Wednesday, October 14, 2015

నలకలతో నాన్

నలకలతో నాన్ 
---------------
భావరాజు పద్మిని - 14/10/15 

టీవీ లో వస్తున్న 'సరికొత్త వంట ' కార్యక్రమం 1315 భాగాన్ని, ఎప్పటిలాగే పెన్ను డైరీ పట్టుకుని, రెప్ప వెయ్యకుండా చూస్తోంది వెంగళమ్మ. ఆ రోజు 'నలకలతో నాన్' అనే కొ(చె)త్త వంటకం చూపిస్తున్నారు.

టీవీ లో సగం మొహం జుట్టుతో కప్పుకున్న శాల్తీ వచ్చింది. పేరు జూలీ ట.
"చూడండి, నలకలు ఆరోగ్యానికి చాలా మంచివి. పైగా బియ్యం ఖర్చు, కూరగాయిల ఖర్చు కూడా ఉండదు. ముందుగా ఇల్లు మొత్తం బాగా డేకేస్తూ, కంటికి కనిపించిన నలకలు అన్నీ ఏరుకురావాలి. కంటి చూపు మందగించినవారు చీపురుకట్టతో ఊడ్చి, ఆ కసువును నాన్ కు వాడవచ్చు అనుకోండి..."

ఆశ్చర్యంగా తెరిచిన నోటిని ముయ్యడం కూడా మర్చిపోయి చూస్తోంది వెంగళమ్మ.

ఈ లోపు ఆంకరమ్మ జోక్యం కల్పించుకుని, "అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది, చెప్పండి జూలీ  !" అంది.

"చూడండి, మట్టిలో చాలా శక్తి ఉంటుంది. చిన్నప్పుడు మనం మట్టి తినేవాళ్ళం కదా ! మరి నేటి తరం వారు ఇంక్యుబేటర్ కోళ్ళలా ఏసీలలో పుట్టి, ఏసీలలో పెరుగుతున్నారు. మరి వాళ్లకు బలం ఎలా వస్తుంది ? మట్టికి దూరమై మళ్ళీ 'మడ్ బాత్ లు' అంటూ వెళ్తున్నారు. అంతెందుకు శ్రీకృష్ణుడే మన్ను తిన్నాడు కదా ! అందుకే, అదే ఐడియా ను వాడి, ఇది తయారుచేసాను." అంది జుట్టు ఎగరేస్తూ జూలీ.

ఆ తర్వాత కసువు ఏరడం, చెంచాడు మైదా పిండితో కలిపి నాన్ చెయ్యడం, చెప్పింది చెప్పినట్టు రాసుకుంది వెంగళమ్మ, ఆమె కేవలం రాసి ఊరుకునే రకం కాదు, చూసి ఊరుకోమంటే, నాన్ లు చేసి, కాల్చి కాని, ఊరుకోదు. సాయంత్రానికి నలకలతో నాన్ లు సిద్ధమయ్యాయి. ఆవురావురు మంటూ ఇంటికి వచ్చాడు ఆదికూర్మయ్య. వేడి వేడి రొట్టెలు, నోట్లో పెట్టగానే పంటికింద కసక్కుమని, జ్ఞానదంతం ఊడినట్లు అనిపించింది. అంతే, చంటబ్బాయ్ సినిమాలో శ్రీలక్ష్మి వంట తిని, మతి చెడిన ఎడిటర్ లాగా ఇలా మాట్లాడసాగాడు...



"ఏమేవ్... ఆ మొలతాడుతో స్కిప్పింగ్ ఆడద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను ? తనకు పోటీ వస్తున్నావని, పూలన్దేవి నొచ్చుకోదూ... అయినా బాహుబలి నేను ఎందుకు తీసాను, రుద్రమదేవి సినిమాకు బదులు దీనికి అవార్డు ఇస్తుందనే కదా... మరి ఆ రాజ్ మౌళి అలా అంటాడేవిటి ? కట్టప్ప కట్టుడు పళ్ళు నేను కొట్తేసాను అంటాడేవిటి ?

ఇదిగో, ఎవరక్కడ, వెంటనే ఒక డైనోసార్ ని సైకిల్ తొక్కుకుంటూ రమ్మనండి. హారీ పొట్టర్ హారతి ఇస్తాట్ట. అసలే ఆ చక్కరపొంగలికి దిష్టి తగిలి, చక్కెర వ్యాధితో ఐ.సి.యు లో వెంటిలేటర్ మీదుంది. నేనెళ్ళి చూసొస్తా.

భౌ, భౌ... ఏమేవ్... ఆ కుక్కకి కాసిన్ని పాం బిళ్ళలు పెట్టు, దాని అరుపులకి భయపడి, పిపీలికానికి హార్ట్ అటాక్ వచ్చిందట. వస్తామారి, రేపు కాట్ విన్స్లెట్ నాతో కోతికొమ్మచ్చి ఆడతానంది. నేను వెంటనే వెళ్లి, ఓ బుల్ డోజెర్ అద్దెకు తేవాలి. " అంటూ బైటికి వెళ్లిపోతుంటే... చటుక్కున లాగి, బలవంతంగా కుర్చీకి కట్టేసింది వెంగళమ్మ. ఆ క్షణం నుంచే, 'న కరోమి టీవీ వంట జిందగీ మే...' అన్న కొత్త నోము పట్టింది. అంటే ఏవిటో తెలిసిందిగా, అదన్నమాట !

No comments:

Post a Comment