అవునా, ఇదేదో బలేగుందే ! అయినా ... పొట్ట కొస్తే, అచ్చరం ముక్క రానిదాన్ని... నాకేటి తెలుస్తాది '
' నేనున్నాను గాదేటి ? మనం మాట్టాడుకోడానికే... మనలాంతోళ్ళ కోసం అందులో బొమ్మల బాశుంటది... '
'బొమ్మల బాసా... అంటే... '
'అందులో గడియారం బొమ్మ, వెకిలి నవ్వు బొమ్మ, పువ్వు బొమ్మ, గంట బొమ్మ, ఇంకేవో గుర్తులు ఉంటాయ్... అవి ఒత్తితే ఇంకొన్ని బొమ్మలోత్తాయ్... ఇల్లు బొమ్మ, గుడ్డల బొమ్మ, నవ్వే బొమ్మ, ఏడ్చే బొమ్మ, కమోడు బొమ్మ, చీపురు బొమ్మ, గిన్నెల మోరీ బొమ్మ... అన్నీ... ఇదిగో, నా ఫోన్ ల సూడు '
'అవునా, కాని నేను దీన్ని ఎలా వాడాల ?'
' ఏముంది... మోరీ బొమ్మ నేనెత్తే... గిన్నెలు తోమావా అని అర్ధం... గుడ్డ గౌను బొమ్మేస్తే గుడ్డలు ఉతికావా అని... అలాగే చీపురు బొమ్మ, కమోడు బొమ్మ... ఇల్లూడ్చావా, బాత్రూం కడిగావా... అనర్ధం... నేను ఇంటి బొమ్మ పంపితే, పని చెయ్యడానికి కొత్తిల్లు ఉంది, రమ్మని అర్ధం... ఇంకా రహస్యం బొమ్మ... మనతో తగువులేట్టుకునే వాళ్లకి కూడా ఇందులో రాకాసి బొమ్మల్ని చూసి, పేర్లు పెట్టుకుందాం... నీ మావకి నవ్వే బొమ్మలు, ఏడ్చే బొమ్మలు, ఆచ్చర్యం బొమ్మలు, తల పగలగొడతా అన్నట్టు తల తిరిగే బొమ్మలు, లవ్వు బొమ్మలు, పువ్వు బొమ్మలు అంపు. నీకు ఏదైనా నచ్చితే, అంగూటా పైకెత్తిన బొమ్మ, నచ్చకపోతే, కిందకు దించిన బొమ్మ , అమ్పేసేయ్...'
'ఓహ్, ఇదేదో యాపారానికి, బలేగుందే. మరి మా తమ్ముడు డైవరు గందా, వాడికీ ఈ వాటా అప్పు పనికొచ్చుద్దా ?'
'ఓహ్, బెమ్మాండంగా, వెళ్ళే కార్ బొమ్మ- అంటే పనుంది వెళ్తావా అని , వచ్చే కార్ బొమ్మ వస్తున్నా అని , కుదరక పొతే కొట్టేసిన బొమ్మ, కుదిరితే అంగూటా పైకెత్తిన బొమ్మ, ట్రాఫ్ఫిక్ సిగ్నలు బొమ్మ ఇలా వాడతన్నారు డైవర్లు...'
'సరేగాని,నేను అంపిన బొమ్మ నువ్వు సూసేవని ఎలా తెల్సేది...'
'దానికీ కనిపెట్టేసినాడు ఈడు మందు... ఒక నల్ల టిక్కు ఉంటే, నీ బొమ్మ ఎల్లినట్టు, రెండు నల్ల టిక్కులు ఉంటే ఎల్లింది కాని, వాళ్ళు సూడనట్టు... రెండు బులుగు టిక్కులు వస్తే... సూసినట్టు... ఇంకా ఫోటోలు, యీడియో లు , అంపవచ్చు..., అన్నట్టు మర్చిపోయానోసే, కాజలమ్మ... అసలు బొమ్మలు కూడా అమ్పక్కర్లేని బెమ్మస్త్రం ఉందీడ...'
'ఏంటో అది... బండ పుల్ల కింద చందమామ పెట్టినట్టు ఉన్న బొమ్ముంతాది... అది నొక్కి, నువ్ మాటాడి ఒదిలితే, నీ మాట చనాల్లో మీ మావ దాకా ఎల్తాది... ఇది శానా తేలిక...'
'మరి సేప్పవేటే... పద ఎల్దాం నాకూ, వెంటనే వాటా అప్పు కావాలి...'
సూపరో..సూపర్..హహహ..
ReplyDelete