Saturday, October 15, 2016

రాగంతో రోగం


రాగంతో రోగం
--------------
భావరాజు పద్మిని - 15/10/16

ఎప్పటినుంచి నిన్ను తొలిసారిగా చూసానో,
అప్పటినుంచి నీ కంట్లో ఎలాగైనా పడాలని,
మూర్చరోగిలా ఎక్కడికక్కడ దభేలున పడుతూ లేస్తూ,
తాళాల గుత్తులు పుచ్చుకుంటూ ఉన్నాను.
రెండు కిలోలు అమ్మాను, కాని నువ్వు చూడలేదే !

ఎప్పటినుంచి కిచకిచలాడే నీ మాట విన్నానో,
అప్పటినుంచి విక్స్ బిళ్ళలు డజను పట్టుకుని,
'గొంతులో కిచ్ కిచా?' అంటూ కోరింతదగ్గు వచ్చినట్టు,
నీ ధ్యాస మళ్ళించడానికి దగ్గుతూనే ఉన్నాను.
కానీ, నువ్వు నన్నసలు పట్టించుకోలేదే !

నీ పెర్ఫ్యూమ్ పరిమళం ముక్కుపుటాలకు తాకగానే,
మరే వాసనా వద్దనుకుని, మగ గాంధారిలా
ముక్కుకు స్వైన్ ఫ్లూ మాస్క్ కట్టుకు తిరుగుతున్నాను.
కానీ ఆ పెర్ఫ్యూమ్ ఏ బ్రాండ్ దో తెలీలేదే !



నువ్వు నావంక చూస్తే చాలు అదేంటో గాని
రక్తపోటు పెరిగేసి, హృద్రోగం వచ్చినవాడిలా
నా గుండె లకలకలక గీతం పాడుతుంది.
కొంపతీసి ఏమైనా బ్లాక్స్ ఉన్నాయో ఏమో ?

ఆకలి నిద్రా ఇంటి అడ్రస్ వదిలి పారిపోయాయి,
ఆంక్సైటి అన్నారు, ఏవేవో మందులిచ్చారు.
కీళ్ళరిగేలా నీవెనుక పరుగులు తీశాను
ఒక్కో మోకాలి చిప్పా మూడు లక్షలుట !
నువ్వు తప్ప లోకంలో ఏమీ కనిపించట్లేదు
4 థ్ స్టేజి ఆఫ్ హాల్యూసినేషన్ అంటున్నారు.


అసలు ఇన్ని రోగాల ప్రేమరోగానికి,
ఏ మల్టిస్పెషాలిటీ ఆసుపత్రిలో అయినా
ఎంత ఖర్చైనా చికిత్స వీలుతుందా అంట?
అందుకే ప్రేమలో పడే ముందు జాగ్రత్త కోసం
ముందస్తుగా మెడికల్ ఇన్స్యురెన్స్ చేయించుకోండి.
వీలయితే లైఫ్ ఇన్స్యురెన్స్ కూడానూ, ఏమంటారు ?

(అలా చదివి నవ్వుకుని, ఊరుకోవక్కర్లేదు... మీరు కూడా సరదాగా రాగాన్ని, రోగాన్ని కలిపి ఓ నాలుగు లైన్స్ రాయండి చెప్తా .)




No comments:

Post a Comment