Friday, December 23, 2016

మృత తవిక

మృత తవిక
--------------
భావరాజు పద్మిని - 23/12/16

చీకేసిన తాటి టెంక లా ఎండిన బ్రతుకుల్లోకి
నత్తలా పాక్కుంటూ వస్తుంది మరణం,
మన ప్రక్కనే కూర్చుని జబర్దస్త్ ప్రోగ్రాం చూస్తూ
ఛానల్ మార్చమంటూ చిక్కిశల్యమై వేడుకుంటుంది.
ఎండిన కొబ్బరిమట్టొకటి ఈడ్చుకుంటూ వస్తూ,
బండెడు పాతనల్లనోట్లున్నట్టు చతికిలపడుతుంది.
నిర్జనారణ్యంలో రుధిర ధారల జలపాతాల హోరులో,
హెడ్ ఫోన్స్ పెట్టుకు పాప(పాప్) సంగీతం వింటుంది.
పగిలిపోయిన సైకిల్ టైర్ దొర్లించుకు వస్తూ,
సగం కాలిన మొక్కజొన్నపొత్తు లాక్కుని తినేస్తుంది.



మరణంతో రణం అంత తేలికేం కాదు...
వారుణం తాగితే ఎ.టి.ఎం. పిన్ మర్చిపోరు.
చితిమంటల కోరల్లో చిక్కిన చీపురుపుల్ల
రసాయనిక శక్తి మార్పిడిలో మాడిపోయినా,
బూడిదలో మరణమృదంగం వాయిస్తుంది.
అస్తిపంజరాల సౌధంలో కపాలాల తీగమీద
ఆరేసుకున్న పాత బట్టలు చలికి ఆరి చావట్లేదు.
ఆరబెట్టుకోడం తెలీక ఆవురావురుమంటుంటే,
మళ్ళీ ఈ దిక్కుమాలిన చావు తవికలొకటా... అకటా...
దయలేని వారు మీ కవికులము వారు.

("సచ్చినాక నవ్వలేవురా..." అన్న మనసుకవి ఆచార్య ఆత్రేయ గారన్నట్టు మనకి ఊపిరున్నంత వరకే నవ్వడానికి సమయం ఉండేది. కాని, కొంతమంది కవులు మాట్లాడితే చావు, చితిమంటలు, అస్థిపంజరాలు, కళేబరాలు ... వంటివి ఎత్తి రాస్తుంటారు. దీని ద్వారా ఏం చెప్పదలచుకున్నారో కూడా తెలీదు. ఈ మృత సాహిత్యం ఎందుకో నాకు నచ్చదు. వీరికి తెలియాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఈ ప్రకృతి పెద్ద అయస్కాంతం(అద్దం) వంటిది. మన మనసులోని ఆలోచనలు ఏ విధంగా ఉంటే, ఆ విధమైన జీవనాన్నే ఇది ప్రసాదిస్తుంది. అంటే, మరణాన్ని గురించి మాట్లాడితే, వద్దు బాబోయ్ అనేదాకా ఆ రుచీ చూపించి ఒదులుతుంది. అందుకే వీలైనంత తక్కువగా ఈ మాటలని వాడడం, రాయడం మంచిది. జంధ్యాల గారు అన్నట్లు ఈ క్షు.ర (క్షుద్ర రచయతలకు/రచయిత్రులకు ) ఇదే నా నజరానా ! కేవలం నవ్వుకోడానికే. వాదోపవాదాలకు బోలెడంత తీరికున్నవారు వారి గోడ మీదే ఉన్న అమ్మలక్కలతో/అయ్యలన్నలతో వాదులాడుకోమని మనవి.)

No comments:

Post a Comment