Sunday, May 1, 2016

ఒక్క నిముషంలో...

ఒక్క నిముషంలో...
--------------------------
భావరాజు పద్మిని - 2/5/16

నిముషానికి ఒక్కమాట మాట్లాడతారు కొంతమంది. మాటకీ మాటకీ మధ్య మరో నిముషం పాస్ ఇస్తారు. అప్పుడు 'తరవాత, అంటే, అసలూ, నేనూ, ఇంకా...' లాంటి పదాలు వాడేస్తూ వినేవాళ్ళని ఉతికేస్తూ ఉంటారు. ఈ స్పీడ్ తట్టుకోలేక మెదడులో వింటున్న మాటల తాలూకు భావాల్ని తర్జుమా చేసే స్పీడోమీటర్ సుడిగాల్లో దీపంలా టప్పున ఆరిపోతుంది. తర్వాతేముంది... 'మీ పెదాలేవో శబ్దాన్ని వెలువరిస్తాయి, నాకు బ్రహ్మచెవుడు వచ్చేస్తుంది.' తదనుగుణంగా నా స్పందన కూడా 'అలాగా, సరే, ఓకే అండి, ఉహు...' గా ఆటోమాటిక్ గా తర్జుమా అయిపోతుంది. అసలు ఇటువంటి వాళ్లకు 'ఒక్క నిముషం' విలువ తెలుసా అని సభాముఖంగా అడుగుతున్నా అధ్యక్షా ! ఏవిటీ, మీకూ తెలీదా... నేను చెప్తాగా!

౧. ఒక్క నిముషంలో సుమారు వంద చీమలు , వెనక్కి తిరిగి చూడకుండా, నోట్లో ఉన్న పంచదార పలుకుతో సహా, సుమారు 60 సెంటిమీటర్ల పైన ప్రయాణిస్తాయి.
౨. ఒక్క నిముషంలో క్లాసులో మాష్టారి 'జోల పాఠాలు' వింటూ, హాయిగా ఆవులించిన విద్యార్ధి నోట్లోకి దరిమిలా ఒకటో రెండో దోమలు 'గుహప్రవేశం' చేసి, ఆత్మహత్య చేసుకుంటాయి.
౩. ఒక్క నిముషంలో నత్తలు కూడా సుమారు ఓ ఐదు సెంటీమీటర్లు ఒకదాని మీదనుంచి ఒకటి జారుడుబండ జారుకుంటూ వెళ్ళిపోతాయి.
౪. ఒక్క నిముషంలో అరడజను పీతలు, ముందుకు వెళ్ళబోతున్న తమ నేస్తాల వెనుక కాళ్ళు పట్టుకుని, పుటుక్కున లాగి పడేస్తాయి.
౫. ఒక్క నిముషంలో వీధికుక్క వెంటబడ్డ అభాగ్యుడు 'పి.టి. ఉష' ను తలదన్నే వేగంతో పారిపోయి, వీధిలోంచి మాయమవుతాడు.



౬. ఒక్కనిముషంలో 'అదృష్టం కోట్లు తెచ్చింది' అన్న ఆరువందలతొంభై ఆరవ ఎస్.ఎం.ఎస్ చదివిన సగటు భారతీయుడు ఆనందంతో రంకెలెయ్యబోయి, 'ఆటల్లో అరటిపండు' తూచ్ అనుకుని, మళ్ళీ స్పృహలోకి వచ్చేస్తాడు.
౭. ఒక్కనిముషంలో కలలోనే ఏ పాస్పోర్ట్, వీసా లేకుండా, కాస్ట్లీ కలలు గంటూ, నచ్చిన హీరోయిన్ తో స్టెప్పులు వేసుకుంటూ, మేఘాల్లో తేలిపోయే మానవుడు, పవర్ కట్ దెబ్బకి దబ్బున లేచి, మంచం మీంచి కింద పడతాడు.
౮. ఒక్కనిముషంలో కొన్నేళ్ళపాటు స్కాముల్లో కూడబెట్టిన దొంగడబ్బంతా అడ్రస్ లేని విదేశీ బ్యాంకుకు మారుస్తున్న 'మేసే నేత' ఐ.పి అడ్రస్ హాక్ చేసిన ఏ సి.బి.ఐ వాళ్ళకో చిక్కి, చక్కగా కటకటాలు లెక్కెట్టాలని భయపడి, ఏ గుండెనొప్పో నటించి, కార్పొరేట్ హాస్పిటల్ లో చేరి, చివరికి దాచినదంతా మళ్ళీ తీసి, చచ్చినట్టు ఆసుపత్రి వారికి సమర్పించేసుకుంటాడు.
౯. ఒక్క నిముషంలో టింగు రంగామని తయారై బైటికి వెళ్తున్న వాళ్ళ తెల్లచొక్కా మీద మనసుపడ్డ పావురం పైనుంచి రెట్ట వేస్తే, అవాక్కైన సోగ్గాడు, 'టైడ్' ను తల్చుకుని కుమిలిపోతాడు.
౧౦. ఒక్క నిముషంలో తాను రాసిన చక్కటి తెలుగు పాటను, ముక్కుతో పాడే పరభాషా గాయకుడు యధేచ్చగా ఖూనీ చేస్తుంటే, వాడి ముక్కు మూసి చంపెయ్యాలన్న బలీయమైన కోరికను గేయ రచయత మానవతా దృక్పధంతో అణచుకుంటాడు.

అంతే కాదు... ఒక్క నిముషంలో ఎన్ని అలలు పడి లేస్తాయో, ఒక్క నిముషంలో మీడియా వాళ్లకు ఎన్ని తొక్కలో వార్తలు అందుతాయో, ఒక్క నిముషంలో ఎంతమంది పుడతారో, పోతారో, ఒక్క నిముషంలో ఏనుగు ఎన్ని క్వింటాళ్ళ నీళ్ళు తాగుతుందో, ఒక్క నిముషంలో సీరియల్ లో ఎక్స్ప్రెషన్ అర్ధంకాని అన్ని ముఖాలు, వెర్రి ప్రేక్షకుడికి తిప్పితిప్పి, మళ్ళీ మళ్ళీ ఎలా చూపిస్తారో, ఒక్క నిముషంలో ఎన్ని కార్లు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కి, దిక్కుతోచక దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తాయో, తెల్సటోయ్ నీకు ! అబ్బా , మాటల వేగం పెంచకపోతే, పెపంచకమంతా ఇంతంత ముందుకు వెళ్ళిపోతుంది. నువ్వూ, నేనూ 'ఫెవికాల్ కీ మజ్బూత్ జోడీలా' ఫోనుకే వెళ్లాడతాం... అంచేత... అదన్నమాట !

No comments:

Post a Comment