Saturday, June 6, 2015

ఆరు నూరైతే

ఆరు నూరైతే

భావరాజు పద్మిని - 6/6/15

చదవడానికి ఇది నికృష్టంగా ఉంటుందని తెలుసు ! అయినా, చదవడానికే మీకు అంత కష్టంగా ఉంటే, తరతరాలుగా, అవే సినిమాల్లో హీరొయిన్ ను అవే వేషాల్లో చూసి, మాకెంత విసుగు పుట్టాలి ? ఏ సినిమా చూసినా, కాస్త ఫ్యామిలీ సెంటిమెంట్, కాస్త ఫ్యాక్షన్, బోలెడంత డబ్బున్న హీరో, అతనికి 2-3 హీరొయిన్ లు, అవీ కొసరు పాత్రలు. గత కొన్నేళ్లుగా ఇంతేగా ? అప్పుడెప్పుడో మా అమ్మమ్మ చెప్పినట్లు 6 రూపాయిలకు దొరికే బియ్యం బస్తా, నూరయ్యి, ఇప్పుడు వేలు కూడా దాటింది. అందుకే, సినిమా చూసేవారు హీరో పాత్రలో హీరొయిన్ ని ఊహించుకుంటే... ఎలా ఉంటుందో, మీరే చదవండి.

ఓపెనింగ్ షాట్... హీరొయిన్ కాలి చెప్పు చూపుతారు. అక్కడినుంచి ఆమె జడగంటల దాకా ఓ మూడు నిముషాలు కెమెరా ఆవిడ చుట్టూ తిరుగుతుంది. ఆవిడ, జడ ముందుకు లాగి ఎడమ ప్రక్కకు కొడుతుంది - ఎడమ ప్రక్క ఉన్న సుమో ఆకాశాకర్షణ వల్ల గాల్లోకి ఎగిరి పేలిపోతుంది . అలాగే ఈ సారి జడను విసురుగా కుడిప్రక్కకు లాగి కొట్టగానే - ఇంకో సుమో, అదన్నమాట ! డౌట్ లు అడక్కండి, తెలుగు ప్రేక్షకుడి స్థాయి వెర్రిమొహం వేసుకు చూడడం వరకే ! తొడ కొడితే ఎగిరే సుమో, జడ కొడితే ఎందుకు ఎగరదూ అంట ? ఆ తర్వాత హీరొయిన్ తన కాలి బొటన వేలుతో రౌడీల్ని తాకగానే, వాళ్ళు బుర్రలు పగిలి, కలవరంగా పరిగెత్తుతారు. ఆమె చేతి మునివేళ్ళు రౌడి లకు తాకగానే, వాళ్ళు భూమిలోకి కూరుకుపోతారు. అప్పుడు హీరొయిన్ (మీసాలు లేవు కనుక ) కనుబొమ్మ  పైకెత్తి విలాసంగా చూస్తుంది. వెంటనే టైటిల్ సాంగ్. 'చేతికింద కొస్తే చెయ్యి దెబ్బ... కాలికింద కొస్తే కాలి దెబ్బ...' అని.


కాని పాపం ఈవిడకి చాలా డబ్బు ఉంటుంది అన్నమాట. ఏం చేసుకోవాలో తెలీక, పనివాళ్ళని లెంపకాయలు కొట్టి, వెంటనే జాలిపడి, నోట్లు విసిరేస్తుంది. ఒకరోజున ఆవిడ తన హెలికాప్టర్ లో సరదాగా తిరగడానికి వెళ్తే, అదొక పొలంలో ఆగిపోతుంది. ఆ పొలంలో కండలు తిరిగి, గోచీ పోసుకు పని చేస్తున్న సుబ్బడు చాలా బీదవాడు. ఆపదలో ఆమెకు సాయం చెయ్యడంతో జాలిపడి, ప్రేమిస్తుంది(డబ్బివ్వచ్చుగా అని అడక్కండి, అదంతే ... లవ్ ఎట్ ఫార్మ్ సైట్ ). కాని, ఆమె ఇంటికి వెళ్లేసరికి, మరొక ఫ్యాక్షన్ 'ఇష్టుడి' కొడుకు 'ఎలుక్తో ఆమె పెళ్లి కుదిర్చేస్తారు. విసుగెత్తి, నైట్ క్లబ్ కి వెళ్తే, అక్కడ ఆరు కండలు (సిక్స్ ప్యాక్ ) కనిపించేలా ఐటెం సాంగ్ కి డాన్స్ చేస్తుంటాడు వీరమల్లు. హీరొయిన్ హృదయం చాలా విశాలమైనది కావడంతో ఇతడిని కూడా ప్రేమిస్తుంది. చివరికి అతిసుకుమారి అయిన మన హీరొయిన్ ఎవరిని పెళ్లి చేసుకుంది, అని ఆలోచిస్తూ, కాసేపు బద్దలుకొట్టుకున్న మన బుర్రలు స్తంభించిపోతాయి, పాటల కల్లోలంతో.

ఈ లోపల సుబ్బడి ఫ్యామిలీ సెంటిమెంట్, టన్నుల కొద్దీ మమకారాలు - ఎలుక్ ఫ్యాక్షన్ ఫ్యామిలీ కర్కశత్వం, కారే రక్తాలు, టమాటో సాస్ లు  - వీరమల్లు సినిమా కష్టాల ఫ్యామిలీ ఇక్కట్లు - వీటిమధ్య హీరొయిన్ ఎటూ తేల్చుకోలేక పోతుంది. ముగ్గురితో సమానంగా పాటలు పాడుకుంటుంది.  ఓ డజను వాహనాలు తగలేట్టాకా, 500 మంది ఆడ, మగ రౌడి లు రక్తాలు కక్కుకు చచ్చాకా...హీరొయిన్ లో ఉన్న అనేక సద్గుణాలు ప్రేక్షకులకి తెలుస్తాయి.

మధ్యమధ్య నటించిన వాళ్ళు మాత్రమే నవ్వే కొన్ని కామెడీ సీన్ లు వస్తాయి. టికెట్ కొన్నారు కనుక, మనమూ నవ్వక తప్పదు ! బీద హీరో తో  విదేశాల్లో అరువిచ్చుకున్న ఎక్ష్త్రా లకు బిచ్చగాళ్ళ వేషాలు వేసి, చిరుగు లుంగీలు కట్టి, డాన్స్ ఆడిచ్చాకా ... (ఊహలకి లిమిట్స్ ఉండవు... ఇక్కడా రూల్స్ పెట్టకండి ) వీరమల్లు చచ్చిపోతాడు, ఎలుక్ త్యాగం చేసి, చరిత్రలో నిలిచిపోతాడు. చివరికి తొలి ప్రేమ గెలుస్తుంది. హీరొయిన్ సుబ్బడిని పెళ్లి చేసుకుని, వెంటనే తన తోటమాలిని పన్లోంచి తీసేస్తుంది. ఇద్దరూ హాయిగా ఆడుతూ, పాడుతూ తోటపని చేసుకుంటూ ఉండగా... వస్తుంది ఒక చిన్న పాప. తన పరికిణీ అంచు పైకెత్తి కాలు నేల మీద కొట్టగానే, వీళ్ళు అప్పుడెప్పుడో పాతిన మొక్కలు కూకటివేళ్ళతో సహా పెకిలించబడి , నేల వాలిపోతాయి ... అప్పుడే చివరి కార్డు పడుతుంది... 'హిస్టరీ రిపీట్స్' అని ... పిక్చర్ ఔర్ ఏక్ ఐసే హీ బనేగా మేరే దోస్త్... వెయిట్ అండ్ వాచ్... :)

(ఫ్యాక్షన్ లేకుండా సినిమాలు తియ్యలేరా అని నాకో సందేహం. హీరొయిన్ స్థాయి హీరోతో ఒళ్ళు విరిగేలా గెంతులు వెయ్యడం, హీరో తంతుంటే ఓ మూల బిక్కుబిక్కు మంటూ నిల్చుని చూడటం తప్ప, ఎన్నటికీ పెరగదా అన్న అనుమానం... ఒక్క లక్కీ లెగ్ హీరొయిన్, ఒక గ్లామర్ హీరొయిన్, ఒక ఐటెం డాన్సర్ ... లేకుండా ఒక్క హీరొయిన్ తో కధ నడవదా అన్న ఆలోచన... అన్నీ కలగలిపి, నిన్న ఓ సినిమా చూస్తుండగా... 'హీరో హీరొయిన్ అయితే...' అన్న ఐడియా తో కలిగిన అజ్ఞానోదయ పరిణామం ఇది. )


No comments:

Post a Comment